సాక్షి, అమరావతి: గడిచిన రెండేళ్లలో అనేక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.లక్ష కోట్లకు పైగా నగదును నేరుగా జమ చేసి.. సంక్షేమ పథంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ కేంద్రంగా నిర్వహించిన ‘భారతదేశంలో గిరిజన విధానాలు, కార్యాక్రమాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ ప్రతిబింబాలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది.
ముఖ్య అతిథి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష మంది గిరిజనులకు 2 లక్షల 30 వేల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయడం గొప్ప రికార్డు అన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. గిరిజనులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలనే సంకల్పంతోనే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా తగిన అభిప్రాయ సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ సదస్సును నిర్వహించాయన్నారు. గిరిజనుల కోసం చేపట్టే ప్రతి పథకం ద్వారా ఫలాలు వారికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ వైఏ సుధాకర్‌రెడ్డి, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ డి.లక్ష్మి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment