రాబందుల రెక్కలు విరిగాయ్‌ | Endangered Vultures in the Country | Sakshi
Sakshi News home page

రాబందుల రెక్కలు విరిగాయ్‌

Published Sun, Feb 16 2020 4:29 AM | Last Updated on Sun, Feb 16 2020 8:21 AM

Endangered Vultures in the Country - Sakshi

రాబందు.. ఈ పేరు వినడమే కానీ, వాటిని నిజంగా చూసిన వారు ఈ తరంలో తక్కువ మందే. అదికూడా జంతు ప్రదర్శనశాలలోనో లేదా సినిమాల్లో చూసి ఉంటారు. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో రాబందులు ప్రధానమైనవి. కాలం విసిరిన సవాళ్లను ఎదుర్కోలేని స్థితిలో రాబందుల రెక్కలు విరిగిపోయాయి. ఆ జాతి క్రమంగా కనుమరుగైపోతోంది. ఈ పరిస్థితి పక్షి ప్రేమికులనే కాదు.. పర్యావరణ హితం కోరే వారినీ ఆందోళనకు గురి చేస్తోంది. 

సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని ప్రభావితం చేసే పక్షుల్లో కీలకమైన రాబందులు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రకృతిలో సహజ పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడుతూ.. ప్రకృతికి ఎంతో మేలుచేసే రాబందుల సంఖ్య మన దేశంలో కోట్ల నుంచి వేలకు పడిపోయింది. రాష్ట్రంలోనూ 95 శాతం రాబందులు ఉనికిలో లేకుండాపోయినట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల పర్యావరణ, అటవీ శాఖల సహకారంతో బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌), కాశ్మీర్‌ యూనివర్సిటీ జువాలజీ విభాగం నిర్వహించిన పలు సర్వేలు దేశంలో రాబందు జాతుల్లో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయని.. మరికొన్ని అంతరించే దశకు చేరుకున్నాయని స్పష్టం చేస్తున్నాయి. జంతువుల మృత కళేబరాలను తినే రాబందులు.. ఆ కళేబరాలు కుళ్లిపోవడం వల్ల వ్యాధులు ప్రబలకుండా చూసేవి. కొన్నేళ్లుగా మారిన పరిస్థితులు వాటి మనుగడనే ప్రశ్నార్ధకం చేశాయి. 1980 కాలంలో మన దేశంలో 9 రకాల రాబందు జాతులు ఉంటే.. 1990 నాటికి మూడు జాతులు మాత్రమే మిగిలాయి. అప్పట్లో ఆ మూడు జాతుల జనాభా 4 కోట్ల వరకు ఉండగా.. 2005 నాటికి వాటి సంఖ్య 90 వేలకు.. 2017 నాటికి 19 వేలకు పడిపోయింది. ఇదే విషయాన్ని గత ఏడాది జూలై 19న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ లోక్‌సభలో ప్రకటించారు. 

మూడు జాతులే మిగిలాయి 
1980 సంవత్సరానికి ముందు ప్రపంచంలో 23 రాబందు జాతులు ఉండగా.. వాటిలో తొమ్మిది రకాలు మన దేశంలో మనుగడలో ఉండేవి. ఆ తరువాత కాలంలో గణనీయమైన క్షీణత నమోదైంది. ప్రస్తుతం మన దేశంలో వైట్‌ బ్యాక్డ్, లాంగ్‌ బిల్డ్, స్లెండర్‌ బిల్డ్‌ అనే మూడు జాతులు మాత్రమే మిగిలాయి. వీటి మనుగడ కూడా క్లిష్ట దశలో ఉందని సర్వేలు తేల్చాయి.  

మన రాష్ట్రంలో ఒక్కటీ లేదు 
సాధారణంగా నదులు, కాలువలు, వాగులు కలిగిన కొండలు, గుట్ట ప్రాంతాల్లో రాబందులు నివసిస్తాయి. మన రాష్ట్రంలో రాబందుల ఉనికి లేదని సర్వేలు తేల్చాయి. కొన్నేళ్ల క్రితం వరకు నల్లమల, పాపికొండలు అటవీ ప్రాంతాలతోపాటు శ్రీశైలంలో రాబందులు కనిపించేవి. ప్రస్తుతం వాటి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

అంతరించడానికి కారణాలివే.. 
డైక్లోఫెనాక్‌ ఇంజెక్షన్లు ఇచ్చిన పశువుల మృత కళేబరాలను తినడం వల్లే దేశంలో రాబందుల సంతతి అంతరించిపోతున్నట్లు తేల్చారు. పశువులు తినే ఆహారంలో పురుగు మందుల ప్రభావం ఎక్కువై వాటికి వచ్చిన వ్యాధులు రాబందులపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు పర్యావరణ మార్పులు, ఆవాసాలు తగ్గిపోవడం, ఆహారం దొరక్కపోవడం, అవి నివసించే ప్రాంతాల్లో మానవ మనుగడ ఎక్కువ కావడం రాబందులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

తక్షణ రక్షణ అవసరం 
పర్యావరణంలో రాబందులది కీలక పాత్ర. రాబందులు లేకపోవడం ప్రకృతిలో ఒక లోపమే. మారిన పరిస్థితుల్లో వాటి మనుగడ కష్టమైంది. అవి పూర్తిగా మాయం కాలేదు. అడవుల్లోనే కొద్ది సంఖ్యలో ఉంటున్నాయి. రాబందుల సంరక్షణ కేంద్రాలు కొన్నిచోట్ల ఉన్నా పెద్దగా ఫలితం లేదు. డైక్లోఫెనాక్‌ ఇంజెక్షన్ల వాడకంపై నిషేధం ఉన్నా వినియోగం ఆగలేదు. ఆ ఇంజెక్షన్లను పూర్తిగా మానేయాలి. రాబందుల బ్రీడింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటికి మనుగడకు అడ్డంకులు లేకుండా చేయడం ద్వారా ఉన్న వాటినైనా కాపాడుకోవచ్చు.      
– దొంతి నరసింహారెడ్డి,పర్యావరణ పరిశోధకులు, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement