
ఎగరడమే ఈ పక్షి ప్రత్యేకత!
ప్లే టైమ్
పక్షిజాతుల్లో బాగా బరువు పెరిగి కూడా ఎగిరే శక్తి కలిగినది గ్రేట్ బస్టర్డ్. మరీ ఎక్కువసేపు గాల్లో విహరించలేదు కానీ కోళ్ల తీరున ఎగిరే శక్తి ఉంటుంది. గరిష్టంగా 20 కిలోల వరకూ బరువు పెరిగి ఎగరగలగడం వల్ల దీనికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మూడడుగుల ఎత్తుండే ఈ పక్షి ప్రధానంగా యూరప్‌లో కనిపిస్తుంది. రష్యాలోని గడ్డిభూములు వీటికి ఆవాసాలు. కీటకాలు, చెదలు, గడ్డివిత్తనాలు ప్రధాన ఆహారం. విభిన్నమైన రంగుల్లో ఉండే గ్రేట్ బస్టర్డ్ మన దగ్గర కనిపించే టర్కీ కోళ్లకు సహజాతి లాంటిది.
వీటిలో మగవి బలిష్టంగా ఉంటాయి. పెట్టలతో పోలిస్తే 30 శాతం ఎక్కువ బరువు పెరుగుతాయి. పెట్టలు గుడ్లను పెట్టి పొదగడం ద్వారా పిల్లలకు జన్మనిస్తాయి. పిల్లల లాలన కూడా పెట్టల బాధ్యతే. ఈ పక్షి సగటున పది సంవత్సరాలు జీవిస్తుంది. ఇది అంతరిస్తున్న పక్షి జాతుల జాబితాలో ఉండటం గమనార్హం. గత శతాబ్దకాలంలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో యూరప్‌దేశాలు ఈ పక్షి జాతిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.