గుడ్లు పెట్టే ‘క్షీరదం’
ప్లే టైమ్
సరస్సులు, నదులు... వాటి ఒడ్డుల్లో నివసించే డక్‌బిల్ ప్లాటిపస్‌ది ఆసక్తికరమైన జీవనశైలి. ప్రధానంగా ఆస్ట్రేలియన్ తూర్పు ప్రాంతంలో కనిపించే ఇది క్షీరదజాతికి చెందినది. పునరుత్పత్తి ప్రక్రియలో ఇది గుడ్లు పెడుతుంది. దీంతో గుడ్లు పెట్టి పాలిచ్చే అరుదైన జీవిగా దీనికి గుర్తింపు ఉంది. నీటి అడుగున ఉండే చిన్న చిన్న చేపలు, లార్వాలు, పురుగులు, ఇతర జీవులే దీనికి ఆహారం. ఒక్కసారి నది అడుగుకు చేరిన ప్లాటిపస్ వీలైనంత ఆహారాన్ని సంపాదించుకొని నోటిలో పెట్టుకొంటుంది. ఒడ్డుకు చేరిన తర్వాత నెమరువేస్తూ ఆ ఆహారాన్ని మింగుతుంది. పళ్ల విషయంలో కూడా ప్లాటిపస్ ప్రత్యేకమైనదే. పుట్టినప్పుడు ఈ క్షీరదానికి పళ్లుంటాయి. అయితే కొంత వయసు వచ్చే సరికి అవన్నీ ఊడిపోతాయి. ఆ తర్వాత కూడా ఆహారాన్ని నెమరువేయడానికి దీనికే ఇబ్బందీ ఉండదు. ఆకలి తీరాకా ఒడ్డున చేరి సూర్యకాంతిని ఆస్వాదించడం వీటికి బాగా ఇష్టం.