సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పాదచారుల భద్రతకు పెద్దపీట వేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు పై దృష్టి సారించారు. ఇప్పటికే ఠాణాల వారీగా అధ్యయనం పూర్తి చేసి ఎనిమిది ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలోని తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఈ మేరకు రూపొందించిన నివేదికలను జీహెచ్‌ఎంసీకి పంపారు. సిటీలో నిత్యం పాదచారుల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడస్ట్రియన్స్ 36 శాతానికి పైగా ఉన్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారిపై గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాతపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు.
సిటీలో గత ఏడాది మొత్తం 2540 ప్రమాదాలు చోటు చేసుకోగా... 2550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాలబారిన పడిన పాదచారుల సంఖ్య 924. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెహదీపట్నం రైతు బజార్ వద్ద ఓ పెలికాన్ సిగ్నల్ అందుబాటులో ఉంది. దీనికి తోడు మరిన్ని ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఠాణాల వారీగా అధ్యయనం చేసిన అధికారులు మరో తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఆయా రహదారులపై ఉండే రద్దీతో పాటు రోడ్డు వెడల్పును పరిగణలోకి తీసుకుని ఈ పాయింట్స్ నిర్ధారించారు. గతంలో అక్కడ చోటు చేసుకున్న పాదచారుల ప్రమాదాలను లెక్కించారు. ఇప్పటికే దాదాపు ప్రతి కీలక జంక్షన్‌లోనూ పెడస్ట్రియన్ టైమ్‌తో సిగ్నల్స్ పని చేస్తున్నాయి. దీని ప్రకారం నిర్ణీత సమయానికి ఒకసారి జంక్షన్‌లో ఉండే అన్ని సిగ్నల్స్‌లోనూ రెడ్‌లైట్ వెలిగి వాహనాలు ఆగిపోతాయి. ఆ సమయంలో ప్రత్యేక శబ్ధంతో పెలికాన్ సిగ్నల్ వెలుగుతూ పాదచారులు రోడ్డు దాటేందుకు సహకరిస్తుంది. ఇవి దాదాపు అన్ని జంక్షన్స్‌లోనూ అందుబాటులో ఉండటంతో తాజా అధ్యయనాన్ని జంక్షన్లు కాని ప్రాంతాల్లో నిర్వహించారు. అయితే వీటిలో ఏ తరహాకు చెందిన పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు. పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరించే పెలికాన్ సిగ్నల్స్ సాధారణంగా రెండు రకాలైనవి ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటాలని భావించినప్పుడు వారే రెడ్ లైట్ వచ్చేలా సిగ్నల్‌లోని బటన్స్ నొక్కే ఆస్కారం ఉన్నవి మాన్యువల్‌గా పని చేస్తుంటాయి. మరోపక్క నిర్ణీత సమయం తర్వాత కొన్ని సెకన్ల పాటు అన్ని రెడ్‌లైట్ వచ్చి పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరిస్తుంటుంది. ఈ రెండు విధాలైన సిగ్నల్స్‌లో ఉన్న మంచి చెడులతో పాటు వాటిని ఏర్పాటు చేసే ప్రాంతాల పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ తరహాకు చెందినవి ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయనున్నారు.
ప్రతిపాదిత ప్రాంతాలు
♦ బేగంపేట ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మినిస్టర్స్ రోడ్‌లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా
♦ సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలోని మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ ఇన్‌గేట్ ఎదురుగా
♦ మలక్‌పేట పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్న చర్మాస్ షోరూమ్ వద్ద
♦ నల్లకుంటలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని వచ్చే తార్నాకలోని రైల్వే డిగ్రీకాలేజ్ సమీపంలో
♦ బహదూర్‌పుర పరిధిలోని తాడ్‌బండ్ వద్ద ఉన్న జూపార్క్ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా
♦ తిరుమలగిరిలోని బోయిన్‌పల్లి మార్కెట్ ప్రాంతంలో
♦ ఫలక్‌నుమ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని పిసల్‌బండ వద్ద ఉన్న డీఆర్‌డీఓ చౌరస్తా, బండ్లగూడ సమీపంలో
♦ మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మాదన్నపేట మండి వద్ద
Comments
Please login to add a commentAdd a comment