Play Time
-
అల్పకా... అచ్చంగా మన గొర్రే!...
ప్లే టైమ్ అల్పకా ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాల్లోనూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే జంతువు. శీతల వాతావరణంలో పెరగడం వల్ల దాని రూపంలో మార్పు కనిపిస్తోంది. కానీ ఇది అచ్చం మన గొర్రెను పోలిన జంతువే. మన దగ్గర గొర్రెల ఉన్నికి, మాంసానికి గిరాకీ ఉన్నట్లే... చిలీ, ఈక్వెడార్, బొలీవియా, పెరూ వంటి దేశాల్లోనూ అల్పకాల మాంసానికి, ఉన్నికి డిమాండ్ ఎక్కువ. అక్కడి ప్రజలు దీన్ని పెంపుడు జంతువుగా, వాణిజ్య జంతువుగా పెంచుకొంటారు. వీటి ఉన్నితో స్వెటర్లు, టోపీలు, గ్లోవ్స్ చేస్తారు. పెరూ దేశంలో పెరిగే అల్పకా నుంచి 52 రంగుల ఉన్ని లభిస్తుంది. సహజరంగుల్లో లభించే ఉన్ని కాబట్టి, ఈ ఉన్నికి వస్త్ర పరిశ్రమలో డిమాండ్ ఎక్కువ. అల్పకాలు 48 నుంచి 84 కేజీల బరువు పెరుగుతాయి. జీవనశైలి, ఆహారం విషయంలోనూ అరుపులోనూ ఇవి గొర్రెలనే గుర్తు చేస్తాయి. వీటిల్లో పోతులు (మగవి) మన పొట్టేళ్లలాగానే పొడుస్తూ దాడికి దిగుతాయి. -
అరుదైన పక్షి అర్కిటిక్ టెర్న్
ప్లే టైమ్ సృష్టిలో అత్యంత సుదీర్ఘమైన దూరం వలస వెళ్లే పక్షి అర్కిటిక్ టెర్న్. 28 నుంచి 39 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ పక్షి రెక్క చాచితే దాదాపు 75 సెంటీమీటర్లుంటుంది. ఆహారం కోసం, సంతానోత్పత్తిలో భాగంగా పొదగడం కోసం ఈ జాతి పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ జాతి పక్షులు ఆర్కిటిక్ ఉత్తర భాగంలోని గ్రీన్లాండ్ నుంచి అంటార్కిటికాలోని వెడెల్ సీ వరకూ ప్రయాణిస్తాయి. అంటే దాదాపు 90 వేల కిలోమీటర్లన్నమాట! ఇప్పటి వరకూ గుర్తించిన పక్షుల వలసల్లో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఇదే. ఈ పక్షి దాదాపు 30 యేళ్ల పాటు జీవిస్తుంది. ఆహారం కోసం సముద్రాల మీదే ఆధారపడుతుంది. చేపలను ఇష్టంగా భుజిస్తుంది. వలస విషయంలో అరుదైన శక్తి ఉన్న ఈ పక్షి జాతి అంతరిస్తున్న జాతుల్లో ఒకటిగా ఉండటం ఆందోళనకరమైన పరిణామం. -
ఎగరడమే ఈ పక్షి ప్రత్యేకత!
ప్లే టైమ్ పక్షిజాతుల్లో బాగా బరువు పెరిగి కూడా ఎగిరే శక్తి కలిగినది గ్రేట్ బస్టర్డ్. మరీ ఎక్కువసేపు గాల్లో విహరించలేదు కానీ కోళ్ల తీరున ఎగిరే శక్తి ఉంటుంది. గరిష్టంగా 20 కిలోల వరకూ బరువు పెరిగి ఎగరగలగడం వల్ల దీనికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మూడడుగుల ఎత్తుండే ఈ పక్షి ప్రధానంగా యూరప్‌లో కనిపిస్తుంది. రష్యాలోని గడ్డిభూములు వీటికి ఆవాసాలు. కీటకాలు, చెదలు, గడ్డివిత్తనాలు ప్రధాన ఆహారం. విభిన్నమైన రంగుల్లో ఉండే గ్రేట్ బస్టర్డ్ మన దగ్గర కనిపించే టర్కీ కోళ్లకు సహజాతి లాంటిది. వీటిలో మగవి బలిష్టంగా ఉంటాయి. పెట్టలతో పోలిస్తే 30 శాతం ఎక్కువ బరువు పెరుగుతాయి. పెట్టలు గుడ్లను పెట్టి పొదగడం ద్వారా పిల్లలకు జన్మనిస్తాయి. పిల్లల లాలన కూడా పెట్టల బాధ్యతే. ఈ పక్షి సగటున పది సంవత్సరాలు జీవిస్తుంది. ఇది అంతరిస్తున్న పక్షి జాతుల జాబితాలో ఉండటం గమనార్హం. గత శతాబ్దకాలంలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో యూరప్‌దేశాలు ఈ పక్షి జాతిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
ఉడతను పోలిన బుడత!
ప్లే టైమ్ గుండ్రని కళ్లతో, దట్టంగా ఉండే బొచ్చుతో, దళసరి చర్మంతో, పిడికెడంత రూపంతో ఉండే దీని పేరు ఫ్లయింగ్ లెమర్. ప్రధానంగా ఆగ్నేసియాలోని వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. లెమర్లలో ఉండే కొన్ని వందల జాతుల్లో ఈ ఫ్లయింగ్ లెమర్ కూడా ఒకటి. విచిత్రమేమిటంటే దీని పేరును బట్టి గాల్లో విహరిస్తుందనుకొంటాం. కానీ దీనికి రెక్కలేం ఉండవు, ఎగరనూ లేదు. చెట్ల కొమ్మలపై ఉరుకులుపరుగులతో కదులుతుంటుంది. చెట్లకు వేలాడుతుంది. అందుకే దీన్ని ఫ్లయింగ్ లెమర్ అంటారు. కచ్చితంగా చెప్పాలంటే దీని జీవనశైలి మన దగ్గర విస్తృతంగా కనిపించే ఉడుతలతో పోలి ఉంటుంది. చెట్ల కొమ్మలపై అటూ ఇటూ ఎగురుతూ ఉత్సాహంగా కనిపిస్తుంటుంది. ఫ్లయింగ్ లెమర్ శాకాహారి. చెట్ల ఆకులనూ, తనకు ఇష్టమైన కొమ్మలనూ కొరుక్కుతింటుంది. ఇది కిలో నుంచి ఒకటిన్నర కిలో వరకూ పెరుగుతుంది. ఫ్లయింగ్ లెమర్ క్షీరజాతికే చెందినది. ఆడ లెమర్లు ఒకటీ రెండు పిల్లలకు జన్మనిచ్చి పిల్లలకు పాలిచ్చిపెంచుతాయి. -
గుడ్లు పెట్టే ‘క్షీరదం’
ప్లే టైమ్ సరస్సులు, నదులు... వాటి ఒడ్డుల్లో నివసించే డక్‌బిల్ ప్లాటిపస్ది ఆసక్తికరమైన జీవనశైలి. ప్రధానంగా ఆస్ట్రేలియన్ తూర్పు ప్రాంతంలో కనిపించే ఇది క్షీరదజాతికి చెందినది. పునరుత్పత్తి ప్రక్రియలో ఇది గుడ్లు పెడుతుంది. దీంతో గుడ్లు పెట్టి పాలిచ్చే అరుదైన జీవిగా దీనికి గుర్తింపు ఉంది. నీటి అడుగున ఉండే చిన్న చిన్న చేపలు, లార్వాలు, పురుగులు, ఇతర జీవులే దీనికి ఆహారం. ఒక్కసారి నది అడుగుకు చేరిన ప్లాటిపస్ వీలైనంత ఆహారాన్ని సంపాదించుకొని నోటిలో పెట్టుకొంటుంది. ఒడ్డుకు చేరిన తర్వాత నెమరువేస్తూ ఆ ఆహారాన్ని మింగుతుంది. పళ్ల విషయంలో కూడా ప్లాటిపస్ ప్రత్యేకమైనదే. పుట్టినప్పుడు ఈ క్షీరదానికి పళ్లుంటాయి. అయితే కొంత వయసు వచ్చే సరికి అవన్నీ ఊడిపోతాయి. ఆ తర్వాత కూడా ఆహారాన్ని నెమరువేయడానికి దీనికే ఇబ్బందీ ఉండదు. ఆకలి తీరాకా ఒడ్డున చేరి సూర్యకాంతిని ఆస్వాదించడం వీటికి బాగా ఇష్టం. -
సముద్ర రామచిలకలు
ప్లే టైమ్ ‘సీ ప్యారెట్స్’గా పేరు పొందిన పఫిన్స్ జీవనశైలి ఉభయచర జీవుల్లా ఉంటుంది. ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతంలో కనిపించే పక్షిజాతి ఇది. చేపలను, నీటిలో ఉండే ఇతర చిన్న చిన్న జీవులను పట్టుకొని తింటూ మనుగడ సాగిస్తాయివి. వీటి ఊపిరితిత్తుల వ్యవస్థ నీటిలోనైనా, ఉపరితలంపైనైనా శ్వాస తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ పక్షి ఒక నిమిషంలో నాలుగువందల సార్లు రెక్కలు ఆడించగలదు. గంటకు 55 మైళ్ల వేగంతో గాలిలో రివ్వున దూసుకెళ్లగలదు. నీటిలోకి డైవ్చేయడం వీటికి బాగా ఇష్టం. ఒక నిమిషం పాటు నీటిలోనే మునిగి చేపల వేట సాగించగలవు. వీటిది గుంపుగా నివసించే జీవనశైలి. ఇవి ఉండే ప్రాంతాన్ని ‘కాలనీ’లుగా వ్యవహరిస్తారు. రంగు విషయంలో పెంగ్విన్లను పోలి ఉండే పఫిన్స్కు ఆ జాతితో ఎలాంటి సంబంధమూ ఉండదు. వీటిని ‘క్లాన్స్ ఆఫ్ ది సీ’ అని కూడా అంటారు. ఈ పక్షి పేరు మీదుగా వెబ్‌బ్రౌజర్ కూడా ఉంది. వేగానికి ప్రతీకగా ఆ బ్రౌజర్‌కు దీని పేరు పెట్టారు.