ఏలూరుకు వైఎస్ఆర్ సీపీ స్పెషల్ మేనిఫెస్టో
కొల్లేరు సరస్సును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తామని ఏలూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.తోట చంద్రశేఖర్ వెల్లడించారు. కొల్లేరు లంక గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను డా.తోట చంద్రశేఖర్, ఏలూరు నగర ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆళ్ల నానిలు శనివారం ఇక్కడ విడుదల చేశారు. మోడల్ సిటీగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయడంతోపాటు నిర్వాసితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పోలవరం ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చింతలపూడి, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని వివరించారు. ఏలూరులో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్తోపాటు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నూజివీడులో మ్యాంగో మార్కెట్ యార్డ్ ఏర్పాటు, ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఏలూరులో సూపర్ స్పెషాలిటి హాస్పటల్, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఆక్వాహబ్ ఏర్పాటు చేస్తామన్నారు. తమ్మిలేరు నుంచి ఏలూరుకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తామని తోట చంద్రశేఖర్, అళ్ల నాని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు.