కొండవీడు దుర్గం.. చారిత్రక అందం | AP Govt measures for Kondaveedu fort development | Sakshi
Sakshi News home page

కొండవీడు దుర్గం.. చారిత్రక అందం

Published Mon, Nov 18 2019 4:23 AM | Last Updated on Mon, Nov 18 2019 4:24 AM

AP Govt measures for Kondaveedu fort development - Sakshi

వయ్యారాలు పోయే ఒంపుల దారిలో ఆహ్లాదకర వాతావరణం పర్యాటకులను రా..రమ్మని స్వాగతిస్తుంది. పచ్చల హారం అద్దుకున్న ప్రకృతి కాంత ఆప్యాయంగా పలకరిస్తుంది. కోట బురుజులు.. విశాలమైన ప్రాకారాలు.. వాటి మధ్య తటాకాలు.. అలనాటి ధాన్యాగారాలు.. ఆలయాలు అబ్బురపరుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వారసత్వ సంపదగా.. రక్షిత కట్టడంగా వెలుగొందుతున్న కొండవీటి కోటలోకి ఓ సారి తొంగిచూస్తే ఉత్సాహం ఉరకలెత్తుతుంది. మనసు ఉల్లాసంతో నిండిపోతుంది.

శత్రు సైన్యాన్ని బంధించడానికి బలంగా పెనవేసిన తాడు వంటిది కొండవీటి దుర్గం. పరాక్రమమంటే ఇష్టపడే మహావీరులకు సరైన నివాస స్థానం. ఓటమిని అంగీకరించిన వారికి సామ్రాజ్యాన్ని తిరిగి అప్పగించే సంప్రదాయం కొండవీటి రెడ్డి రాజుల సొంతం. ఉత్తమ జాతి అశ్వాలకు, వీరులకు, సంపదలకు, మదపుటేనుగులకు పెట్టింది పేరైన కొండవీడు.. దేవతల రాజధాని అమరావతికి సరిజోడుగా నిలుస్తుంది. 
- కవి సార్వభౌముడు శ్రీనాథుడి వర్ణనకు సంక్షిప్త రూపం

సాక్షి, అమరావతి బ్యూరో: కొండవీడు.. గుంటూరు జిల్లాలోని చారిత్రక ప్రదేశం. పర్యాటకుల స్వర్గధామంగా వెలుగొందుతున్న ఇక్కడి గిరి దుర్గాన్ని రెడ్డి రాజులు నిర్మించారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ.1325 నుంచి క్రీ.శ. 1425 మధ్య రెడ్డి రాజుల పాలన సాగింది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఇక్కడి గిరి దుర్గం చారిత్రక సంపదగా వెలుగొందుతోంది. రెడ్డి రాజులు తెలుగును అధికార భాషగా చేసి.. శాసననాలను తెలుగులో రాయించారు. వారి ఆస్థానంలో యర్రాప్రగడ కవిగా.. శ్రీనాథుడు విద్యాధికారిగా పని చేసినట్లు చరిత్ర చెబుతోంది. పర్యాటకులు ఈ కోటను చేరుకోవడం గతంలో కష్టమయ్యేది. ఇటీవల రోడ్డు నిర్మాణం పూర్తి చేసి.. సౌకర్యాలు కల్పిస్తుండటంతో అక్కడకు సులభంగా చేరుకుని, ప్రకృతి ఒడిలో సేదతీరే అవకాశం కలిగింది.

అలనాటి ఆలయాలు..  ఆధ్యాత్మిక లోగిళ్లు
రెడ్డి రాజుల అనంతరం కొండవీడును అనేక రాజవంశాలు పాలించాయి. వారంతా శైవ, వైష్ణవ ఆలయాల్ని నిర్మించారు. వాటిలో ఒక శివాలయాన్ని, ఒక లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మిస్తోంది. కుతుబ్‌షాహి కాలంలో నిర్మించిన రెండు మసీదులు కూడా ఇక్కడ ఉన్నాయి. కోట దిగువ భాగంలో అతి పెద్దదైన గోపీనాథ ఆలయం ఉంది. దీనిని విజయ నగర రాజుల కాలంలో నిర్మించారు. 40 స్తంభాలతో గర్భ గుడి, అంతరాలయం, అర్ధ మండపం, ముఖ మండపం, ప్రాకారం, దీపపు స్తంభాలు ఇక్కడి ప్రత్యేకత. అచ్యుత రాయల కాలంలో రామయ్య భాస్కరుడు అనే మంత్రి తన వద్ద పని చేసిన 72 మంది పాలెగాళ్లు తిరుగుబాటు చేయగా.. వారిని గోపీనాథ ఆలయ ఉత్సవాలకు పిలిచి.. గుడి బావిలో కత్తులు అమర్చి.. వారు అందులో పడి మరణించేలా పథకాన్ని రచించాడని కొండవీటి చరిత్ర చెబుతోంది. కొండల పాదాన గల చంఘిజ్‌ఖాన్‌ పేటలో దేశంలో ఎక్కడా లేనివిధంగా వెన్నముద్ద బాలకృష్ణుడు కొలువయ్యాడు. అమీనాబాద్‌లోని చిన్న కొండపై రెడ్డి రాజుల కుల దైవం మూలాంకురేశ్వరిదేవి కొలువై ఉంది. 

సిద్ధమైన వారసత్వ ప్రదర్శన శాల
గతంలో ఇక్కడ యోగ వేమన మండపం ఉండేదని చరిత్ర చెబుతోంది. దీంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య సుమారు రూ.10 కోట్లు వెచ్చించి కొండవీడు వారసత్వ ప్రదర్శన శాల పేరుతో అధునాతన మ్యూజియం నిర్మించింది. 

ఇవీ  ప్రత్యేకతలు
- కోటలో మొత్తం 23 బురుజులు ఉన్నట్లు కొండవీడు కైఫీయత్‌ వెల్లడిస్తోంది
కోటకు నలువైపులా గల చక్కలకొండ బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజు, బి.ఖిల్లా బురుజు శత్రు మూకలను పసిగట్టి సైన్యాన్ని అప్రమత్తం చేయటానికి ఉపయోగపడేవి 
అన్ని బురుజుల్లో చుక్కల కొండ బురుజు పెద్దది కాగా.. నెమళ్ల బురుజు అత్యంత పొడవైనది
​​​​​​​- ఇక్కడి అడవుల్లో 56 రకాల ఔషధ మొక్కలు లభ్యమవుతున్నట్లు వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు
​​​​​​​- క్రీ.శ. 15వ శతాబ్దానికి చెందిన కొండవీటి రాయసం పేరయ్య ‘నవనాథ సిద్ధసారం’ అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించి ప్రసిద్ధుడయ్యారు

ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
కొండవీడుకు ఉన్న విశిష్టత మరే ప్రదేశానికి లేదు. ఇది కాలుష్య రహిత ప్రదేశం. చారిత్రక విశేషాలెన్నో ఇక్కడ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఇదో గొప్ప ప్రాంతం. దీనిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిద్దిదాలి.
- కల్లి శివారెడ్డి, జనరల్‌ సెక్రటరీ, కొండవీటి హెరిటేజ్‌ సొసైటీ, గుంటూరు

సొగసైన ఘాట్‌ రోడ్డు
- కొండవీటి కోటకు ఘాట్‌ రోడ్డు మణిహారంగా నిలుస్తుంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది
ఇది 5.1 కిలోమీటర్ల పొడవు.. 30 అడుగుల వెడల్పు.. 17 మలుపులతో మెలికలు తిరిగి ఉంటుంది. కింది నుంచి చూస్తే కొండపైకి భారీ నల్ల త్రాచు వెళుతున్నట్లు అనిపిస్తుంది
రోడ్డుపై ప్రయాణిస్తున్నంత సేపూ ఊటీ లేదా కొడైకెనాల్‌లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుంది. రాత్రివేళ రహదారి మొత్తం విద్యుత్‌ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతుంది
సర్కారు ప్రత్యేకదృష్టి
కొండవీడు కోటను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పర్యాటకుల సౌకర్యం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.70 లక్షలతో 7 గజబులు నిర్మిస్తున్నారు. ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులకు  రూ.11.80 కోట్లను ఖర్చు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement