Kolleru Lake: పక్షుల ‘కొంప కొల్లేరు’ | Decreased bird Wandering In Kolleru | Sakshi
Sakshi News home page

Kolleru Lake: పక్షుల ‘కొంప కొల్లేరు’

Published Mon, Apr 19 2021 5:22 AM | Last Updated on Mon, Apr 19 2021 9:23 AM

Decreased bird Wandering In Kolleru - Sakshi

కొల్లేరులో సంచరించే కొంగ జాతి పక్షులు

చుట్టూ కిక్కిస పొదలు.. వాటి నడుమ అందమైన జలదారులు.. ఏదో అత్యవసర పని ఉన్నట్టు నీటి అడుగున అటూ ఇటూ రయ్యిన పరుగులు తీసే పిల్ల చేపలు.. ఎటు చూసినా ఒంటి కాలి జపం చేసే కొంగలు.. దూరతీరాల నుంచి వలస వచ్చే అతిథి విహంగాల విడిదులు.. కిలకిల రావాలు ఆలపించే బుల్లి పక్షులు. కొల్లేరు సరస్సు వైపు తొంగి చూస్తే.. ఇలాంటి రమణీయ దృశ్యాలెన్నో కనువిందు చేసేవి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కానరావడం లేదు. 

ఆకివీడు (పశ్చిమ గోదావరి): స్వదేశీ పక్షులతోపాటు విదేశీ పక్షి జాతులకు ఆలవాలమైన కొల్లేరు సరస్సులో వాటి సందడి తగ్గిపోతోంది. పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టాల నడుమ విస్తరించి ఉన్న కొల్లేరుపై ఆధారపడి 30 ఏళ్ల క్రితం వరకు 2 కోట్ల పక్షులు మనుగడ సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య  భారీగా తగ్గిపోతోంది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొల్లేరులో పక్షిజాతి గణాంకాలను అభయారణ్య శాఖ సేకరించింది. ఆ మూడు నెలల్లో 3.05 లక్షల పక్షులు విహరించినట్టు అంచనా వేసింది.

సహజంగా శీతాకాలంలో కొన్ని రకాల విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి విడిది చేస్తుంటాయి. ఈ ఏడాది ఆ పక్షుల రాక కూడా తగ్గింది. సరస్సులో ప్రస్తుతం సుమారు 1.20 లక్షల మేర పక్షులు మాత్రమే సంచరిస్తున్నాయని అభయారణ్య శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. అంటే రెండు నెలల వ్యవధిలో వాటి సంఖ్య 60 శాతం మేర తగ్గిపోయినట్టు అంచనా వేశారు. 

ఆక్రమణలు, కాలుష్యమే కాటేస్తున్నాయి 
వేసవిలో సహజంగానే కొల్లేరులో సంచరించే పక్షుల సంఖ్య తగ్గుతుంది. కానీ.. శీతాకాలంలోనూ వాటి సంఖ్య విపరీతంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సరస్సులో ఆక్రమణలు, కాలుష్యమే కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మరోవైపు విదేశీ పక్షులు సరస్సులో విడిది చేసే రోజులు సైతం తగ్గిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. గతంలో వలస పక్షులు 120 నుంచి 150 రోజుల వరకు ఇక్కడ విడిది చేసేవి. ప్రస్తుతం వాటి విడిది రోజులు సగటున 60 రోజులకు పడిపోయింది. సరస్సులో వాటి సహజసిద్ధ మనుగడకు అవకాశాలు లేకపోవడం, పక్షుల ఆవాసాలు తగ్గిపోవడమే దీనికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.

గత ప్రభుత్వాలు కొల్లేరు పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సరస్సు కుంచించుకుపోయిందని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న గణాంకాలకు, వాస్తవ గణాంకాలకు చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొంటున్నారు. సరస్సును, దీనిపై ఆధారపడిన పక్షి జాతులను కాపాడటం ద్వారా ఇక్కడి జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. 

ఆటపాకలోని పక్షుల కేంద్రం 

ఈ చర్యలు చేపడితే మేలు 
కొల్లేటి సరస్సులో పక్షుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన చర్యలపై పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి. 

► కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సు అభివృద్ధి జరగలేదు. సరస్సులో మేటవేసిన పూడికను, పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలి.  

► సరస్సులో ఆక్రమణల్ని తొలగించాలి. నీటిమట్టాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. 

► సరస్సు వెంబడి పలు ప్రాంతాల్లో పక్షుల ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహజ సిద్ధ ఆవాసాలు పెరిగేలా చూడాలి. చిత్తడి నేలల్లో పెరిగే వృక్ష జాతిని అభివృద్ధి చేయాలి. 

► పక్షుల వేట నిషేధాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. నామమాత్రంగా ఉన్న చెక్‌పోస్టులను పటిష్టపరచాలి. 

► స్థానిక గార్డులను బదిలీ చేసి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గార్డులుగా నియమించాలి. 

కారు చీకట్లో కాంతి పుంజం 
కొల్లేరులో సంచరించే పక్షి జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో కారు చీకట్లో కాంతి పుంజంలా ఇటీవల నాలుగు రకాల కొత్త పక్షులు ఇక్కడ సంచరిస్తున్నట్టు అభయారణ్య అధికారులు గుర్తించారు. వీటిలో సీగల్‌ (బ్రౌన్‌ హెడ్‌), ఎల్లో లాఫింగ్‌ (తీతు పిట్ట జాతి), స్నైఫ్‌ (మగ ఉల్లంగి పిట్ట), స్పాటెడ్‌ రెడ్‌ షాంక్‌ (ఉల్లంగి పిట్ట జాతి) పక్షులు ఉన్నాయని వెల్లడించారు. 

కొల్లేరు స్వరూపం ఇదీ 
రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. దీని సరాసరి లోతు 0.5 నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు ఇది. 2,22,600 ఎకరాల్లో చేపల చెరువులు విస్తరించి ఉండగా.. 1,66,000 ఎకరాలు అభయారణ్యం (వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి) పరిధిలో ఉంది. ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలమైన ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం.


ఇక్కడకు వలస వచ్చే పక్షుల్లో అతి ముఖ్యమైనవి పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుంచి కూడా ఇక్కడకు పక్షులు వలస వస్తూ ఉంటాయి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగులతోపాటు డెల్టా ప్రాంతం నుంచి వచ్చే 67 మేజర్, మైనర్‌ కాలువలు ఈ సరస్సులోకి నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరులోని ముంపు నీరు 62 కిలోమీటర్ల పొడవైన ఉప్పుటేరు  ద్వారా బంగాళాఖాతంలోకి చేరుతుంది.

ఈ సరస్సును 1999 నవంబర్‌లో అభయారణ్య ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొల్లేరు సరస్సుకు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలో ప్రసిద్ధ పెద్దింట్లమ్మ సమేత జలదుర్గ అమ్మవారి  ఆలయం ఉంది. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో 9 అడుగుల పైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచేందుకు ఒడిశా, అసోం, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. 

పక్షి జాతులు తగ్గాయి  
కొల్లేరు సరస్సులో విహరించే, విడిది చేసే పక్షుల జాతులు బాగా తగ్గిపోయాయి. పక్షి సంతతి వృద్ధి కూడా భారీగా క్షీణించింది. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదు. ప్రస్తుతం కొల్లేరులో పక్షుల సంఖ్య లక్షల్లో కాదు వేలల్లో మాత్రమే ఉంది. ఆక్రమణలు, వేటగాళ్ల వల్ల పక్షుల సంచారానికి త్రీవ విఘాతం కలుగుతోంది. దీనిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. పక్షుల వృద్ధికి కచ్చితమైన చర్యలు చేపట్టాలి. 
– పతంజలి శాస్త్రి, పర్యావరణవేత్త 
 
కొల్లేరు పక్షుల్ని రక్షించాలి  
కొల్లేరులో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. చేలు, చెరువుల నుంచి వచ్చే రసాయనాలతో కూడిన నీరు కొల్లేరులో పక్షి జాతి పాలిట మృత్యుపాశంగా మారింది. పక్షుల వేటను పకడ్బందీగా నిర్మూలించాలి. సరస్సులో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి. దీనివల్ల పక్షులకు ఆహారం తగ్గిపోయింది. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. 
– భూపతిరాజు చిదానంద మూర్తిరాజు, భారతీయ కిసాన్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సిద్ధాపురం, ఆకివీడు మండలం 
 
పక్షి జాతుల వృద్ధికి చర్యలు 
కొల్లేరు సరస్సులో పక్షి జాతుల వృద్ధికి చర్యలు చేపట్టాం. నాలుగైదు రకాల కొత్త పక్షులు కొల్లేరు సరస్సులోకి వచ్చాయి. సరస్సులో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేస్తున్నారు. వేసవి కావడంతో పక్షుల విహారం తగ్గింది. ఆటపాకలోని పక్షుల ఆవాస కేంద్రంలో స్టాండుల సంఖ్య పెంచాం. వచ్చే ఏడాదికి మరిన్ని వసతులు కల్పించే ప్రతిపాదనలున్నాయి. 
– ఎస్‌ఎన్‌ శివకుమార్, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (అభయారణ్యం), ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement