జీవజాలానికి మనిషి గాయం!
ముప్పు ముంగిట దేశంలో జీవవైవిధ్యం
హిమాలయాలు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో పరిస్థితి దారుణం
పర్యావరణ శాఖ నివేదికలో చేదు వాస్తవాలు
న్యూఢిల్లీ: దేశంలో జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది.. అనేక వృక్ష, పక్షి జాతులు ముప్పు ముంగిట నిలుచున్నాయి.. ప్రత్యేకించి హిమాలయాలు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలు, నికోబార్ దీవుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఇది ఏదో స్వచ్ఛంద సంస్థనో, పర్యావరణ నిపుణుడో చెప్పిన మాట కాదు! సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణ శాఖ నివేదికలో వెల్లడైన చేదు వాస్తవాలు!! ప్రకృతి వనరులను విచక్షణరహితంగా కొల్లగొడుతున్న మనిషి స్వార్థం, అడవుల్లో కార్చిచ్చులు, వాతావరణ మార్పులే జీవ వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని నివేదిక స్పష్టంచేసింది. జీవ వైవిధ్య సదస్సు(సీబీడీ) వ్యూహాత్మక ప్రణాళిక 2011-2020 కోసం పర్యావరణ శాఖ తాజాగా రూపొందించిన ఐదో జాతీయ నివేదికలో ఈ అంశాలను పొందుపరిచారు.
మనదేశంలో ఉన్న 45 వేల రకాల వృక్ష జాతులు, 91 వేల రకాల జంతుజాలాలు ఉండగా.. అందులో పలు జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి పేరిట అడవులను నరికివేయడం వన్యమృగాలకు పెనుశాపంగా మారుతోంది. అటవీ పరిరక్షణ చట్టం-1980 రూపొందించినప్పట్నుంచీ ఇప్పటిదాకా పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశంలో ఏకంగా 10.7 లక్షల హెక్టార్ల అటవీ భూమిని బదలాయించినట్లు నివేదికలో తెలిపారు. దేశ భూవిస్తీర్ణంలో 49.63 శాతం అడవులు ఉండాల్సి ఉన్నా.. అది కాలక్రమేణ గణనీయంగా పడిపోతున్నట్లు వివరించారు. అరావళి పర్వతాలు, పశ్చిమ శ్రేణులు వంటి ప్రాంతాల్లో గనుల త్వకాలు, క్వారీల వల్ల అక్కడి జీవజాలం మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.