పెలికాన్ పక్షి-పెయింటెడ్ స్టార్క్ పక్షి
విడిదికి వచ్చిన విదేశీ అతిథికి కష్టమొచ్చింది. అంతుచిక్కని వైరస్ పంజా విసరడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైబడి పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. డిసెంబర్‌లో మొదలైన మరణ మృదంగం నేటికీ ఆగడం లేదు. గడిచిన మూడు రోజుల్లో మరో ఆరు పక్షులు మృత్యువాతపడ్డాయి. వైరస్ ప్రభావం ఒక్కరకం పక్షుల మీద మాత్రమే ఉండడం ఆలోచించదగిన అంశం. కారణాలు అన్వేషించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయి ఫలితం కనిపించడం లేదు. పక్షుల మరణాలు ఆగకపోవడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. పశువులు, ఇతర మూగజీవాలపై ఈ వైరస్ ప్రభావం ఇప్పటి వరకూ కనబడకున్నా భవిష్యత్తులో ఏమైనా ఉంటుందా..? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
చెరువుల నీటి వినియోగంపై ఆందోళన..
తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి ఆనుకుని ఉన్న కర్రివానిచెరువు, కొత్తచెరువు, పాతచెరువు, మిడిబంద, అక్కులవానిచెరువు, దాలిచెరువు, ఊర చెరువుల్లో ఉండే చేపల్లో ఒక రకమైన వైరస్ వ్యాప్తి చెందడంతో వాటిని తిన్న పక్షులు మృత్యువాత పడుతున్నట్లు పశు సంవర్థక శాఖ వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఆయా చెరువుల్లో నీటిని తాగుతున్న మిగిలిన పశువులకు వైరస్ ఏమైనా వ్యాప్తిస్తుందా.. అందులో ఉండే చేపలు తినడం వల్ల ప్రమాదం ఏమైనా ఉంటుందా అన్న సందేహాల్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిశోధించాలని అధికారులను కోరుతున్నారు. నీటి వినియోగంపై కూడా ఆందోళన చెందుతున్నారు. అలాగే మృతి చెందిన పక్షుల కళేబరాలను విడిది కేంద్రం సమీపంలోని పంట పొలాల్లో పూడ్చిపెడుతుండడంతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని అటు ప్రజలు, ఇటు రైతులు భయాందోళన చెందుతున్నారు.
డీ వార్మింగే పరిష్కారమా..
విదేశీ పక్షుల మృత్యువాతను ఏ విధంగా కట్టడి చెయ్యాలో తెలియక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పశు సంవర్థక శాఖ వైద్యులు సూచన మేరకు పక్షులకు డీ వార్మింగ్ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అత్యధిక ఖర్చుతో కూడుకోవడంతో ఏం చేయాలో తెలియక అటవీ శాఖాధికారులు సందిగ్ధంలో పడ్డారు. పక్షుల మృత్యువాతకు కారణమైన చేపలపై పరీక్షలు నిర్వహించాలని గత నెలలో జిల్లా స్థాయి మత్స్య శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు అటవీ శాఖాధికారి శాస్త్రి ‘సాక్షి’కి తెలిపారు.
పక్షుల కేంద్రంలో పెయింటెడ్ స్టార్క్ పక్షులు
పశువులకు ఎటువంటి భయం లేదు..
చేపల్లో బయటపడిన ఒక రకమైన వైరస్ వల్ల ఆయా చెరువుల నీటిని తాగుతున్న పశువులకు ఎటువంటి ప్రాణభయం లేదని టెక్కలి పశు సంవర్థక శాఖ ఏడీ జి.రఘునాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే తేలినీలాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పక్షుల మృత్యువాత గూర్చి తెలుసుకున్నామని చెప్పారు.
ప్రత్యేకతలివే..
పెలికాన్..
ఇది బాతు జాతి పక్షి 8 బరువు 8 కిలోలు
ముక్కు పొడవు 14 సెంటీమీటర్లు
రోజుకు 4 కిలోల చేపల్ని ఆహారంగా తీసుకుంటుంది
ఒకేసారి 2 కిలోల చేపను సునాయాసంగా భుజించేస్తుంది
దవడ భాగం సంచి ఆకారంలో ఉంటుంది
ఇవి పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి
ఆహార సేకరణకు రోజుకు నాలుగు సార్లు బయటకు వెళ్తాయి
దవడలో సుమారు 2 కేజీల వరకు
ఆహారాన్ని నిల్వ చేసుకునే సదుపాయం ఉంది
నిల్వ చేసుకునే క్రమంలో ఏదైనా తేడా జరిగి ఆహారం విషతుల్యమై.. ప్రాణాలు పోతున్నాయా..
అన్న కోణంలో కూడా అధికారులు అన్వేషిస్తున్నారు
వైరస్ ప్రభావంతో ఈ జాతి పక్షులు100కు పైగా మరణించాయి
జీవిత కాలం 29 ఏళ్లు
పెయింటెడ్ స్టార్క్
ఇది కొంగజాతి పక్షి
బరువు 5 కేజీలు
ముక్కు పొడవు 16 సెంటీమీటర్లు
చిన్న చేపలు, పురుగులు, నత్తలు దీని ఆహారం
250 గ్రాముల వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి
సేకరించిన ఆహారాన్ని గూళ్ల మీద వేస్తే వాటిని పిల్లలు తింటాయి
ఆహార సేకరణకు రోజుకు రెండుసార్లు బయటకు వెళ్తాయి
జీవిత కాలం 29 ఏళ్లు
తేలినీలాపురంలో ఇప్పటి వరకు ఈ జాతి పక్షి ఒక్కటి కూడా మృత్యువాత పడలేదు
అధికారులు వీటిని కూడా పరిశీలిస్తున్నారు
విదేశీ పక్షుల మృత్యువాతకు కారణమైన చేపల్లో ఉన్న వైరస్ ఏలిక పాములను చూపుతున్న అటవీ సిబ్బంది
స్పందించని మత్స్య శాఖ..
చేపల్లో వ్యాప్తి చెందిన వైరస్ వలన విదేశీ పక్షులు మృత్యువాత పడినట్లు పక్షుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఈ రోజు వరకు మత్స్యశాఖ సిబ్బంది కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన చేయలేదు. స్థానికులు కొన్ని చెరువుల్లో చేపల్ని పెంచుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రభావం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న కోణంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సిన మత్స్యశాఖ విభాగం కనీసం దృష్టి సారించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై టెక్కలి ఎఫ్‌డీఓ ధర్మరాజు వద్ద ప్రస్తావించగా.. పక్షుల అకాల మరణాలకు కారణం తెలియాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment