వాటి ఆహారం గుటకాయస్వాహా
పర్వత ప్రాంతాల్లో పెను సమస్య
పక్షిజాతుల వైవిధ్యానికి ముప్పు
దాంతో ఎత్తైన ప్రాంతాలకు వలసలు
పర్వత ప్రాంతాల్లోని పక్షి జాతుల మనుగడకు పెను ముప్పు ఎదురవుతోంది. ఎవరి నుంచో తెలుసా? చీమల నుంచి! వాటి దెబ్బకు తీవ్ర ఆహార కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. దీనివల్ల పర్వత ప్రాంతాల్లో పక్షి జాతుల వైవిధ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాంతో కష్టమే అయినా, విధిలేని పరిస్థితుల్లో చీమలు ఎక్కి రాని పర్వత పై ప్రాంతాలకు పక్షులు తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) తాజా పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం విశేషమని అధ్యయనం పేర్కొంది.
భూమి ఉపరితలంపై 25 శాతం మాత్రమే ఉండే పర్వతాలు ఏకంగా 85 శాతం పక్షి, క్షీరద జాతులకు నిలయాలు. పర్వతాల్లోని పలు పక్షి జాతులు తరచూ పై ప్రాంతాలకు వలస వెళ్తుండటాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గమనించారు. దీనికి వాతావరణ మార్పులు తదితరాలే ప్రధాన కారణాలని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ అది నిజం కాదని ఐఐఎస్‌సీ అధ్యయనం తేల్చింది.
మన దేశంలో పర్వత ప్రాంతాల్లో నివసించే పక్షులకు ఓషియోఫైలా జాతి చీమలు పెద్ద ముప్పుగా మారినట్టు వెల్లడించింది. పర్వత ప్రాంతల్లో మొత్తం జీవావరణ వ్యవస్థనే అవి ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయన బృందానికి సారథ్యం వహించిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమేశ్ శ్రీనివాసన్ తెలిపారు. వాటితో నెలకొన్న ఆహార పోటీని తట్టుకోలేక పక్షులే తమ ఆవాసాలను మార్చుకోవాల్సి వస్తోందని వివరించారు. ఓషియోఫైలా చీమలు దూకుడుకు పెట్టింది పేరు. కీటకాలు తదితరాలను తిని బతుకుతుంటాయి. ఇవి ప్రధానంగా పర్వతాల పాద ప్రాంతాల్లో విస్తారంగా ఉంటాయి.
దాంతో అక్కడ కీటకాల కొరత నానాటికీ తీవ్రతరమవుతోంది. తమ ప్రధాన ఆహారమైన కీటకాల అలభ్యతతో పక్షులు అల్లాడుతున్నాయి. చీమల బెడదను తప్పించుకోవడానికి వాటి ఉనికి అంతగా ఉండని పర్వత పై ప్రాంతాలకు వలస పోతున్నాయి. ‘‘ఫలితంగా ప్రధానంగా కీటకాలను తినే పక్షి జాతుల వైవిధ్యం 900 మీటర్లు, అంతకంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే విస్తారంగా కన్పిస్తోంది.
దేశవ్యాప్తంగా ఓషియోఫైలా చీమలుండే పర్వత ప్రాంతాలన్నింట్లోనూ ఈ ధోరణి కొట్టొచ్చినట్టుగా ఉంది. పళ్లు, పూలలోని మకరందం ప్రధాన ఆహారమైన పక్షి జాతులు మాత్రం పర్వత పాదప్రాంతాల్లో కూడా విస్తారంగా ఉండటం గమనించాం. ఆహారం విషయంలో ఓషియోఫైలా చీమలతో వాటికి పోటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం’’ అని శ్రీనివాసన్ వెల్లడించారు. పక్షి జాతుల పరిరక్షణ ప్రయత్నాలను ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ప్రభావితం చేయనున్నాయి. వాటిని ఎకాలజీ లెటర్స్‌లో తాజాగా ప్రచురించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment