ఎడారిని తలపిస్తున్న కొల్లేరు | kolleru lake looks like desert | Sakshi
Sakshi News home page

ఎడారిని తలపిస్తున్న కొల్లేరు

Published Sun, Jan 31 2016 4:22 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

నీరు లేని కొల్లేరులో గడ్డి తింటున్న మేకలు

నీరు లేని కొల్లేరులో గడ్డి తింటున్న మేకలు

బీటలు వారిన చిత్తడి నేల
వలసపక్షులకు నీటి కొరత
సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు  
మాయమైన పచ్చదనం

 
కైకలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. విడిది కోసం వలస వచ్చే అతిథి పక్షులు నీటికోసం,ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది.

ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. ఒక్క కృష్ణాజిల్లా నుంచే వివిధ డ్రెయిన్ల ద్వారా 35 వేల 590 క్యూసెక్కుల నీరు కొల్లేరులో కలుస్తుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి.

అలమటిస్తున్న అతిథి పక్షులు
కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, అస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవి స్తున్నాయి. ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కా లం. కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులకు వేట కరువైంది. కరువు పరిస్థితులు పక్షుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పక్షుల విహార చెరువులో పూర్తిస్థాయిలో నీరు నింపలేదు.
 
సముద్రపు నీరు కొల్లేరులోకి...
కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంటపొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లా కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు పాడయ్యాయి. కొల్లేరుకు చేరే నీరు పెద ఎడ్లగాడి, చినఎడ్లగాడి  కాలువలకు చేరుతుంది. అక్కడ నుంచి ఉప్పుటేరులో కలసి 40 కిలోమీటర్ల దూరంలోని కృత్తివెన్ను వద్ద సముద్రంలో కలుస్తోంది. రెగ్యులేటర్ నిర్మించి నీరు నిల్వ చేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉప్పునీరు చేరడంతో కొల్లేరులో చేపజాతులు అంతరించిపోతున్నాయి.
 
కొల్లేరు ప్రమాదంలో పడింది
కృష్ణా డెల్టా కరువు పరిస్థితులు కొల్లేరుపై తీవ్ర ప్రభావం చూపాయి. అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులకు కొల్లేరు నీరు తరలిస్తున్నారు. సముద్రం నుంచి ఉప్పునీరు కొల్లేరుకు చేరుతోంది. ఈ నీటి కారణంగా చేపలు మృత్యువాతపడుతున్నాయి. సముద్రపు నీరు చేరడంతో రెండు జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట పొలాలు చౌడు భూములుగా మారాయి.
- యెర్నేని నాగేంద్రనాథ్, కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు
 
రెగ్యులేటర్ నిర్మించండి
కొల్లేరు ఆపరేషన్‌కు సహకరిస్తే రెగ్యులేటర్‌ను బహుమతిగా అందిస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. రెగ్యులేటర్ నిర్మిస్తే కొల్లేరులో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటిలో ఫింగర్ లింగ్స్ (2 అంగుళాల చేప పిల్లలు)ను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. ప్రభుత్వం త్వరగా రెగ్యులేటర్‌ను నిర్మించాలి.
- బలే ఏసురాజు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement