ఆస్ట్రేలియాలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ నిబంధన
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది.
పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు.
అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment