bird species
-
పక్షులకు చీమల గండం!
పర్వత ప్రాంతాల్లోని పక్షి జాతుల మనుగడకు పెను ముప్పు ఎదురవుతోంది. ఎవరి నుంచో తెలుసా? చీమల నుంచి! వాటి దెబ్బకు తీవ్ర ఆహార కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. దీనివల్ల పర్వత ప్రాంతాల్లో పక్షి జాతుల వైవిధ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాంతో కష్టమే అయినా, విధిలేని పరిస్థితుల్లో చీమలు ఎక్కి రాని పర్వత పై ప్రాంతాలకు పక్షులు తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం విశేషమని అధ్యయనం పేర్కొంది.భూమి ఉపరితలంపై 25 శాతం మాత్రమే ఉండే పర్వతాలు ఏకంగా 85 శాతం పక్షి, క్షీరద జాతులకు నిలయాలు. పర్వతాల్లోని పలు పక్షి జాతులు తరచూ పై ప్రాంతాలకు వలస వెళ్తుండటాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గమనించారు. దీనికి వాతావరణ మార్పులు తదితరాలే ప్రధాన కారణాలని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ అది నిజం కాదని ఐఐఎస్సీ అధ్యయనం తేల్చింది. మన దేశంలో పర్వత ప్రాంతాల్లో నివసించే పక్షులకు ఓషియోఫైలా జాతి చీమలు పెద్ద ముప్పుగా మారినట్టు వెల్లడించింది. పర్వత ప్రాంతల్లో మొత్తం జీవావరణ వ్యవస్థనే అవి ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయన బృందానికి సారథ్యం వహించిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమేశ్ శ్రీనివాసన్ తెలిపారు. వాటితో నెలకొన్న ఆహార పోటీని తట్టుకోలేక పక్షులే తమ ఆవాసాలను మార్చుకోవాల్సి వస్తోందని వివరించారు. ఓషియోఫైలా చీమలు దూకుడుకు పెట్టింది పేరు. కీటకాలు తదితరాలను తిని బతుకుతుంటాయి. ఇవి ప్రధానంగా పర్వతాల పాద ప్రాంతాల్లో విస్తారంగా ఉంటాయి. దాంతో అక్కడ కీటకాల కొరత నానాటికీ తీవ్రతరమవుతోంది. తమ ప్రధాన ఆహారమైన కీటకాల అలభ్యతతో పక్షులు అల్లాడుతున్నాయి. చీమల బెడదను తప్పించుకోవడానికి వాటి ఉనికి అంతగా ఉండని పర్వత పై ప్రాంతాలకు వలస పోతున్నాయి. ‘‘ఫలితంగా ప్రధానంగా కీటకాలను తినే పక్షి జాతుల వైవిధ్యం 900 మీటర్లు, అంతకంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే విస్తారంగా కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఓషియోఫైలా చీమలుండే పర్వత ప్రాంతాలన్నింట్లోనూ ఈ ధోరణి కొట్టొచ్చినట్టుగా ఉంది. పళ్లు, పూలలోని మకరందం ప్రధాన ఆహారమైన పక్షి జాతులు మాత్రం పర్వత పాదప్రాంతాల్లో కూడా విస్తారంగా ఉండటం గమనించాం. ఆహారం విషయంలో ఓషియోఫైలా చీమలతో వాటికి పోటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం’’ అని శ్రీనివాసన్ వెల్లడించారు. పక్షి జాతుల పరిరక్షణ ప్రయత్నాలను ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ప్రభావితం చేయనున్నాయి. వాటిని ఎకాలజీ లెటర్స్‌లో తాజాగా ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Pudami Sakshiga : అంతరించిపోతున్న అరుదైన పక్షులు.. అక్రమంగా విదేశాలకు
ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే కోవలో ఎన్నో పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. స్టేట్ అప్ బర్డ్స్ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 48% పక్షుల జనాభా తీవ్రంగా తగ్గిపోయింది. మన దేశంలో ఇప్పటికే 50% పక్షుల జనాభా తగ్గిపోయింది. వాటిలో అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు కూడా ఉంది. ఈ రకం పక్షుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అక్రమ విదేశీ విక్రయాల వల్ల వీటి జనాభా తీవ్రంగా దెబ్బతింటుంది. మన దేశంలో దాదాపు 8 పక్షిజాతులు ఉన్నాయి. వీటిలో అత్యంత అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు. ఇవి ఆకారంలో చిన్నదిగా, బాహ్యబాగల్లో ఆకుపచ్చరంగుతో, ఉదరబాగల్లో లేత పసుపు వర్ణంతో,నలుపు తెలుపు చారాలతో (జీబ్రా స్ట్రిప్స్), ఎర్రటి కళ్ళు, ఎరుపు ముక్కుతో రామచిలుకను పోలిఉండటంతో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీటి శాస్త్రీయ నామం Amandava formosa Formosa. అంటే లాటిన్ భాషలో అందంగా తయారైందని అర్థం. వీటిని గ్రీన్ స్ట్రాబెర్రీ ఫించ్, గ్రీన్ టైగర్ ఫించ్ అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చ ముణియా,ఎరుపు ముణియా మాత్రమే ఎరుపు ముక్కు కలిగివుంటుంది. ఇది మరే ఇతర ముణియా జాతి పక్షుల్లో కనిపించని లక్షణం. బాల్యదశలోని పక్షులు గోధుమ వర్ణంలోనూ, ఉదరబాగంలో లేత పసుపు రంగుతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇవి దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. మగ పక్షులు ఆడపక్షుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ భారతదేశానికి మాత్రమే స్థానికమైన పక్షులు. పొద అడవులు, పొడి నేల , వ్యవసాయ నేల , చెరుకు ,మక్కజాన్న ,రాగులు , సజ్జల పంట పొలాల్లో విరివిగా వీటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.పెద్ద పెద్ద ఆకులతోను లేదా చెరుకు ఆకుల మధ్య వీటి గూళ్ళును వేలాడదీస్తుంది. జనవరి నుండి మే నెలలో సంతానోత్పత్తి కొరకు 4-6 గుడ్లు పెట్టి 16-25 రోజుల వరకు ఆడ,మగ పక్షుల చేత పొదగబడుతుంది. ఆహార సేకరణ కొరకు చిన్న చిన్న గుంపులు గుంపులుగా వెళ్లి పంట పొలాల్లోని చీడ పురుగులను, చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి కూత హై పిచ్ గానంతో చెవులకు ఇంపుగా స్వీ...స్వీ అంటూ ముగుస్తుంది. ఆది నుండి అక్రమ రవాణ:- నిజానికి మనదేశంలో దాదాపు 250 దేశీయ అడవి పక్షులు,70 విదేశీ పక్షులు ,అక్రమ పక్షులవిక్రయం ( illegal bird trade ) లో ఉన్నాయి . ఇందులో ఆకుపచ్చ ముణియాలు ఆకర్షణగా కనిపించడంతో,మెలోడియస్ గానంతో, వేటగాళ్ల వలక సులభంగా చిక్కిపోవటం,పెంపరులతో స్నేహంగా మెలగడం,పెంచటం సులభ తరం కనుక పంజర పక్షులుగా మారాయి. 19 వ శతాబ్దంలో అహ్మదాబాద్ లోని ఒక కరప్షన్ ప్రాంతం అవడవత్ వీటి విక్రయానికి చిరునామాగా మారింది . అందువలనే వీటికి Green Avadavat అనే పేరు కూడా వచ్చింది. 1960 నుండి 1980 వరకు రెండు వేల ఆకుపచ్చ ముణియా పక్షుల మార్కెట్లలో బహిరంగంగా అమ్మకానికి గురైంది. దాదాపు 2000 నుంచి 3000 పక్షులు వరకు ప్రతియేటా ఇండియా నుంచి ఐరోపా ,ఉత్తర అమెరికా వంటి ఖండాంతర దేశాలకు అక్రమంగా ఎగుమతుల్లో తరలిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తంతు 1980 నుండి యిప్పటి వరకు కొనసాగుతుంది. శతాబ్దాల నుంచి అక్రమ విదేశీ విక్రయాల వలన స్వేచ్చగా గాలిలో విహరించల్సిన పక్షులు ఇప్పుడు బాధిత పక్షులుగా పంజరాలకు పరిమితమైంది. ఆవాస విధ్వంసమే ప్రధాన ముప్పు:- ఈ పక్షులు మొదట్లో రాజస్థాన్ లోని మౌంట్ అభు కొండల్లో విరివిగా కనిపించేవి కానీ ఇప్పుడు వాటి ఉనికిని కోల్పోయి దక్షిణ భారతదేశానికి పరిమితమైంది. వీటిని సాంప్రదాయ వైద్య పద్దతిలో ఉపయోగించడం వలన జనాభా భారీగా తగ్గిందని అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజలు చెబుతున్నారు.1980 లో అరకు లోయ పాదాల చెంత సుంకర మిట్ట ప్రాంతం ప్రధాన ఆవాస కేంద్రంగా పరిగణంపబడుతున్న సమయంలో అక్కడ బాక్సైట్ గనుల తవ్వకాల వలన ఆవాసం కోల్పోయి కనిపించకుండా పోయింది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన రసాయన పదార్థాలు జైవిక వ్యవస్థాపన జరిగి చనిపోతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో నివాస విధ్వంసం, అక్రమ విదేశీ విక్రయాలు, పంజార పక్షులుగా బంధించడం, ఆహారం కోసం వేటాడం వంటివి ప్రధాన ముప్పులుగా ఉన్నాయి. చట్టాలున్న రక్షణ కరువైంది:- భారత ప్రభుత్వం వీటి పరిరక్షణ నిమిత్తం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (1972) లో షెడ్యూల్ 4 లో చెర్చింది.1981లో ఆకుపచ్చ మునియాలు అమ్మకానికి బాన్ విధించింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పీసీస్ (CITES) లో అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చోటుచేసుకుంది. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం.. ఇది తీవ్ర భయాందోళనకు గురికావడం, నిర్లక్ష్యం మరియు తక్కువ సమృద్ధిలో ఉండటం చాలా ప్రమాదకరం,ఆందోళనకరం అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ 3 వ అనుకూల ఆవాసం:- అడుగడుగునా అంతరాలు ఎదురుకొంటున్న పక్షికి అంధ్రప్రదేశ్ లోని గుడిస రిజర్వు ఫారెస్ట్ భారతదేశంలోనే 3 వ అతిపెద్ద అనుకూల ఆవాస కేంద్రంగా ఆశ్రయమిస్తుంది.అక్కడ సంతానోత్పత్తికి కూడా అనువైన ప్రాంతంగా మారింది. అంతే కాకుండా విశాఖపట్నంలోని దారకొండ మారేడుమిల్లి అడవుల్లో కూడా నాలుగు సైటింగ్స్ చేసినట్లు బర్డ్ వాచేర్స్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. పరిరక్షణ అవసరం :- ''ప్రపంచవ్యాప్తంగా ప్రమాద స్థితిలోన్న ఆకుపచ్చ మునీయాలు మరలా పచ్చదనం సంతరించుకోవాలంటే అడవులను పెంచాలి, అడవుల్లో వర్షపు నీతి నిల్వ కుంటలు ఏర్పాటుచేయాలి ,అడవుల్లో విజిలెన్స్ విభాగం తనిఖీ విధిగా చేయాలి , వీటి గుడ్లను పొదిగించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ,వీటి ఆవాస మనుగడ పై పరిశోధనలు చేసేలా ప్రభుత్వాలు పూనుకోవాలి'' అని ఎస్వీ యూనీవర్సిటీ జువాలజి విభాగ ఆచార్య మారం రాజశేఖర్ తెలిపారు . - గిడ్డకింద మాణిక్యం అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. ఫోటోగ్రాఫర్- అసీమ్ కొఠిలా డా. గుండులూరు స్వాతి,అసోసియేట్ ప్రొఫెసర్ జంతు శాస్త్ర విభాగం , ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరు. తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Pudami Sakshiga : అరుదైన పక్షి నల్ల ఏట్రింత గురించి ఈ విషయాలు తెలుసా?
సాయంత్ర సమయంలో పెరటి కంచెల పైన, కరెంటు తీగల మీద, పొదల మీద నిగనిగ లాడే కారు నలుపు రంగులో పిగిలి పిట్ట(బుల్ బుల్) పరిమాణంలో ఉండే సన్నని చురుకైన పక్షిని అదేనండి నల్ల ఏట్రింతను ఎప్పుడైనా గమనించారా? ఈ పేరు కొత్తగా ఉన్నా,నల్లపిట్ట, కత్తెర పిట్ట, పసుల పోలిగాడు, భరద్వాజము, పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట గా మీకు పరిచయం అయిన ఈ పక్షి గురించి తెలుసుకుందాం. ► నల్ల ఏట్రింత దాదాపుగా భారతదేశ మంతటా కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ చురుగ్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చిక బయళ్ళలో, పంటపొలాల గట్ల పైన, పట్టణ ప్రాంతాల్లో పెరటి చెట్లపైన, తీగల మీద దీనిని మనం ఎక్కువగా గమనించవచ్చు. దీని తోక పొడుగుగా ఉండి చివరలో చీలి చూడటానికి కత్తెరను పోలి ఉండడంతో దీనిని కత్తెరపిట్ట, మంగలి పిట్ట అని కూడా పిలుస్తారు. ► ఇది మాంసాహారి. గాలిలో ఎగురుతూ మిడతలు, తూనీగలు, కందిరీగలు, తేనెటీగలను పట్టుకుని అది కూర్చునే చోటకు తీసుకుపోయి కాలి కింద నొక్కిపట్టి, పదునైన ముక్కుతో ముక్కలు చేసి మింగుతుంది.నలువైపులా గమనిస్తూ రివ్వున కిందకు దిగి నేలపై ఉన్న ఎరను పట్టుకుంటుంది. మేస్తున్న పశువులపై కూర్చుని అవి గడ్డిలో నడుస్తున్నపుడు గడ్డిలో నుంచి పైకి ఎగిరిన కీటకాలను పట్టుకుని ఆరగిస్తుంది. ► గోరింకలు, తెల్ల కొంగలతో పాటుగా దున్నుతున్న పొలాల్లో తిరుగుతూ బయట పడ్డ గొంగళీలను కీటకాలను తింటుంది. చాలా అరుదుగా తేళ్ళు, జెర్రెలను, చిన్న పక్షులను, గబ్బిలాలను వేటాడుతుంది. నల్ల ఏట్రింత దక్షిణ భారతంలో ఫిబ్రవరి, మార్చి నెలలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆగష్టు నెల వరకు సంతానోత్పత్తిని చేస్తాయి. ► జత కట్టే సమయంలో ఆడా, మగ పక్షులు ఉదయాన్నే చెట్ల చిటారు కొమ్మలపై వాలి పాటలు పాడతాయి. తమ రెక్కలు ముక్కులను జత చేస్తూ గాలిలో విన్యాసాలు చేస్తాయి. సాధారణంగా జత మధ్య బంధం సంతానోత్పత్తి కాలం వరకూ ఉంటుంది. జతకట్టిన రెండు పక్షులూ కలిసి కొమ్మ వంచలలో పలుచని కర్రలతో, గడ్డి పోచలతో దొన్నె లాంటి గూడును కడతాయి. ► పనస వంటి పెద్ద ఆకులున్న చెట్లను గూడు కట్టడానికి ఎంచుకుంటాయి. ఈ గూటిలో 3 నుండి 4 గుడ్లను పెట్టి తల్లిదండ్రులిద్దరూ రెండు వారాల పాటు పొదుగుతాయి. పిల్లలకు ఒక నెల పాటు ఆహారం అందించి రక్షించిన తర్వాత పిల్లలు గూటిని విడిచి పెడతాయి. వీటి పిల్లలు చాలా చురుకుగా ఉంటాయి. ► చిన్న ఆకు ముక్కలను తుంపి నేలపైకి వదిలి మధ్య గాలిలో ఎగురుతూ వాటిని పట్టుకుని ఆడుతూ తమ ఎగిరే పాటవాలను, వేటాడే నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటుంది.గూడు కట్టిన సమయంలో గూటికి దగ్గరలో కాపలా ఉంటూ వేటాడే కాకి, గ్రద్ద, జాలె డేగ (షిక్రా) వంటి పెద్ద పక్షులను కూడా ఎదిరించి, తరిమివేస్తూ దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. ► గూటిని పిల్లలని కాపాడుకోవటానికి పెద్ద పక్షులతో కూడా పోరాడే దాని ధైర్యం మిగిలిన చిన్న పక్షులను ఆ పరిసరాలలో గూడు కట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ దూకుడు స్వభావంతో తన గూటిని కాపాడుకోవటమే కాక పావురాలు, గువ్వలు, పికిలి పిట్టలు, వంగ పండు (ఓరియల్) వంటి ఇతర పక్షులకు కూడా రక్షణగా నిలవడంతో కొందరు నల్ల ఏట్రింతను పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట అని కూడా పిలుస్తారు. ► నల్ల ఏట్రింత రకరకాలుగా కూస్తుంది. సాధారణంగా టీ-టూ అని అరుస్తుంది. అపుడపుడు జాలె డేగ (షిక్రా) ను అనుకరిస్తూ అరిచి మైనాల నుండీ తిండిని దొంగలిస్తుంది. మధ్య భారతదేశంలో, నల్ల ఏట్రింత పశువుల కొమ్ములపై వాలితే పశువుల కొమ్ములు వూడి పోతాయనే మూఢ నమ్మకం కూడా ఉంది. ► నల్ల ఏట్రింత పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ రైతుకు పంటను కాపాడుకోవటంలో సహాయ పడుతుంది. కొందరు రైతులు ఏట్రింత కూర్చోవడానికై పొలాలలో కర్రలను కూడా ఏర్పాటు చేస్తారు.పరిమాణంలో చిన్నదైనప్పటికీ తన స్వభావంతో ఇటు రైతులకు, అటు తోటి పక్షులకు ఎంతో సహాయ పడే నల్ల ఏట్రింతను మెచ్చుకోకుండా ఉండగలమా!.. -రవికుమార్ ద్వాదశీ ఫోటోగ్రాఫర్- రేణుకా విజయ్‌రాఘవన్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
అవిగో.. అరుదైన పక్షులు! నల్ల బాజా, గోధుమ రంగు గుడ్ల గూబ, ఎలుక గద్ద పక్షి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు అరుదైన పక్షి జాతుల్ని బర్డ్ వాచర్స్ గుర్తించారు. గోధుమ రంగు అడవి గుడ్ల గూబ(బ్రౌన్ వుడ్ ఓల్), ఎలుక గద్ద(కామన్ బజార్డ్), నల్ల బాజా(బ్లాక్ బాజా) వంటి అరుదైన పక్షులు కనిపించాయి. తిరుపతి ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు సుదీర్ఘకాలం తర్వాత నల్ల బాజాను గుర్తించగా, రాజమండ్రిలో బర్డ్ వాచర్ మోహన్ శ్రీకర్ గోధుమ రంగు అడవి గుడ్ల గూబను రికార్డు చేశారు. విజయవాడలో ఎలుక గద్ద పక్షి రాష్ట్రంలో రెండోసారి రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 రకాల గుడ్ల గూబలు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజులపాటు ఐఐఎస్ఈఆర్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్‌గా పిలిచే ప్రపంచ పక్షుల గణన నిర్వహించారు. గణనలో దేశం వ్యాప్తంగా 1,067 జాతుల పక్షులు నమోదవగా, మన రాష్ట్రం 313 జాతుల్ని నమోదు చేసి దేశంలో 12వ స్థానంలో నిలిచింది. బర్డ్ వాచర్లు పక్షులను గమనించి వాటి ఫొటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ ఈబర్డ్లో నమోదు చేశారు. గణనలో 84 మంది బర్డ్ వాచర్స్.. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్, ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్‌లు ఈ గణనలో పాల్గొన్నాయి. 2013లో తొలిసారి రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ జరగ్గా అప్పుడు 300కి పైగా జాతుల పక్షుల్ని నమోదు చేశారు. ఐఐఎస్ఈర్ తిరుపతి విద్యార్థులు, పరిశోధకులు ఈ గణనలో తిరుపతి పరిసరాల్లో 120 జాతుల పక్షుల్ని నమోదు చేయడం విశేషం. విజయవాడ నేచర్ క్లబ్లో ఉన్న పలువురు వైద్యులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కొందరు సిటిజన్లు ఒక గ్రూపుగా ఏర్పడి విజయవాడ పరిసరాల్లో 60 రకాల పక్షులను నమోదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రకాశం జిల్లా ప్రాంతంలో 100 జాతులకు పైగా పక్షుల్ని రికార్డు చేశారు. రాజమండ్రి బర్డ్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపు సభ్యులుగా ఉన్న డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల నుంచి 200 జాతుల పక్షులను రికార్డు చేశారు. విశాఖపట్నంలో స్థానిక ఎన్జీఓలు డబుల్య్సీటీఆర్ఈ, ఈసీసీటీలు అటవీ శాఖతో కలిసి బర్డ్ వాక్‌లు నిర్వహించి 180 జాతుల పక్షులను నమోదు చేశారు. అనంతపురంలో 160 రకాల పక్షులు, కొల్లేరు పక్షుల అభయారణ్యంలో 90 రకాల పక్షులు నమోదయ్యాయి. మొత్తం 84 మంది బర్డ్ వాచర్స్ ఈ గణనలో పాల్గొన్నారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకులకంటె ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం. 65 శాతం పక్షులు నమోదయ్యాయి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 490 జాతుల పక్షులు రికార్డవగా.. ఈ గణనలో వాటిలో 65 శాతం పక్షులు నమోదయ్యాయి. ఎక్కువ మందిని ప్రకృతికి అనుసంధానం చేయడం, పక్షులను చూడాలనే అభిరుచితో ఉన్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ గణన ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు ప్రాథమికంగా ఇచ్చినవే. కాగా, బర్డ్ కౌంట్ ఇండియా త్వరలో తుది ఫలితాలను వెల్లడిస్తుంది. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ ప్రకాశం జిల్లాలో పక్షుల సమాచారాన్ని అన్వేషిస్తున్నాం.. నా సహోద్యోగి డాక్టర్ శ్రావణ్‌కుమార్(బర్డ్ వాచర్)తో కలిసి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పక్షుల్ని రికార్డు చేశాను. పెళ్లూరు సమీపంలోని గడ్డి భూముల్లో కొంగలు, పెలికాన్లు, పెయింటెడ్, ఓపెన్ బిల్ స్కార్ట్లను ఎక్కువగా గమనించాము. దర్శి సమీపంలో ఈజిప్టియన్ వల్చర్, హనీ బజార్డ్, బ్లాక్ కైట్ పక్షుల్ని నమోదు చేశాం. ప్రకాశం జిల్లాలోని పక్షుల గురించి మరింత సమాచారాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాం. – డాక్టర్ రామాంజినాయక్, బర్డ్ వాచర్, ఒంగోలు -
అంతరిస్తున్న అతిథి పక్షులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలస పక్షులకు ముప్పు వచ్చి పడుతోంది. విదేశాల నుంచి కొల్లేరు వలస వచ్చే వైట్ బ్యాక్ట్ రాబందు, సైబీరియన్ క్రేన్, బెంగాల్ ఫ్లోరికన్ వంటి పక్షి జాతులు కనిపించడం లేదు. పెరుగుతున్న జనాభా.. తరుగుతున్న అడవులు.. మిరుమిట్లు గొలిపే కాంతులు.. ఆహార కొరత పక్షుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు, మానవ తప్పిదాల కారణంగా అరుదైన పక్షి జాతులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వైట్ బ్యాక్డ్ రాబందు విదేశాల నుంచి మన దేశానికి వచ్చే 29 పక్షి జాతులు ప్రమాదం అంచున ఉన్నట్టు పక్షి ప్రేమికుల పరిశీలనలో వెల్లడైంది. ఇప్పటికే 15 జాతుల పక్షులు అంతరించే జాబితాలో చేరాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ ద్వారా ప్రకటించింది. రాష్ట్రంలోని కొల్లేరు ప్రాంతానికి ఏటా దాదాపు 6 లక్షల పక్షులు వస్తుంటాయి. వీటిలో అనేక జాతులు ప్రమాదం అంచున ఉన్నాయని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైబీరియన్ క్రేన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్.. సైబీరియన్ క్రేన్ కనిపించట్లేదు ఐయూసీఎన్ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఐత్య బేరీ, అటవీ గుడ్ల గూబ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బెంగాల్ ఫ్లోరికన్, సైబీరియన్ క్రేన్, స్నేహశీల లాఫ్టింగ్, వైట్ బ్యాక్ట్ రాబందు, రెడ్‌హెడ్ రాబందు, సన్న రాబందు, ఇండియన్ రాబందు, పింక్‌హెడ్ బాతు, హిమాలయ పిట్టను పూర్తిగా కనుమరుగవుతున్న జాబితాలో చేర్చారు. కలివికోడి జాడ కోసం కోసం పక్షి ప్రేమికులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ గాలిస్తున్నారు. అరుదైన కలివికోడి కనుమరుగవడానికి కారణాలెన్నో... జీవరాశులన్నీ ఆహారపు గొలుసులో భాగంగా ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. పూర్వం పశు కబేళాలను పీక్కు తినడానికి రాబందులు వచ్చేవి. వాటికి ఇప్పుడు ఆహార కొరత ఏర్పడింది. ఇటీవల ఆకాశ హరŠామ్యలలో అద్దాల గోడల వెనుక వెలిగే దీపాలను ఢీకొని అనేక పక్షులు మృత్యువాత పడుతున్నట్టు గుర్తించారు. ఎరువులు, పురుగు మందుల వాడకం, అయస్కాంత తరంగాలు, కరెంటు తీగలు, అడవుల్లో చెట్లు నరకడం, ధ్వని తరంగాలు, వేటగాళ్లు, వాయు, నీటి, భూమి కాలుష్యం పక్షి జాతుల అంతానికి కారణంగా మారుతున్నాయి. బెంగాల్ ఫ్లోరికన్ పక్షి ఆవాసాలు కోల్పోతున్నాయి పక్షులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఇవి అక్షాంశాలు, రేఖాంశాల మధ్య సముద్ర తీరంలో ప్రయాణిస్తాయి. రసాయనాల వినియోగం పెరగడంతో వాటిని తిని పక్షులు మరణిస్తున్నాయి. పక్షులకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలి. చెరువుల విస్తీర్ణం తగ్గడంతో వీటి మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. పక్షులను రక్షించుకోవడం అందరి బాధ్యత. – డాక్టర్ వి.సంధ్య, జువాలజీ లెక్చరర్, కైకలూరు కొల్లేరులో పక్షులు -
శీతాకాల అతిథులొచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి శీతాకాల వలస పక్షుల రాక మొదలైంది. గ్రే వాగ్టైల్ (బూడిద రంగు జిట్టంగి) పక్షుల జత ఈ నెల 24న విశాఖ మన్యంలోని పాడేరు సమీపంలో కనువిందు చేశాయి. ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) బృందం వీటిని రికార్డు చేసింది. గ్రే వాగ్టైల్ పక్షులు శీతాకాలంలో ఏపీ అంతటా విస్తృతంగా కనిపిస్తాయి. ఈ పక్షులు ప్రధానంగా కీటకాలను తింటాయి. 18–19 సెంటీమీటర్ల పొడవు, 20 గ్రాముల బరువున్న ఈ పక్షులను ఎవరైనా సులభంగా గుర్తించవచ్చు. ఈ పక్షులు తోకను పైకి కిందకు కదిలిస్తుంటాయి. ఇవి ప్రతి ఏడాదీ వేసవిలో హిమాలయాలు, ఇంకా ఎత్తయిన ప్రాంతాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత భారత్‌లో దక్షిణ ప్రాంతాలకు వలస వెళతాయి. అలా మన రాష్ట్రంలోకి పెద్ద సంఖ్యలో వస్తాయి. పంటలపై కీటకాలను తింటాయి.. పంటలపై ఉండే కీటకాలను ఎక్కువగా తినడం ద్వారా మన పర్యావరణ వ్యవస్థకు ఈ పక్షులు ఎంతో దోహదం చేస్తాయి. వీటికి అద్భుతమైన నావిగేషన్ (ప్రయాణ మార్గం) నైపుణ్యం ఉంటుంది. ఇవి శీతాకాలంలో ఒక ప్రదేశాన్ని సందర్శించిన తరువాత మరుసటి ఏడాది అదే ప్రదేశానికి వస్తుంటాయి. భారత్ వెలుపల మంగోలియా, సైబీరియా, రష్యా, చైనాలో ఈ పక్షులు సంతానోత్పత్తి చేస్తాయి. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు రాష్ట్రంలో ఇక్కడ గడిపి మళ్లీ సంతానోత్పత్తి కోసం హిమాలయాలు, ఎత్తయిన ప్రాంతాలకు ఇవి వెళ్లిపోతాయి. శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం తర్వాత ఈ పక్షులు తమ ఇంటికి లక్ష్మీదేవిలా వస్తాయని కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. తమిళనాడులోని వల్పరై హిల్ స్టేషన్ వాసులు ఈ పక్షుల రాకను వేడుకలా జరుపుతారు. 150 జాతుల వలస పక్షులు ప్రతి ఏడాది శీతాకాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఖండాల నుండి 150 కంటే ఎక్కువ జాతుల వలస పక్షులు ఏపీని సందర్శిస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాలు, యూరప్, రష్యా, చైనా, సైబీరియా, ఆర్కిటిక్, అట్లాంటిక్ నుండి ఇవి వస్తాయి. ఆగస్ట్, సెప్టెంబర్ చివరి నుంచి వీటి ఆగమనం ప్రారంభమవుతుంది. ఈ పక్షుల తరువాత వార్బ్లర్స్ (పాటల పిట్టలు), థ్రష్‌లు (గంటెపిట్టలు), ఫ్లై క్యాచర్లు (ఈగపట్టు పిట్టలు), హరియర్స్ (గద్దలు), కెస్ట్రెల్స్ (డేగల్స్) వంటి పెద్ద పక్షులు చిత్తడినేలలు, సాగు భూములకు వచ్చి ఎక్కువగా ఎలుకలను తింటుంటాయి. – బండి రాజశేఖర్, సిటిజన్ సైంటిస్ట్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి -
కిలకిలారావాలు పెరిగాయి !
సాక్షి, అమరావతి: జీవవైవిధ్యానికి ప్రతీకలుగా భావించే పక్షుల ఉనికి దేశంలో సంతృప్తికరంగా ఉంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కువ చోట్ల పక్షుల వైవిధ్యం బాగానే ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా కనిపించే గోరింక, కాకి వంటి వాటితోపాటు కొన్నిచోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని పక్షి ప్రేమికులంతా కలిసి నిర్వహించే గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ (పక్షుల సందర్శన) సర్వేలో ఈ అంశం స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12–15 తేదీల్లో ఈ సర్వే జరిగింది. మన దేశంలో బర్డ్ కౌంట్ ఆఫ్ ఇండియా పోర్టల్, మన రాష్ట్రంలో తిరుపతి ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ఈ సర్వేను సమన్వయం చేశాయి. సర్వే నివేదికను ఇటీవలే బర్డ్ కౌంట్ ఇండియా పోర్టల్ విడుదల చేసింది. బర్డ్ కౌంట్ సర్వేలో పక్షులను రికార్డు చేస్తున్న బర్డ్ వాచర్లు 2,954 బర్డ్ వాచర్లు.. 17 వేల గంటలు దేశంలో 965 రకాల పక్షి జాతులను ఈ సర్వేలో రికార్డు చేశారు. దేశంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 72 శాతం. 2,954 బర్డ్ వాచర్లు 17 వేల గంటలు పరిశీలించి వీటిని రికార్డు చేశారు. రికార్డు చేసిన పక్షి జాతుల సంఖ్య ప్రకారం ఈ సర్వేలో ఈ సారి ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 1,189 పక్షి జాతుల్ని రికార్డు చేసి కొలంబియా మొదటి స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో జరిగిన సర్వేలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. గతం కంటె ఈ సారి ఎక్కువ సంఖ్యలో బర్డ్ వాచర్స్ పాల్గొనడంతో ఎక్కువ జాతులు రికార్డయ్యాయి. దేశంలో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 426 పక్షి జాతులు, పశ్చిమ బెంగాల్లో 401, కర్నాటకలో 366 జాతుల్ని ఈ సర్వేలో రికార్డు చేశారు. మన రాష్ట్రంలో 57 మంది బర్డ్ వాచర్లు 295 పక్షి జాతుల్ని రికార్డు చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 60 శాతం. గత సంవత్సరం జరిగిన సర్వేలో 279 పక్షి జాతుల్ని కనుగొన్నారు. ఈ సారి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా 180 జాతులు రికార్డయ్యాయి. తర్వాతి స్థానాల్లో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది బర్డ్ వాచర్స్ పాల్గొన్నారు. ఈ సారి ఐఐటీ తిరుపతి, ఎస్వీయూ, ఆంధ్రా యూనివర్సిటీ వంటి 13 విద్యా సంస్థలు కూడా సర్వేలో పాల్గొన్నాయి. కర్నూలులో అరుదైన పక్షి జాతులు ఈ సారి సర్వేలో కర్నూలు జిల్లాలో రెండు అరుదైన పక్షి జాతులు నమోదు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఎగిరే తెల్ల పెద్ద బాతుతో పాటు మంగోలియా, సైబీరియా నుంచి వచ్చే పొట్టి చెవుల గుడ్ల గూబను కర్నూలులో రికార్డు చేశారు. ఇక, రాష్ట్రంలో సాధారణంగా కనిపించే కాకి, సంటి కొంగ, గోరింక, నల్ల ఏట్రింత, నల్ల కాకి, చిలుక, పావురం, నల్ల గద్ద, పికిలి పిట్టలే సర్వేలో ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోని దక్షిణాది ప్రాంతమంతటా కాకి, గోరింక, నల్ల ఏట్రింత పక్షులు ఎక్కువగా కనిపించాయి. అద్భుతంగా శబ్దాలు చేసే ఈల గంటె పిట్టను కూడా ఈ సర్వేలో నమోదు చేశారు. పర్యావరణ మార్పుల్ని మొదట గుర్తించేది పక్షులే జీవ వైవిధ్యం ఎలా ఉందో తెలుసుకోవడంలో పక్షులు కీలకం. పర్యావరణంలో జరిగే మార్పుల్ని మొదట గుర్తించేది అవే. బర్డ్ వాచింగ్ వల్ల మన పర్యావరణం, వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎన్ని జాతుల పక్షులున్నాయో తెలుస్తుంది. బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు పెద్దఎత్తున ఏర్పడి సర్వే చేస్తే పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – బండి రాజశేఖర్, సిటిజన్ సైన్స్ కోఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
Kolleru Lake: పక్షుల ‘కొంప కొల్లేరు’
చుట్టూ కిక్కిస పొదలు.. వాటి నడుమ అందమైన జలదారులు.. ఏదో అత్యవసర పని ఉన్నట్టు నీటి అడుగున అటూ ఇటూ రయ్యిన పరుగులు తీసే పిల్ల చేపలు.. ఎటు చూసినా ఒంటి కాలి జపం చేసే కొంగలు.. దూరతీరాల నుంచి వలస వచ్చే అతిథి విహంగాల విడిదులు.. కిలకిల రావాలు ఆలపించే బుల్లి పక్షులు. కొల్లేరు సరస్సు వైపు తొంగి చూస్తే.. ఇలాంటి రమణీయ దృశ్యాలెన్నో కనువిందు చేసేవి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కానరావడం లేదు. ఆకివీడు (పశ్చిమ గోదావరి): స్వదేశీ పక్షులతోపాటు విదేశీ పక్షి జాతులకు ఆలవాలమైన కొల్లేరు సరస్సులో వాటి సందడి తగ్గిపోతోంది. పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టాల నడుమ విస్తరించి ఉన్న కొల్లేరుపై ఆధారపడి 30 ఏళ్ల క్రితం వరకు 2 కోట్ల పక్షులు మనుగడ సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా తగ్గిపోతోంది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కొల్లేరులో పక్షిజాతి గణాంకాలను అభయారణ్య శాఖ సేకరించింది. ఆ మూడు నెలల్లో 3.05 లక్షల పక్షులు విహరించినట్టు అంచనా వేసింది. సహజంగా శీతాకాలంలో కొన్ని రకాల విదేశీ పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి విడిది చేస్తుంటాయి. ఈ ఏడాది ఆ పక్షుల రాక కూడా తగ్గింది. సరస్సులో ప్రస్తుతం సుమారు 1.20 లక్షల మేర పక్షులు మాత్రమే సంచరిస్తున్నాయని అభయారణ్య శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. అంటే రెండు నెలల వ్యవధిలో వాటి సంఖ్య 60 శాతం మేర తగ్గిపోయినట్టు అంచనా వేశారు. ఆక్రమణలు, కాలుష్యమే కాటేస్తున్నాయి వేసవిలో సహజంగానే కొల్లేరులో సంచరించే పక్షుల సంఖ్య తగ్గుతుంది. కానీ.. శీతాకాలంలోనూ వాటి సంఖ్య విపరీతంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సరస్సులో ఆక్రమణలు, కాలుష్యమే కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. మరోవైపు విదేశీ పక్షులు సరస్సులో విడిది చేసే రోజులు సైతం తగ్గిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. గతంలో వలస పక్షులు 120 నుంచి 150 రోజుల వరకు ఇక్కడ విడిది చేసేవి. ప్రస్తుతం వాటి విడిది రోజులు సగటున 60 రోజులకు పడిపోయింది. సరస్సులో వాటి సహజసిద్ధ మనుగడకు అవకాశాలు లేకపోవడం, పక్షుల ఆవాసాలు తగ్గిపోవడమే దీనికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వాలు కొల్లేరు పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సరస్సు కుంచించుకుపోయిందని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న గణాంకాలకు, వాస్తవ గణాంకాలకు చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొంటున్నారు. సరస్సును, దీనిపై ఆధారపడిన పక్షి జాతులను కాపాడటం ద్వారా ఇక్కడి జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఆటపాకలోని పక్షుల కేంద్రం ఈ చర్యలు చేపడితే మేలు కొల్లేటి సరస్సులో పక్షుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన చర్యలపై పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి. ► కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సు అభివృద్ధి జరగలేదు. సరస్సులో మేటవేసిన పూడికను, పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలి. ► సరస్సులో ఆక్రమణల్ని తొలగించాలి. నీటిమట్టాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ► సరస్సు వెంబడి పలు ప్రాంతాల్లో పక్షుల ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహజ సిద్ధ ఆవాసాలు పెరిగేలా చూడాలి. చిత్తడి నేలల్లో పెరిగే వృక్ష జాతిని అభివృద్ధి చేయాలి. ► పక్షుల వేట నిషేధాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలి. నామమాత్రంగా ఉన్న చెక్‌పోస్టులను పటిష్టపరచాలి. ► స్థానిక గార్డులను బదిలీ చేసి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గార్డులుగా నియమించాలి. కారు చీకట్లో కాంతి పుంజం కొల్లేరులో సంచరించే పక్షి జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో కారు చీకట్లో కాంతి పుంజంలా ఇటీవల నాలుగు రకాల కొత్త పక్షులు ఇక్కడ సంచరిస్తున్నట్టు అభయారణ్య అధికారులు గుర్తించారు. వీటిలో సీగల్ (బ్రౌన్ హెడ్), ఎల్లో లాఫింగ్ (తీతు పిట్ట జాతి), స్నైఫ్ (మగ ఉల్లంగి పిట్ట), స్పాటెడ్ రెడ్ షాంక్ (ఉల్లంగి పిట్ట జాతి) పక్షులు ఉన్నాయని వెల్లడించారు. కొల్లేరు స్వరూపం ఇదీ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. దీని సరాసరి లోతు 0.5 నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సు ఇది. 2,22,600 ఎకరాల్లో చేపల చెరువులు విస్తరించి ఉండగా.. 1,66,000 ఎకరాలు అభయారణ్యం (వైల్డ్ లైఫ్ శాంక్చురి) పరిధిలో ఉంది. ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలమైన ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షుల్లో అతి ముఖ్యమైనవి పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుంచి కూడా ఇక్కడకు పక్షులు వలస వస్తూ ఉంటాయి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వాగులతోపాటు డెల్టా ప్రాంతం నుంచి వచ్చే 67 మేజర్, మైనర్ కాలువలు ఈ సరస్సులోకి నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరులోని ముంపు నీరు 62 కిలోమీటర్ల పొడవైన ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలోకి చేరుతుంది. ఈ సరస్సును 1999 నవంబర్‌లో అభయారణ్య ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొల్లేరు సరస్సుకు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలో ప్రసిద్ధ పెద్దింట్లమ్మ సమేత జలదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో 9 అడుగుల పైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచేందుకు ఒడిశా, అసోం, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. పక్షి జాతులు తగ్గాయి కొల్లేరు సరస్సులో విహరించే, విడిది చేసే పక్షుల జాతులు బాగా తగ్గిపోయాయి. పక్షి సంతతి వృద్ధి కూడా భారీగా క్షీణించింది. ఇక్కడి పక్షుల సంఖ్య విషయంలో అటవీ శాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదు. ప్రస్తుతం కొల్లేరులో పక్షుల సంఖ్య లక్షల్లో కాదు వేలల్లో మాత్రమే ఉంది. ఆక్రమణలు, వేటగాళ్ల వల్ల పక్షుల సంచారానికి త్రీవ విఘాతం కలుగుతోంది. దీనిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. పక్షుల వృద్ధికి కచ్చితమైన చర్యలు చేపట్టాలి. – పతంజలి శాస్త్రి, పర్యావరణవేత్త కొల్లేరు పక్షుల్ని రక్షించాలి కొల్లేరులో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. చేలు, చెరువుల నుంచి వచ్చే రసాయనాలతో కూడిన నీరు కొల్లేరులో పక్షి జాతి పాలిట మృత్యుపాశంగా మారింది. పక్షుల వేటను పకడ్బందీగా నిర్మూలించాలి. సరస్సులో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించాలి. దీనివల్ల పక్షులకు ఆహారం తగ్గిపోయింది. పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. – భూపతిరాజు చిదానంద మూర్తిరాజు, భారతీయ కిసాన్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సిద్ధాపురం, ఆకివీడు మండలం పక్షి జాతుల వృద్ధికి చర్యలు కొల్లేరు సరస్సులో పక్షి జాతుల వృద్ధికి చర్యలు చేపట్టాం. నాలుగైదు రకాల కొత్త పక్షులు కొల్లేరు సరస్సులోకి వచ్చాయి. సరస్సులో గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు చేస్తున్నారు. వేసవి కావడంతో పక్షుల విహారం తగ్గింది. ఆటపాకలోని పక్షుల ఆవాస కేంద్రంలో స్టాండుల సంఖ్య పెంచాం. వచ్చే ఏడాదికి మరిన్ని వసతులు కల్పించే ప్రతిపాదనలున్నాయి. – ఎస్ఎన్ శివకుమార్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (అభయారణ్యం), ఏలూరు -
కోకిల డేగ.. ఉడతల గెద్ద!
సాక్షి, అమరావతి: కోకిల డేగ.. ఉడతల గెద్ద.. నూనె బుడ్డిగాడు. సరదాగా ఆట పట్టించేందుకు గ్రామీణులు పెట్టిన పేర్లు కావివి. విజయవాడ పరిసరాల్లో సందడి చేస్తున్న కొత్త పక్షుల జాతులివి. ఈ ప్రాంతానికి కొత్తగా జిట్టంగి (బ్లైత్స్ పిపిట్), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్ ఓర్ఫియన్ వార్బ్లెర్), మెడను లింగాడు (యురోషియన్ వ్రైనెక్), కోకిల డేగ (క్రెస్టెడ్ గోషాక్), ఉడతల గెద్ద (పాలిడ్ హారియర్), నీలి ఈగ పిట్ట (వెర్డిటర్ ఫ్లైకాచర్), నూనె బుడ్డిగాడు (బ్లాక్ రెడ్‌స్టార్ట్) అనే 7 రకాల పక్షి జాతులు వస్తున్నట్టు పక్షి ప్రేమికులు గుర్తించారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో మొత్తంగా 174 పక్షి జాతులు ఉన్నట్టు నిగ్గు తేల్చారు. మన రాష్ట్రంలో 460కి పైగా పక్షి జాతులు ఉండగా.. అందులో 174 అంటే 35 శాతం విజయవాడ పరిసరాల్లోనే ఉంటున్నట్టు గుర్తించారు. విజయవాడ నేచర్ క్లబ్ చేపట్టిన శీతాకాల పక్షుల గణనలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు 20 పెద్ద చెరువుల వద్ద 32 మంది వలంటీర్లు (డాక్టర్లు, వ్యాపారులు, విద్యార్థులు, బ్యాంక్ మేనేజర్లు తదితరులు) నిపుణులైన బర్డ్ వాచర్స్ సూచనల ప్రకారం గణన నిర్వహించిన గణనలో మొత్తం 13,527 పక్షుల్ని పరిశీలించారు. జాతులెక్కువ.. సంఖ్య తక్కువ! ఈ గణన సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చే నాలుగు పక్షి జాతుల్ని మాత్రమే గుర్తించారు. వాటిలో బాపన బాతు (రడ్డీ షెల్డ్ డక్), నామం బాతు (స్పాటెడ్ యురేషియన్ వైజన్), సూదితోక బాతు (నార్తర్న్ పిన్‌టైల్), చెంచామూతి బాతు (నార్తర్న్ షోవెలర్) ఉన్నాయని తెలిపారు. గతంలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పక్షులు వలస వచ్చేవి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గణనలో స్పష్టమైంది. నున్న, కవులూరు, వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి, ఈడుపుగల్లు, కొండపావులూరు గ్రామాల సమీపంలో చెరువులు, చిత్తడి నేలలు బాగున్నట్టు గుర్తించారు. ఎక్కువ పక్షి జాతుల్ని ఈ చెరువుల వద్దే లెక్కించారు. ఇక్కడికి వస్తున్న పక్షి జాతుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. పక్షుల సంఖ్య మాత్రం బాగా తక్కువగా ఉన్నట్టు గణనలో తేలింది. నీటి కాలుష్యం, చేపల చెరువులు ఎక్కువ కావడం, నివాస ప్రాంతాలు విస్తరించడం, పంట పొలాల్లో పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల వలస పక్షుల సంఖ్య తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. విజయవాడ పరిసరాల్లో పట్టణీకరణ ఎక్కువగా జరుగుతుండటం వల్ల చిత్తడి నేతలు, పంట పొలాలు నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. పక్షుల గణన నిర్వహించిన ఎక్కువ ప్రాంతాలు మానవ నివాసాలకు బాగా దగ్గర ఉన్నాయి. కొన్ని చెరువులు తమ సహజ స్వభావాన్ని కోల్పోగా కొన్ని బహిరంగ మలమూత్రాలు విసర్జించే ప్రాంతాలుగా మారాయి. రెండుచోట్ల పక్షుల్ని వేటాడటానికి పన్నిన వలల్ని గుర్తించారు. ఏదేమైనా పక్షుల సంఖ్య తగ్గడానికి చెరువుల చుట్టుపక్కల పొలాల్లో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటమేనని అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు కనబడుతున్న నేపథ్యంలో పక్షుల జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో బాగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు ఏర్పడాలి విజయవాడలో బర్డ్ వాచింగ్ కమ్యూనిటీ లేకపోవడం వల్ల పక్షి జాతులను నమోదు చేయడం, పర్యవేక్షించడం, వాటి సంఖ్య అంచనా వేయడం పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి పెద్ద నగరాల్లో బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు ఎప్పటి నుంచో ఉండటం వల్ల అక్కడ బర్డ్ రేస్, బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ వంటి వార్షిక కార్యక్రమాలు తరచూ జరుగుతున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో అలాంటి కమ్యూనిటీలు ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిర్వహించిన శీతాకాల పక్షుల గణనను ఇకపై వార్షిక కార్యక్రమంగా చేపడతాం. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ -
కొత్తగా.. రెక్కలొచ్చెనా!
విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త పక్షి జాతులు పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. వలస వచ్చే పక్షి జాతులు, నీటి బాతులు ఆకర్షిస్తున్నాయి. మనదేశంలోని పలు ప్రాంతాల నుంచే కాక, విదేశాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న మొత్తం 156 రకాల పక్షి జాతులు వెలుగుచూశాయి. విజయవాడ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో కొందరు ఔత్సాహికులు తాజాగా పక్షుల గణన చేపట్టారు. ఆ వివరాలు ఈ కథనంలో మీకోసం.. సాక్షి, అమరావతి: కొల్లేరు, ఉప్పలపాడు, కొండకర్ల.. మన రాష్ట్రంలో పక్షులు, వలస పక్షులకు స్థావరాలివి. పక్షి ప్రేమికులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ ప్రాంతాలనే సందర్శిస్తుంటారు. లేదంటే రాజస్తాన్, గుజరాత్ వంటి చిత్తడి నేలలు ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇప్పుడు విజయవాడ పరిసరాల్లోని చిత్తడి నేలల్లోనూ కొత్త పక్షులు కనువిందు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు రికార్డుల్లో నమోదుకాని ఏడు రకాల కొత్త పక్షి జాతులు కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తున్న 25 విదేశీ పక్షి జాతులు దర్శనమిచ్చాయి. వీటితో కలిపి మొత్తం 156 రకాల పక్షి జాతులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. విజయవాడ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో నగర పరిసరాల్లోని చెరువులు, పంట పొలాల్లో చేపట్టిన తొలి విడత పక్షుల గణనలో వీటిని గుర్తించారు. కోకిల డేగ.. నామం బాతు.. విజయవాడ సమీపంలోని వెలగలేరు, కొండపావులూరు, నున్న, కవులూరు, పైడూరుపాడు, ఈడుపుగల్లు, ముస్తాబాద సహా 15 మంచినీటి చెరువులు, వాటి పరిసర ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల పొలాల్లో ఇప్పటి వరకు పక్షుల గణన చేశారు. జిట్టంగి (బ్లైత్స్ పిపిట్), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్ ఓర్ఫియన్ వార్బ్లెర్), మెడను లింగాడు (యురేసియన్ వ్రైనెక్), కోకిల డేగ (క్రెస్టెడ్ గోషాక్), ఉడతల గెద్ద (పాలిడ్ హారియర్), నీలి ఈగపట్టు పిట్ట (వెర్డిటర్ ఫ్లైకాచర్), నూనె బుడ్డిగాడు (బ్లాక్ రెడ్‌స్టార్ట్) పక్షులను కొత్తగా కనుగొన్నారు. నీటి పక్షులు–బాతులు (మైగ్రేటరీ వాటర్‌ఫౌల్), నామం బాతు (స్పాటెడ్ యురేసియన్ వైజన్), సూదితోక బాతు (నార్తర్న్ పిన్‌టైల్), చెంచామూతి బాతు (నార్తర్న్ షోవెలర్) వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 25 రకాల వలస పక్షులను గుర్తించారు. వీటిలో ఎక్కువ పక్షులు యూరోప్, రష్యా, మంగోలియా, సైబీరియా, చైనా నుంచి వలస వస్తున్నాయి. కొన్ని పక్షులు హిమాలయాలు, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వస్తున్నాయి. గుర్తించిన 152 పక్షుల్లో 14 రకాల జాతులు 1972 వన్యప్రాణ రక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలో ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం వీటిని వేటాడితే శిక్షార్హులే. 30 రకాల జాతులు తగ్గిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి. అటవీ శాఖ సహకారం అటవీ శాఖ మూడు, నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించే సర్వే తప్ప నిర్దేశించిన ప్రాంతంలో ఇప్పటి వరకు పక్షుల గణన ఏ జిల్లాలోనూ జరగలేదు. విజయవాడ నేచర్ క్లబ్ పేరుతో బండి రాజశేఖర్, దాసి రాజేష్‌వర్మ, డాక్టర్ కిశోర్‌నాథ్ మరికొందరు ఔత్సాహికులు ఐఐఎస్ఈఆర్, మథాయ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తొలిసారిగా ఈ గణన చేపట్టారు. అటవీ శాఖ సైతం ఇందులో పాలుపంచుకుంది. 28 మంది వలంటీర్లు వారాంతాలు, సెలవు రోజుల్లో 40 గంటలపాటు ఈ గణనలో పాల్గొన్నారు. రెండో విడత గణన ఈనెల నేటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు జరగనుంది. పక్షుల ఆవాసాలను రక్షించాలి విజయవాడ పరిసరాల్లో వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఎంతో దూరం నుంచి వస్తున్న వలస పక్షుల ఆవాసాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తొలిసారి చేపట్టిన పక్షుల గణనకు మంచి ఆదరణ వచ్చింది. రెండో విడత గణనలో మరిన్ని కొత్త పక్షులు కనిపిస్తాయని ఆశిస్తున్నాం. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ -
విహంగాల విడిది.. విజయవాడ
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రకాల పక్షులకు బెజవాడ ప్రాంతం చిరునామాగా మారింది. విదేశీ పక్షులు సైతం విజయవాడకు వచ్చి సేద తీరుతున్నాయి. వేలాది కిలోమీటర్ల దూరంలోని శీతల దేశాల నుంచి సైతం అతిథి పక్షులు వలస వచ్చి ఇక్కడ బస చేస్తున్నాయి. తాత్కాలిక ఆవాసాల్ని నిర్మించుకుని కొంతకాలం పాటు ఇక్కడే ఉండి ఆ తర్వాత స్వస్థలాలకు పయనమవుతున్నాయి. శీతాకాలంలోనే అనేక పక్షులు ఇక్కడ విడిది చేస్తున్న విషయాన్ని విజయవాడ నేచర్ క్లబ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తొలిసారిగా వీటి గణనకు కసరత్తు మొదలు పెట్టారు. విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 20 చిత్తడి నేలలతో ఉన్న చెరువులు ఈ పక్షులకు ఆవాసాలుగా మారినట్టు ప్రాథమికంగా కనుగొన్నారు. వీటిలో విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు, జి.కొండూరు మండలం వెలగలేరు, గన్నవరం మండలం కొండపావులూరు, బ్రహ్మలింగయ్య చెరువు, కవులూరు (జి.కొండూరు), పెనమలూరు మండలం ఈడ్పుగల్లు చెరువులతో పాటు నున్న బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న చెరువుల్లో ఈ పక్షులు శీతల విడిది చేస్తున్నాయని గుర్తించారు. 120 జాతుల పక్షులు.. 6 విదేశీ పక్షి జాతులు విజయవాడ, పరిసర ప్రాంతాల్లో సుమారు 120 జాతుల పక్షులు ఉంటున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీటిలో విదేశాలకు చెందిన ఆరు పక్షి జాతులున్నట్టు కనుగొన్నారు. వీటిలో సిట్రిన్ బర్డ్, వైట్ వాగ్ టైల్, ఉడ్ శాండ్‌పైపర్, నార్త్రన్ పింటైల్, బ్లిత్స్ రీడ్ వార్బర్ వంటి పక్షులను ఇదివరకే గుర్తించారు. ఇప్పుడు కొత్తగా ఏయే పక్షులు వస్తున్నాయన్న దానిపై గణన చేయనున్నారు. ఇక్కడకు ఎందుకొస్తాయంటే.. యూరప్, సెంట్రల్ ఆసియా దేశాలు, ఉత్తరార్థ గోళం నుంచి వలస పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. అక్కడ శీతాకాలంలో మంచు పేరుకుపోయి ఈ పక్షులకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అవి అక్కడ కంటే ఒకింత ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే చిత్తడి నేల ప్రాంతాలను వెతుక్కుంటాయి. అలా అవి ఏటా ఒకసారి వచ్చిన ప్రాంతానికే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. చిత్తడి నేలల్లో దొరికే పురుగులు, కీటకాలు, చేపలు, కప్పలు, ధాన్యం గింజలు వంటి వాటిని ఆహారంగా తింటాయి. డిసెంబర్ నుంచి వలసలు మొదలవుతాయి. దాదాపు మూడు నెలలు అంటే వేసవి ఆరంభానికి ముందు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత తమ స్వస్థలాలకు పయనమవుతాయి. ఆధిపత్య పోరు ఉండదు విచిత్రమేమిటంటే.. విదేశాల నుంచి వచ్చే పక్షులకు ఇక్కడి పక్షులు ఆతిథ్యమిస్తాయి తప్ప లోకల్, నాన్ లోకల్ అన్న భేదాలు చూపవు. వాటిపై స్వదేశీ పక్షుల ఆధిపత్యమూ ఉండదు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ విదేశీ విహంగాలకు ఎలాంటి హానీ తలపెట్టవు. పది గ్రాముల పక్షి వలస వచ్చే విదేశీ పక్షుల్లో బ్లిత్స్ రీడ్ వార్బర్ పక్షికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పక్షి బరువు కేవలం పది గ్రాములే. ఇవి తూర్పు యూరప్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఉంటాయి. విజయవాడకు వచ్చే పక్షుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి రోజుకు 12 నుంచి 14 గ్రాముల ఆహారాన్ని తింటాయి. ఇవి గొంగళి పురుగులనే ఎక్కువగా ఆరగిస్తాయని ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ రాజశేఖర్ బండి ‘సాక్షి’కి తెలిపారు. గణన మొదలు పెట్టాం.. విజయవాడ పరిసరాల్లోని చెరువుల్లోకి ఏటా శీతాకాలంలో వచ్చే విదేశీ పక్షుల (వింటర్ వాటర్ బర్డ్స్) గణనను చేపట్టాం. ఇలాంటి పక్షుల గణన ఇదే తొలిసారి. ఇక్కడ సుమారు 20 చిత్తడి నేలల్లోకి 120 జాతుల పక్షులు వస్తున్నాయి. వీటిలో కొత్తగా ఆరు రకాల విదేశీ జాతుల పక్షులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించాం. ఇంకా కొత్త పక్షులు వచ్చే అవకాశం ఉంది. రానున్న రెండు నెలలు ఈ గణనను కొనసాగిస్తాం. – డి.రాజేష్‌వర్మ, వ్యవస్థాపక సభ్యుడు, విజయవాడ నేచర్ క్లబ్ -
రాబందుల రెక్కలు విరిగాయ్
రాబందు.. ఈ పేరు వినడమే కానీ, వాటిని నిజంగా చూసిన వారు ఈ తరంలో తక్కువ మందే. అదికూడా జంతు ప్రదర్శనశాలలోనో లేదా సినిమాల్లో చూసి ఉంటారు. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో రాబందులు ప్రధానమైనవి. కాలం విసిరిన సవాళ్లను ఎదుర్కోలేని స్థితిలో రాబందుల రెక్కలు విరిగిపోయాయి. ఆ జాతి క్రమంగా కనుమరుగైపోతోంది. ఈ పరిస్థితి పక్షి ప్రేమికులనే కాదు.. పర్యావరణ హితం కోరే వారినీ ఆందోళనకు గురి చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని ప్రభావితం చేసే పక్షుల్లో కీలకమైన రాబందులు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రకృతిలో సహజ పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడుతూ.. ప్రకృతికి ఎంతో మేలుచేసే రాబందుల సంఖ్య మన దేశంలో కోట్ల నుంచి వేలకు పడిపోయింది. రాష్ట్రంలోనూ 95 శాతం రాబందులు ఉనికిలో లేకుండాపోయినట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల పర్యావరణ, అటవీ శాఖల సహకారంతో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్), కాశ్మీర్ యూనివర్సిటీ జువాలజీ విభాగం నిర్వహించిన పలు సర్వేలు దేశంలో రాబందు జాతుల్లో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయని.. మరికొన్ని అంతరించే దశకు చేరుకున్నాయని స్పష్టం చేస్తున్నాయి. జంతువుల మృత కళేబరాలను తినే రాబందులు.. ఆ కళేబరాలు కుళ్లిపోవడం వల్ల వ్యాధులు ప్రబలకుండా చూసేవి. కొన్నేళ్లుగా మారిన పరిస్థితులు వాటి మనుగడనే ప్రశ్నార్ధకం చేశాయి. 1980 కాలంలో మన దేశంలో 9 రకాల రాబందు జాతులు ఉంటే.. 1990 నాటికి మూడు జాతులు మాత్రమే మిగిలాయి. అప్పట్లో ఆ మూడు జాతుల జనాభా 4 కోట్ల వరకు ఉండగా.. 2005 నాటికి వాటి సంఖ్య 90 వేలకు.. 2017 నాటికి 19 వేలకు పడిపోయింది. ఇదే విషయాన్ని గత ఏడాది జూలై 19న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభలో ప్రకటించారు. మూడు జాతులే మిగిలాయి 1980 సంవత్సరానికి ముందు ప్రపంచంలో 23 రాబందు జాతులు ఉండగా.. వాటిలో తొమ్మిది రకాలు మన దేశంలో మనుగడలో ఉండేవి. ఆ తరువాత కాలంలో గణనీయమైన క్షీణత నమోదైంది. ప్రస్తుతం మన దేశంలో వైట్ బ్యాక్డ్, లాంగ్ బిల్డ్, స్లెండర్ బిల్డ్ అనే మూడు జాతులు మాత్రమే మిగిలాయి. వీటి మనుగడ కూడా క్లిష్ట దశలో ఉందని సర్వేలు తేల్చాయి. మన రాష్ట్రంలో ఒక్కటీ లేదు సాధారణంగా నదులు, కాలువలు, వాగులు కలిగిన కొండలు, గుట్ట ప్రాంతాల్లో రాబందులు నివసిస్తాయి. మన రాష్ట్రంలో రాబందుల ఉనికి లేదని సర్వేలు తేల్చాయి. కొన్నేళ్ల క్రితం వరకు నల్లమల, పాపికొండలు అటవీ ప్రాంతాలతోపాటు శ్రీశైలంలో రాబందులు కనిపించేవి. ప్రస్తుతం వాటి ఉనికి ఎక్కడా కనిపించడం లేదని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. అంతరించడానికి కారణాలివే.. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు ఇచ్చిన పశువుల మృత కళేబరాలను తినడం వల్లే దేశంలో రాబందుల సంతతి అంతరించిపోతున్నట్లు తేల్చారు. పశువులు తినే ఆహారంలో పురుగు మందుల ప్రభావం ఎక్కువై వాటికి వచ్చిన వ్యాధులు రాబందులపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు పర్యావరణ మార్పులు, ఆవాసాలు తగ్గిపోవడం, ఆహారం దొరక్కపోవడం, అవి నివసించే ప్రాంతాల్లో మానవ మనుగడ ఎక్కువ కావడం రాబందులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తక్షణ రక్షణ అవసరం పర్యావరణంలో రాబందులది కీలక పాత్ర. రాబందులు లేకపోవడం ప్రకృతిలో ఒక లోపమే. మారిన పరిస్థితుల్లో వాటి మనుగడ కష్టమైంది. అవి పూర్తిగా మాయం కాలేదు. అడవుల్లోనే కొద్ది సంఖ్యలో ఉంటున్నాయి. రాబందుల సంరక్షణ కేంద్రాలు కొన్నిచోట్ల ఉన్నా పెద్దగా ఫలితం లేదు. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ల వాడకంపై నిషేధం ఉన్నా వినియోగం ఆగలేదు. ఆ ఇంజెక్షన్లను పూర్తిగా మానేయాలి. రాబందుల బ్రీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటికి మనుగడకు అడ్డంకులు లేకుండా చేయడం ద్వారా ఉన్న వాటినైనా కాపాడుకోవచ్చు. – దొంతి నరసింహారెడ్డి,పర్యావరణ పరిశోధకులు, హైదరాబాద్ -
పిట్టలు రాలుతున్నాయ్..!
ఎండల తీవ్రతను తట్టుకోలేక పక్షుల మృతి {బీడింగ్, నెస్టింగ్ సీజన్ విహంగాలకు కష్టకాలం ఆహారం, నీరు దొరక్క వందల మైళ్లు వలసలు టపటపా రాలిపోతున్న గుడ్లగూబలు, కబోది పక్షులు విజయవాడ బ్యూరో: ఎండల తీవ్రత పక్షి జాతికి పెనుముప్పుగా మారుతోంది. వేసవి ధాటికి తట్టుకోలేక వివిధ రకాల పక్షులు నేల రాలుతున్నాయి. సరైన ఆవాసం, ఆహారం, నీరు లభించక వందల కిలోమీటర్లు వలస పోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోలేక గుడ్లగూబలు, కబోది పక్షులు, నైట్‌హెరాన్స్, నైట్‌జార్స్ పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణంగా పక్షులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే మించితే వీటికి ప్రాణగండం పొంచి ఉన్నట్లే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో పగలు 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కాకులు, పిచ్చుకలు, గోరింకలు, పావురాళ్లు, గద్దలు, కొంగలతో పాటు సైబీరియా, నార్త్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చే రెడ్‌శాంక్స్, వార్‌బర్డ్స్, పికెట్స్, పెలికాన్స్ వంటి జాతులు విలవిలలాడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి తీవ్రం... హుద్‌హుద్ తుపాను కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పచ్చదనం మొత్తం హరించుకుపోయింది. దీంతో వేసవిలో గూడు (నెస్టింగ్) కోసం పక్షులకు కష్టకాలం వచ్చింది. కంబాలకొండ వైల్డ్‌లైఫ్ శాంచురీ మొత్తం తుపాను తీవ్రత కారణంగా దెబ్బతింది. దీంతో ఏటా ఇక్కడికొచ్చే పక్షులు ఈసారి లేకుండా పోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు, గుంటూరు జిల్లా ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా పులికాట్ ప్రాంతాల్లోనూ ఎండల వల్ల పక్షుల సంఖ్య తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో జెముడు కాకులు, రామచిలుకలు, గద్దలు, గోల్డెన్ ఓరియోల్, బ్రామినీకైట్స్, అలెగ్జాండర్ పెరాకైట్స్ వంటివన్నీ పిల్లలను కనే దశలో ఉంటాయి. ఎండల కారణంగా వాటి గుడ్లు ముందుగానే చితికిపోయి కొత్తతరం ఆగిపోతోంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో మసలే కాకులు, పిచ్చుకలు, గోరింకలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
ఎగరడమే ఈ పక్షి ప్రత్యేకత!
ప్లే టైమ్ పక్షిజాతుల్లో బాగా బరువు పెరిగి కూడా ఎగిరే శక్తి కలిగినది గ్రేట్ బస్టర్డ్. మరీ ఎక్కువసేపు గాల్లో విహరించలేదు కానీ కోళ్ల తీరున ఎగిరే శక్తి ఉంటుంది. గరిష్టంగా 20 కిలోల వరకూ బరువు పెరిగి ఎగరగలగడం వల్ల దీనికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మూడడుగుల ఎత్తుండే ఈ పక్షి ప్రధానంగా యూరప్‌లో కనిపిస్తుంది. రష్యాలోని గడ్డిభూములు వీటికి ఆవాసాలు. కీటకాలు, చెదలు, గడ్డివిత్తనాలు ప్రధాన ఆహారం. విభిన్నమైన రంగుల్లో ఉండే గ్రేట్ బస్టర్డ్ మన దగ్గర కనిపించే టర్కీ కోళ్లకు సహజాతి లాంటిది. వీటిలో మగవి బలిష్టంగా ఉంటాయి. పెట్టలతో పోలిస్తే 30 శాతం ఎక్కువ బరువు పెరుగుతాయి. పెట్టలు గుడ్లను పెట్టి పొదగడం ద్వారా పిల్లలకు జన్మనిస్తాయి. పిల్లల లాలన కూడా పెట్టల బాధ్యతే. ఈ పక్షి సగటున పది సంవత్సరాలు జీవిస్తుంది. ఇది అంతరిస్తున్న పక్షి జాతుల జాబితాలో ఉండటం గమనార్హం. గత శతాబ్దకాలంలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో యూరప్‌దేశాలు ఈ పక్షి జాతిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
జీవజాలానికి మనిషి గాయం!
ముప్పు ముంగిట దేశంలో జీవవైవిధ్యం హిమాలయాలు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో పరిస్థితి దారుణం పర్యావరణ శాఖ నివేదికలో చేదు వాస్తవాలు న్యూఢిల్లీ: దేశంలో జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది.. అనేక వృక్ష, పక్షి జాతులు ముప్పు ముంగిట నిలుచున్నాయి.. ప్రత్యేకించి హిమాలయాలు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలు, నికోబార్ దీవుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఇది ఏదో స్వచ్ఛంద సంస్థనో, పర్యావరణ నిపుణుడో చెప్పిన మాట కాదు! సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణ శాఖ నివేదికలో వెల్లడైన చేదు వాస్తవాలు!! ప్రకృతి వనరులను విచక్షణరహితంగా కొల్లగొడుతున్న మనిషి స్వార్థం, అడవుల్లో కార్చిచ్చులు, వాతావరణ మార్పులే జీవ వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని నివేదిక స్పష్టంచేసింది. జీవ వైవిధ్య సదస్సు(సీబీడీ) వ్యూహాత్మక ప్రణాళిక 2011-2020 కోసం పర్యావరణ శాఖ తాజాగా రూపొందించిన ఐదో జాతీయ నివేదికలో ఈ అంశాలను పొందుపరిచారు. మనదేశంలో ఉన్న 45 వేల రకాల వృక్ష జాతులు, 91 వేల రకాల జంతుజాలాలు ఉండగా.. అందులో పలు జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పేరిట అడవులను నరికివేయడం వన్యమృగాలకు పెనుశాపంగా మారుతోంది. అటవీ పరిరక్షణ చట్టం-1980 రూపొందించినప్పట్నుంచీ ఇప్పటిదాకా పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశంలో ఏకంగా 10.7 లక్షల హెక్టార్ల అటవీ భూమిని బదలాయించినట్లు నివేదికలో తెలిపారు. దేశ భూవిస్తీర్ణంలో 49.63 శాతం అడవులు ఉండాల్సి ఉన్నా.. అది కాలక్రమేణ గణనీయంగా పడిపోతున్నట్లు వివరించారు. అరావళి పర్వతాలు, పశ్చిమ శ్రేణులు వంటి ప్రాంతాల్లో గనుల త్వకాలు, క్వారీల వల్ల అక్కడి జీవజాలం మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. -
పక్షి జాతులపై సర్వే
సాక్షి, ముంబై: బోరివలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్జీఎన్పీ) అధికారులు పక్షుల జాతులపై సర్వే నిర్వహించనున్నారు. ఈ నెల చివరన జరిగే సర్వేలో పార్కు సిబ్బంది, పక్షి శాస్త్రవేత్తలు, పక్షి ప్రేమికులు పాల్గొననున్నారు. ఈ అధ్యయనం పూర్తి అవడానికి కనీసం మూడు నెలల సమయం తీసుకునే అవకాశముందని ఎస్జీఎన్పీ డెరైక్టర్ వికాస్ గుప్తా తెలిపారు. పక్షుల వివరాలను సేకరించడం ద్వారా ఈ పార్కులో ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుస్తుందని, ఎడ్యుకేషన్ మెటీరియల్‌కు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రచారం కోసం సీతాకోక చిలుకలు, పక్షులు, పార్కులోని వృక్షజాతులపై కొత్త బుక్లెట్లను ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా నిర్వహించే ఈ అధ్యయనం తమకు ఎంతో దోహదకరంగా ఉంటుందన్నారు. పక్షి శాస్త్రవేత్తల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ప్రకృతి శాస్త్రవేత్త సంజయ్ మోంగా ఆధ్వర్యంలో బృందం 2011-12 మధ్య కాలంలో ఈ పార్కులోని పక్షులపై ప్రాథమిక అధ్యయనం చేశారు. వీరు తయారుచేసిన నివేదికను పార్కు పరిపాలన విభాగానికి కూడా సమర్పించారు. 251 పక్షి జాతులు ఉండగా, 155 సీతాకోక చిలుకల జాతులు, 40 జాతుల పాలిచ్చు జంతువులు, 800 రకాల జాతుల చెట్లు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈసారి అధ్యయనాన్ని వారాంతంలో, రాత్రి వేళ్లలో నిర్వహిస్తామని వికాస్ గుప్తా తెలిపారు. అన్ని రకాల పక్షులు ఒకే చోట చేరడానికి శీతాకాలం అనువైన కాలమని తెలిపారు. పార్కులో భద్రత... ఈ పార్కు ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద అత్యాధునిక కెమెరాలను అమర్చనున్నారు. ప్రస్తుతం రిజల్యూషన్ తక్కువగా నమోదయ్యే కెమెరాలను కీలక ప్రదేశాలలో అమర్చారు. ఇవి వాహనం పార్కు లోపలికి ప్రవేశించిన సమయం, సందర్శకులు గడిపిన సమయం, నిష్ర్కమణ సమయం కూడా నమోదు చేస్తుంది. ఈ పార్కులో అత్యవసర సమయాల్లో వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.