ఆకట్టుకుంటున్న పురాతన వస్తువుల మ్యూజియం వైకే యాంటిక్ హోమ్‌లో
1400 ఏళ్ల నాటి వస్తువులు నాటి మధుర జ్ఞాపకాలను సందర్శకుల కళ్లకు కడుతూ
గతమెంతో ఘనం.. నేడు జీవనమే గగనం..అనే నానుడి అందరికీ తెలిసిందే..నగరంలోని వైకే యాంటిక్ హోంలో ఏర్పాటు చేసిన మ్యూజియం చూస్తే ఇదే అక్షర సత్యం అని అనిపించక మానదు.. మన పూర్వీకులైన తల్లిదండ్రులు, తాత ముత్తాతల జీవన శైలి మనకు అబ్బురంగానూ.. అద్భుతంగానూ అనిపిస్తుంది.. నేటి ఆదునిక పోకడలు అనారోగ్యాలు తెచ్చిపెడుతోంటే.. నాటి జీవన శైలివైపుకే మరలా అడుగులు పడు తున్నాయి.. వంట పాత్రల నుంచి ఆహార పదార్థాల వరకూ కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే నానుడి నుంచి.. ఆ పాత మధురం.. అనే రీతిలో నేటి తరం జీవన శైలి మారుతోంది.. ఇత్తడి, రాగి, మట్టి పాత్రలకు ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిమాండే ఇందుకు నిదర్శనం.. – సాక్షి, సిటీబ్యూరో
మన పూర్వీకులు వంట చేసుకోవడం మొదలుకుని తినడానికి వాడే గిన్నెలు, ప్లేట్లు, పాత్రలు, సంగీత పరికరాలు, పెద్ద పెద్ద శబ్ధాలు చేసే పరికరాలు.. ఇలా అన్నీ ఒకే చోట కనువిందు చేస్తే.. ఆ ప్రాంతం నుంచి వెనిక్కి రావడానికి మనుసు ఒప్పుకోదు. అలాంటి ప్రదేశాల్లో ఒకటి సికింద్రాబాద్‌లోని వైకే యాంటిక్ హోం మ్యూజియం. పిల్లలకు మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయడం, పూర్వీకుల జీవన విధానంపై అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రదేశాలు ఎంతో తోడ్పడతాయి.
దాదాపు 1400 సంవత్సరాల నాటి కాలంలో వినియోగంలో ఉన్న వస్తువుల నుంచి 20వ శతాబ్దం వరకూ అప్పటి జీవన విధానంలో వినియోగించిన అనేక పరికరాలు, వస్తువుల, ఆయుధాలు ఈ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. మన పూర్వీకులకు చెందినవే కాకుండా ఇతర దేశాలకు చెందిన పలు రకాల చారిత్రక, సాంస్కృతిక వస్తువులు ఇక్కడ సందర్శనకు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు ప్రవేశం ఉచితం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మ్యూజియంలోకి అనుమతిస్తారు. 9963822339 లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
తొలుత పది వస్తువులతో
మాది కాకినాడకు సమీపంలోని సోమేశ్వరం. కుటుంబాన్ని చెన్నైకి తరలించే క్రమంలో మా అమ్మ పురాతన వస్తువులను వెంట తెచ్చుకుంది. వాటిని చూసినవారు చాలా బాగున్నాయని ప్రశంసించేవారు. దీంతో ఇలా అందరికీ మధురజ్ఞాపకాలను అందించే వస్తువులను సేకరించాలని నిర్ణయించుకున్నా. 50 ఏళ్ల నుంచి సికింద్రాబాద్‌లోని లోతుకుంటలో ఇంటినే మ్యూజియంగా మార్చాను. తొలుత 10 వస్తువులతో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం వెయ్యికిపైగా వస్తువులకు చేరింది. – వై.కృష్ణమూర్తి, మ్యూజియం నిర్వాహకులు
అమ్మ గుర్తుకొచ్చింది
మేం చిన్నప్పటి నుంచి వినియోగించే చాలా రకాల వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్నానాలకు నీరు వేడిచేసే పాత్ర, పచ్చడి పెట్టుకునే పింగాణీ కుండలు, కంచు, ఇత్తడి సామాగ్రిని చూసిన వెంటనే అమ్మ గుర్తుకొచ్చింది. కాలంతో పాటు పాత్రలు మారిపోతున్నాయి. – సుభాషిణి, బేగంపేట్
Comments
Please login to add a commentAdd a comment