సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభంతో పాఠాలు నేర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కార్మికులను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వలస కార్మికులు స్వరాష్ట్రాలకు తరలిపో తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా కల్లోలం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడం, సొంత రాష్ట్రాల బాట పట్టిన శ్రమజీవులు ఇప్పట్లో తిరిగి వచ్చే సంకేతాలు లేకపోవడంతో విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కే దిశగా ఆలోచనలు చేస్తోంది. భవిష్యత్తులోనూ పూర్తిస్థాయిలో వలస కార్మికులపై ఆధారపడకుండా.. స్థానిక మానవ వనరులు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వలస కూలీల స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి కార్మికుల రూపంలో అందుబాటులోకి తెచ్చుకోవాలని భావిస్తోంది.
మనవారికీ ఉపాధి కరువు..
కరోనా విశ్వరూపంతో ముంబై, సూరత్, గల్ఫ్ దేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మన కార్మికులకు కూడా ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభంతో ఆనేక కంపెనీలు మూత పడుతున్నాయి. మరికొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో లాక్‌డౌన్ ఎత్తేయగానే ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు తిరిగి వస్తారని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది. వీరిలో అధికశాతం నైపుణ్యవంతులు కానందున.. ఇక్కడ ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి తలనొప్పి కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సానుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వలస కూలీలు వెళ్లిపోవడంతో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారితో పాటు స్థానిక యువతకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐదుగురితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు
లాక్‌డౌన్ సంక్షోభం ఏయే రంగాలపై ఎంత ప్రభావం చూపుతుంది? వలస కార్మికులు అధికంగా తరలి వెళ్లిన రంగాలేంటి? ఏయే రంగాల్లో అవకాశాలున్నాయనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
3 లక్షల మంది తిరుగుముఖం
లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక సుమారు 3 లక్షల మంది వలస కార్మికులు స్వస్థలాలకు తరలి వెళ్లారు. మరికొందరు ప్రజా రవాణా పునరు ద్ధరించగానే వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుం టున్నారు. ఇలా తరలివెళ్లిన వారిలో అత్యధికులు భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులే. రాష్ట్రంలో 16 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ మండలిలో నమోదు కాగా.. వీరికి అదనంగా మరో నాలుగైదు లక్షల మంది అనధికారికంగా పని చేస్తుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కరోనా మహమ్మారి ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా లాక్‌డౌన్‌లో నిర్మాణ రంగానికి సడలింపులు ఇచ్చినప్పటికీ కార్మికుల కొరత పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అవలంభిస్తోంది. ఒకవైపు వలస కార్మికుల కొరతను అధిగమించేందుకు.. మరోవైపు గల్ఫ్, ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే వారికి ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం ద్వారా నిష్ణాతులుగా తయారు చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment