ఉడ్ శాండ్‌పైపర్స్
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రకాల పక్షులకు బెజవాడ ప్రాంతం చిరునామాగా మారింది. విదేశీ పక్షులు సైతం విజయవాడకు వచ్చి సేద తీరుతున్నాయి. వేలాది కిలోమీటర్ల దూరంలోని శీతల దేశాల నుంచి సైతం అతిథి పక్షులు వలస వచ్చి ఇక్కడ బస చేస్తున్నాయి. తాత్కాలిక ఆవాసాల్ని నిర్మించుకుని కొంతకాలం పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత స్వస్థలాలకు పయనమవుతున్నాయి. శీతాకాలంలోనే అనేక పక్షులు ఇక్కడ విడిది చేస్తున్న విషయాన్ని విజయవాడ నేచర్ క్లబ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తొలిసారిగా వీటి గణనకు కసరత్తు మొదలు పెట్టారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 20 చిత్తడి నేలలతో ఉన్న చెరువులు ఈ పక్షులకు ఆవాసాలుగా మారినట్టు ప్రాథమికంగా కనుగొన్నారు. వీటిలో విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు, జి.కొండూరు మండలం వెలగలేరు, గన్నవరం మండలం కొండపావులూరు, బ్రహ్మలింగయ్య చెరువు, కవులూరు (జి.కొండూరు), పెనమలూరు మండలం ఈడ్పుగల్లు చెరువులతో పాటు నున్న బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న చెరువుల్లో ఈ పక్షులు శీతల విడిది చేస్తున్నాయని గుర్తించారు.
120 జాతుల పక్షులు.. 6 విదేశీ పక్షి జాతులు
విజయవాడ, పరిసర ప్రాంతాల్లో సుమారు 120 జాతుల పక్షులు ఉంటున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీటిలో విదేశాలకు చెందిన ఆరు పక్షి జాతులున్నట్టు కనుగొన్నారు. వీటిలో సిట్రిన్ బర్డ్, వైట్ వాగ్ టైల్, ఉడ్ శాండ్‌పైపర్, నార్త్‌రన్ పింటైల్, బ్లిత్స్ రీడ్ వార్బర్ వంటి పక్షులను ఇదివరకే గుర్తించారు. ఇప్పుడు కొత్తగా ఏయే పక్షులు వస్తున్నాయన్న దానిపై గణన చేయనున్నారు.
ఇక్కడకు ఎందుకొస్తాయంటే..
యూరప్, సెంట్రల్ ఆసియా దేశాలు, ఉత్తరార్థ గోళం నుంచి వలస పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. అక్కడ శీతాకాలంలో మంచు పేరుకుపోయి ఈ పక్షులకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అవి అక్కడ కంటే ఒకింత ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే చిత్తడి నేల ప్రాంతాలను వెతుక్కుంటాయి. అలా అవి ఏటా ఒకసారి వచ్చిన ప్రాంతానికే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. చిత్తడి నేలల్లో దొరికే పురుగులు, కీటకాలు, చేపలు, కప్పలు, ధాన్యం గింజలు వంటి వాటిని ఆహారంగా తింటాయి. డిసెంబర్ నుంచి వలసలు మొదలవుతాయి. దాదాపు మూడు నెలలు అంటే వేసవి ఆరంభానికి ముందు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత తమ స్వస్థలాలకు పయనమవుతాయి.
ఆధిపత్య పోరు ఉండదు
విచిత్రమేమిటంటే.. విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఇక్కడి పక్షులు ఆతిథ్యమిస్తాయి తప్ప లోకల్, నాన్ లోకల్ అన్న భేదాలు చూపవు. వాటిపై స్వదేశీ పక్షుల ఆధిపత్యమూ ఉండదు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ విదేశీ విహంగాలకు ఎలాంటి హానీ తలపెట్టవు.
పది గ్రాముల పక్షి
వలస వచ్చే విదేశీ పక్షుల్లో బ్లిత్స్ రీడ్ వార్బర్ పక్షికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పక్షి బరువు కేవలం పది గ్రాములే. ఇవి తూర్పు యూరప్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉంటాయి. విజయవాడకు వచ్చే పక్షుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి రోజుకు 12 నుంచి 14 గ్రాముల ఆహారాన్ని తింటాయి. ఇవి గొంగళి పురుగులనే ఎక్కువగా ఆరగిస్తాయని ఐఐఎస్‌ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ రాజశేఖర్ బండి ‘సాక్షి’కి తెలిపారు.
గణన మొదలు పెట్టాం..
విజయవాడ పరిసరాల్లోని చెరువుల్లోకి ఏటా శీతాకాలంలో వచ్చే విదేశీ పక్షుల (వింటర్ వాటర్ బర్డ్స్) గణనను చేపట్టాం. ఇలాంటి పక్షుల గణన ఇదే తొలిసారి. ఇక్కడ సుమారు 20 చిత్తడి నేలల్లోకి 120 జాతుల పక్షులు వస్తున్నాయి. వీటిలో కొత్తగా ఆరు రకాల విదేశీ జాతుల పక్షులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించాం. ఇంకా కొత్త పక్షులు వచ్చే అవకాశం ఉంది. రానున్న రెండు నెలలు ఈ గణనను కొనసాగిస్తాం.
– డి.రాజేష్‌వర్మ, వ్యవస్థాపక సభ్యుడు, విజయవాడ నేచర్ క్లబ్
Comments
Please login to add a commentAdd a comment