
కైకలూరు: అరకేజీ బరువున్న చేపను అమాంతంగా మింగేసే పక్షిని మీరెప్పుడైనా చూశారా? వివిధ రంగుల కలబోత పక్షి ఉన్నట్లు మీకు తెలుసా.. చేపలను చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లల నోటిలో పెట్టి మాతృత్వ ఆనందాన్ని పొందే అతిథి గురించి విన్నారా.. సహజత్వం ఉట్టిపడే పక్షుల బొమ్మలు, ముట్టుకుంటే మధురంగా వినిపించే ధ్వనులు ఇలా ఒకటేంటి అటపాక పక్షుల కేంద్రంలో.. ప్రతి దృశ్యాన్ని కనులారా చూసి ఆస్వాదించాల్సిందే.
పెలికాన్ ప్యారడైజ్..
రాష్ట్రంలో పెలికాన్ ప్యారడైజ్‌గా పేరుపొందిన అటపాక పక్షుల విహార కేంద్రానికి శీతాకాలపు వలస విదేశీ పక్షుల రాక ఊపందుకుంది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రకృతి తన సహజసిద్ధ వాతావరణాన్ని సంతరించుకోవడంతో.. 188 రకాల విదేశీ అతిథి పక్షులకు ఆవాసంగా మారి ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మైళ్ల దూరాన్ని ఛేదించి పక్షులు కొల్లేరుకు చేరుకుంటున్నాయి. ఇకపోతే.. అటపాక పక్షుల కేం ద్రం వద్దకు వచ్చిన పర్యాటకుల పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయల వం టివి రారమ్మని పిలుస్తుంటాయి. మ్యూజియంలో ఏర్పాటు చేసిన పక్షుల నమూనా బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. కొల్లేరులో బోటుపై వెళుతూ పక్షులను దగ్గర నుంచి చూడడం జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టంగా నిలిచిపోతుంది.
ఆలనా..పాలనా అటవీశాఖదే..
అటపాక పక్షుల కేంద్ర నిర్వహణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ పక్షుల విహారానికి అనువుగా 280 ఎకరాల చెరువు ఉంది. అందులో 162 స్టాండ్లు ఉన్నాయి. వీటిపై పెలికాన్, పెయింటెడ్ స్టా్కక్, వైట్ ఐబీస్, కార్బొనెంట్ పక్షులు కొలువుదీరాయి. ఇప్పటికే పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. పక్షుల పిల్లల వయసు నెల రోజులు దాటింది. వాటి కేరింతలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బోటు షికారుకు రెండు బోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు.