virus effect
-
తెలియకుండానే ప్రాణాంతకమయ్యే మెదడు వ్యాధులు.. డాక్టర్ల సూచనలివే!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): శరీరంలో అతి ముఖ్యమైనది మెదడు. దాని పనితీరు బాగుంటేనే ఎవరైనా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇటీవలి కాలంలో మెదడుకు సోకుతున్న వ్యాధులు పెరిగాయి. ముఖ్యంగా పలు రకాల ఎన్‌సెఫలైటీస్‌లతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అలా వస్తున్న వారిలో ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటీస్, హెర్పిస్ ఎన్సెఫలైటీస్, జపనీస్ ఎన్‌సెఫలైటీస్‌లతో పాటు, రెసిస్టెన్స్ ఎపిలెప్సీ, అటాక్సియా వంటి సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాతే ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి నెలకు 20 నుంచి 30 మంది మెదడు సంబంధిత సమస్యలతో వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇటీవల ఈ కేసులు ఎక్కువ వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో ఆస్పత్రిలో చేరితే ప్రాణాపాయం లేకుండా బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సోకుతున్న ఎన్సెఫలైటీస్లు, వాటి లక్షణాలు, చికిత్సలు ఇలా.. ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటీస్ శరీరంలోని యాంటీబాడీస్ ఒక్కోసారి కండరాలతో పాటు మెదడుపై ప్రభావం చూపుతాయి. దీంతో ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు, కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్న వారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పలు రకాల కీళ్లవాతం సమస్యలు, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఈ వ్యాధి రావచ్చు. ఇది సోకిన వారికి మొదటి స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్‌తో పాటు, అవసరమైతే డయాలసిస్ చేసి యాంటీబాడీస్‌ను అదుపుచేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. హెర్పిస్ ఎన్సెఫలైటీస్ ఇది హెర్పిస్ వైరస్ కారణంగా సోకే తీవ్రమైన మెదడు వాపు జబ్బు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. తీవ్రమైన జ్వరంతో ప్రారంభమై, ఫిట్స్ రావడం, 24 గంటల్లోనే స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనిని వెంటనే గుర్తిస్తే నయం చేసేందుకు మంచి మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకితే కోలుకోవడానికి వారం నుంచి పదిరోజులు పడుతుంది. తొలిదశలో గుర్తించకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అటాక్సియా ఇది సోకిన వారు నడిచేటప్పుడు, నిల్చున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంటారు. నడవడం కష్టంగా మారుతుంది. పిల్లలు, పెద్దవారిలో ఎవరికైనా రావచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, జన్యు లోపం, క్రోమోజోముల్లో తేడాలతో ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ రకమైన జన్యుపరమైన లోపం ఉంటుంది. దీనిని గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చు. రెసిస్టెన్స్ ఎపిలప్సీ సరిగా మందులు వాడని ఫిట్స్ రోగులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి మెదడు మొద్దుబారిపోవడంతో మందులు సరిగా పనిచేయక ఫిట్స్ వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. మందులు వేసినప్పటికీ పనిచేయవు. స్పృహ కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వారికి ఎక్కువ సమయం పనిచేసే మందులు ఇస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి, మెదడు ఎంత వరకు డ్యామేజీ అయిందో నిర్ధారిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. అందువలన ఫిట్స్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిది. చికిత్సతో నయం చేయొచ్చు ఇటీవల ఎన్సెఫలైటీస్ రోగులు తరచూ వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఓపీకి నెలలో 20 మందికి పైగా ఇలాంటి రోగులు వస్తున్నారు. తీవ్రమైన జ్వరంలో ఫిట్స్ రావడం, మాట కోల్పోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో వస్తున్నారు. వారు ఏ రకమైన ఎన్సెఫలైటీస్తో బాధపడుతున్నారో ముందుగా నిర్ధారించి చికిత్స చేస్తున్నాం. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్‌కు తొలుత స్టెరాయిడ్స్ ఇచ్చి, తగ్గకుంటే ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్ ఇస్తాం –డాక్టర్ దారా వెంకటరమణ, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ ప్రభుత్వాస్పత్రి -
మంకీపాక్స్-చికెన్‌పాక్స్ తేడాలు తెలుసా?
కరోనా కథ తగ్గుముఖం పడుతుందనుకున్న టైంలో.. మంకీపాక్స్ వైరస్ కలకలం మొదలైంది. కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యిందనుకున్న ఈ వైరస్.. యూరప్, అమెరికా ఖండాల్లో కేసులతో కలకలం రేపుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ కేసులు వెలుగు చూస్తుండడం, తాజాగా కేరళలో ఒక మరణం నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో కలకలం.. అంటూ నిత్యం ఏదో మూల దేశంలో ఇప్పుడు ఇది వినిపిస్తోంది. దీనికి తోడు వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్లకు.. మంకీపాక్స్ సోకిందేమో అని అధికారులు హడలిపోతుండడం, వైరస్ నిర్ధారణకు శాంపిల్స్‌ను పంపిస్తుండడం.. చూస్తున్నాం. అయితే నెగెటివ్‌గా తేలిన కేసులన్నీ చాలావరకు చికెన్‌పాక్స్ కావడం ఇక్కడ అసలు విషయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, యూపీ.. ఇలా చాలా చోట్ల వైరస్ భయంతో పరీక్షించగా.. నెగెటివ్‌గా తేలడం, అవన్నీ చికెన్‌పాక్స్ కేసులు కావడం గమనార్హం. అయితే.. మంకీపాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. వర్షాల నేపథ్యంలో చికెన్ పాక్స్ విస్తరిస్తుండడంతోనే ఇదంతా. పైగా లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. చికెన్ పాక్స్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుండడమే అందుకు కారణం. రెండింటి తేడా తెలుసుకుంటే.. కొంతవరకు ఆందోళన తగ్గవచ్చు. చికెన్ పాక్స్ లక్షణాలు ► ముందుగా చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► ఆ తర్వాత జ్వరం లక్షణం కనిపిస్తుంది. ► చికెన్ పాక్స్ లో దద్దుర్లు కాస్త చిన్నగా ఉంటాయి. విపరీతంగా దురద ఉంటుంది. ► అరచేతులు, పాదాల దిగువన దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. ► చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు..పొక్కులు ఏడెనిమిది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. మంకీపాక్స్ లో .. ► మంకీపాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ► సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► మంకీపాక్స్‌లో దద్దుర్లు పెద్దగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉండదు. ► పొక్కులు ముందుగా చేతులు, కళ్ల వద్ద ఏర్పడి.. తర్వాత శరీరమంతా విస్తరిస్తాయి. ► మంకీ పాక్స్ లో అర చేతులు, పాదాలపైనా దద్దర్లు వస్తాయి. ► చాలా మందిలో 21 రోజుల వరకు కూడా అవి ఏర్పడుతూనే ఉంటాయి. ► జ్వరం కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇక.. ఆందోళన వద్దు, కానీ.. మంకీ పాక్స్, చికెన్ పాక్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదని, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి వ్యక్తుల రోగ నిరోధక శక్తిని(ఇమ్యూనిటీ) బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏ అనారోగ్యమైనా సరే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
అంతుచిక్కని వైరస్ పంజా.. ‘విదేశీ అతిథి’కి కష్టం
విడిదికి వచ్చిన విదేశీ అతిథికి కష్టమొచ్చింది. అంతుచిక్కని వైరస్ పంజా విసరడంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైబడి పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. డిసెంబర్లో మొదలైన మరణ మృదంగం నేటికీ ఆగడం లేదు. గడిచిన మూడు రోజుల్లో మరో ఆరు పక్షులు మృత్యువాతపడ్డాయి. వైరస్ ప్రభావం ఒక్కరకం పక్షుల మీద మాత్రమే ఉండడం ఆలోచించదగిన అంశం. కారణాలు అన్వేషించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయి ఫలితం కనిపించడం లేదు. పక్షుల మరణాలు ఆగకపోవడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. పశువులు, ఇతర మూగజీవాలపై ఈ వైరస్ ప్రభావం ఇప్పటి వరకూ కనబడకున్నా భవిష్యత్తులో ఏమైనా ఉంటుందా..? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చెరువుల నీటి వినియోగంపై ఆందోళన.. తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రానికి ఆనుకుని ఉన్న కర్రివానిచెరువు, కొత్తచెరువు, పాతచెరువు, మిడిబంద, అక్కులవానిచెరువు, దాలిచెరువు, ఊర చెరువుల్లో ఉండే చేపల్లో ఒక రకమైన వైరస్ వ్యాప్తి చెందడంతో వాటిని తిన్న పక్షులు మృత్యువాత పడుతున్నట్లు పశు సంవర్థక శాఖ వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఆయా చెరువుల్లో నీటిని తాగుతున్న మిగిలిన పశువులకు వైరస్ ఏమైనా వ్యాప్తిస్తుందా.. అందులో ఉండే చేపలు తినడం వల్ల ప్రమాదం ఏమైనా ఉంటుందా అన్న సందేహాల్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరిశోధించాలని అధికారులను కోరుతున్నారు. నీటి వినియోగంపై కూడా ఆందోళన చెందుతున్నారు. అలాగే మృతి చెందిన పక్షుల కళేబరాలను విడిది కేంద్రం సమీపంలోని పంట పొలాల్లో పూడ్చిపెడుతుండడంతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని అటు ప్రజలు, ఇటు రైతులు భయాందోళన చెందుతున్నారు. డీ వార్మింగే పరిష్కారమా.. విదేశీ పక్షుల మృత్యువాతను ఏ విధంగా కట్టడి చెయ్యాలో తెలియక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పశు సంవర్థక శాఖ వైద్యులు సూచన మేరకు పక్షులకు డీ వార్మింగ్ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అత్యధిక ఖర్చుతో కూడుకోవడంతో ఏం చేయాలో తెలియక అటవీ శాఖాధికారులు సందిగ్ధంలో పడ్డారు. పక్షుల మృత్యువాతకు కారణమైన చేపలపై పరీక్షలు నిర్వహించాలని గత నెలలో జిల్లా స్థాయి మత్స్య శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు అటవీ శాఖాధికారి శాస్త్రి ‘సాక్షి’కి తెలిపారు. పక్షుల కేంద్రంలో పెయింటెడ్ స్టార్క్ పక్షులు పశువులకు ఎటువంటి భయం లేదు.. చేపల్లో బయటపడిన ఒక రకమైన వైరస్ వల్ల ఆయా చెరువుల నీటిని తాగుతున్న పశువులకు ఎటువంటి ప్రాణభయం లేదని టెక్కలి పశు సంవర్థక శాఖ ఏడీ జి.రఘునాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే తేలినీలాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పక్షుల మృత్యువాత గూర్చి తెలుసుకున్నామని చెప్పారు. ప్రత్యేకతలివే.. పెలికాన్.. ఇది బాతు జాతి పక్షి 8 బరువు 8 కిలోలు ముక్కు పొడవు 14 సెంటీమీటర్లు రోజుకు 4 కిలోల చేపల్ని ఆహారంగా తీసుకుంటుంది ఒకేసారి 2 కిలోల చేపను సునాయాసంగా భుజించేస్తుంది దవడ భాగం సంచి ఆకారంలో ఉంటుంది ఇవి పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి ఆహార సేకరణకు రోజుకు నాలుగు సార్లు బయటకు వెళ్తాయి దవడలో సుమారు 2 కేజీల వరకు ఆహారాన్ని నిల్వ చేసుకునే సదుపాయం ఉంది నిల్వ చేసుకునే క్రమంలో ఏదైనా తేడా జరిగి ఆహారం విషతుల్యమై.. ప్రాణాలు పోతున్నాయా.. అన్న కోణంలో కూడా అధికారులు అన్వేషిస్తున్నారు వైరస్ ప్రభావంతో ఈ జాతి పక్షులు100కు పైగా మరణించాయి జీవిత కాలం 29 ఏళ్లు పెయింటెడ్ స్టార్క్ ఇది కొంగజాతి పక్షి బరువు 5 కేజీలు ముక్కు పొడవు 16 సెంటీమీటర్లు చిన్న చేపలు, పురుగులు, నత్తలు దీని ఆహారం 250 గ్రాముల వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి సేకరించిన ఆహారాన్ని గూళ్ల మీద వేస్తే వాటిని పిల్లలు తింటాయి ఆహార సేకరణకు రోజుకు రెండుసార్లు బయటకు వెళ్తాయి జీవిత కాలం 29 ఏళ్లు తేలినీలాపురంలో ఇప్పటి వరకు ఈ జాతి పక్షి ఒక్కటి కూడా మృత్యువాత పడలేదు అధికారులు వీటిని కూడా పరిశీలిస్తున్నారు విదేశీ పక్షుల మృత్యువాతకు కారణమైన చేపల్లో ఉన్న వైరస్ ఏలిక పాములను చూపుతున్న అటవీ సిబ్బంది స్పందించని మత్స్య శాఖ.. చేపల్లో వ్యాప్తి చెందిన వైరస్ వలన విదేశీ పక్షులు మృత్యువాత పడినట్లు పక్షుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఈ రోజు వరకు మత్స్యశాఖ సిబ్బంది కనీసం క్షేత్ర స్థాయి పరిశీలన చేయలేదు. స్థానికులు కొన్ని చెరువుల్లో చేపల్ని పెంచుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రభావం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న కోణంలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సిన మత్స్యశాఖ విభాగం కనీసం దృష్టి సారించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై టెక్కలి ఎఫ్డీఓ ధర్మరాజు వద్ద ప్రస్తావించగా.. పక్షుల అకాల మరణాలకు కారణం తెలియాల్సి ఉందన్నారు. -
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్‌లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్‌ను ఫోన్‌కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్‌ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్‌ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్‌లను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త యాప్‌లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్‌లు, మెసేజ్‌ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
ఈ 26 యాప్స్‌పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్!
రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో. అంత కంటే వేగంగా సైబర్ క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా వినియోగదారుల నుంచి డబ్బును దొంగిలించే 26 ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ నిషేధించినట్లు తెలిపింది. హ్యాకర్లు కంప్యూటర్లలోకి చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్ భద్రత సంస్థ ఈ హానికరమైన యాప్స్ కనుగొనే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ జింపెరియం గూగుల్ సంస్థకు ఈ హానికర యాప్స్ గురుంచి పిర్యాదు చేసిన తర్వాత వాటిని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ - ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్ లేటర్, బస్ - మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, లాకర్ టూల్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. కానీ, దుర దృష్టవశాత్తు ఈ హానికర ఆండ్రాయిడ్ యాప్స్ గురుంచి వాటిని వాడుతున్న చాలా మందికి తెలియదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మొబైల్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక జారీ చేస్తుంది.(చదవండి: సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!) వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో తనిఖీ చేయకుండానే డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం మిలియన్ల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకోవడమే. టాప్ ఇన్ క్రామ్టెడ్ అనే ఆండ్రాయిడ్ యాప్ 5,00,000 నుంచి 10,00,000 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న యాప్స్ ను కనీసం 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్(Zimperium zLabs) సెక్యూరిటీ రీసెర్చర్లు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లను గ్రిఫ్ట్ హార్స్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. హానికరమైన 26 యాప్స్: Handy Translator Pro Heart Rate and Pulse Tracker Geospot: GPS Location Tracker iCare – Find Location My Chat Translator Bus – Metrolis 2021 Free Translator Photo Locker Tool Fingerprint Changer Call Recoder Pro Instant Speech Translation Racers Car Driver Slime Simulator Keyboard Themes What’s Me Sticker Amazing Video Editor Safe Lock Heart Rhythm Smart Spot Locator CutCut Pro OFFRoaders – Survive Phone Finder by Clapping Bus Driving Simulator Fingerprint Defender Lifeel – scan and test Launcher iOS 15 -
మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతుండగానే చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. చైనాతోపాటు, వియత్నాంలో అనేకమందికి సోకిన 'క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) భారత్‌లోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైందనీ, భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం, ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్లలో ఒకటి (ఆర్బోవైరస్), సీక్యూవీ మానవులలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లలో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు. ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా ఆయా వ్యక్తుల్లో సక్యూవి యాంటీ బాడీస్ ఉన్నాయి కానీ వైరస్ లక్షణాలు లేనట్లు నిర్ధారించారు. అయితే కొంతమందికి వ్యాధికి గురయ్యే ఉంటారని అభిప్రాయపడ్డారు. దీంతో మరి కొంతమంది శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 2014, 2017లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ వ్యాధికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన సమయంలో, మానవులు లేదా జంతువుల నమూనాలలో వైరస్ ను గుర్తించలేదు. -
కోవిడ్.. సార్స్‌కి పెద్దన్న!
సూర్య గ్రహణం వీడేటప్పుడు తెల్లటి రింగ్ లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తుంది. వీడుతున్న కొద్దీ సూర్యుడి వెలుగు కొన్నిచోట్ల బయటకు వస్తుంటుంది. సూక్ష్మదర్శిని కింద నుంచి కరోనా విరిడే కుటుంబానికి చెందిన వైరస్ల నిర్మాణం కూడా అచ్చు ఇలాగే ఉంటుంది. అందుకే కోవిడ్‌కు ఆ పేరు వచ్చింది. 2003 నాటి సీరియస్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), 2012 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) వ్యాధులకూ ఈ కరోనా విరిడే కుటుంబంలోని వైరస్‌లే కారణం. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కూడా ఈ కుటుంబానికి చెందిందే. సార్స్, మెర్స్ వైరస్ల కంటే భిన్నమైన జన్యుపదార్థం కలిగి ఉంటుంది. కాకపోతే సార్స్ వైరస్‌తో కొంత సారూప్యత ఉన్న కారణంగా తాజా వైరస్‌ను ‘సార్స్–సీవోవీ (కరోనా వైరస్) 2’ అని పిలుస్తారు. విజృంభణకు కారణాలేంటి? కరోనా విరిడే కుటుంబంలో మొత్తం 39 వైరస్లు ఉంటే ఇప్పటివరకు ఏడింటి గురించి మాత్రమే మనిషికి తెలుసు. నాలుగు కోవిడ్లు జలుబు లాంటి లక్షణాలు చూపిస్తాయి. మిగిలిన మూడింటితోనే చిక్కంతా. ఈ మూడింటిలో ఒకటి సార్స్, రెండోది మెర్స్. మూడోది సార్స్–సీవోవీ–2. దీనికి 2003 నాటి సార్స్ వైరస్ జన్యు పదార్థంతో 79 శాతం సారూప్యత ఉంటుంది. అయినా ఈ రెండూ ఒకటి కాదు. వచ్చే వ్యాధి లక్షణాలూ భిన్నం. సార్స్‌ను చైనాలో 2003 ఫిబ్రవరి ఆఖరులో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 8,098 మందికి సోకింది. వీరిలో 774 మంది మరణించారు. మెర్స్ విషయానికొస్తే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 2,494 మంది కనిపిస్తే మరణాలు 858. ఇంకోలా చెప్పాలంటే మెర్స్ సోకిన ప్రతి వంద మందిలో 37 మంది మరణించారు. సార్స్–సీవోవీ–2 విషయంలో మరణాల రేటును గుర్తించేందుకు కొంత సమయం పట్టొచ్చు గానీ.. ఇప్పటికే ఈ వైరస్ తగ్గుముఖం పట్టిన చైనాలో ఈ సంఖ్య 2 శాతానికి మించలేదు. దీన్ని బట్టి సార్స్–సీవోవీ–2తో మరణాల రేటు తక్కువగా ఉన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతోంది. జంతువుల నుంచి మనుషుల్లోకి ఎలా? సార్స్ సీవోవీ–2తో పాటు ఇటీవలి కాలంలో మనిషిని ఇబ్బందిపెడుతున్న అనేక వ్యాధులు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయి. క్షీరదాల్లో మరీ ముఖ్యంగా గబ్బిలాల్లో బోలెడన్ని వైరస్లు ఉండటం ఇందుకు కారణం. ఆ జంతువుల్లో ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపక పోవచ్చుగానీ.. వీటి వ్యర్థాల (మూత్రం, లాలాజలం, వ్యర్థం)ను తాకడం వల్ల వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. అడవుల్లోని జంతువులను మాంసం కోసం, పెంచుకు నేందుకు.. లేదంటే వైద్య అవసరాల కోసం మనుషులకు, ఇతర జంతువులకు దగ్గరగా బంధించి ఉంచడం వల్ల సమస్య జటిలమవుతుంది. సార్స్, మెర్స్ వైరస్లు మానవాళిపై ఈ కారణాలతోనే దండెత్తాయి. 2003లో సార్స్ కారక వైరస్ గబ్బిలాల నుంచి పునుగు పిల్లులకు సోకి ఆ తర్వాత మనుషుల్లోకి ప్రవేశించింది. మెర్స్ విషయంలో గబ్బిలాల నుంచి ఒంటెలకు.. అక్కడి నుంచి మనుషులకు సోకింది. సార్స్ సీవోవీ–2 వైరస్ గబ్బిలాల నుంచి పొలుసులతో కూడిన ముంగీస లాంటి జంతువు పాంగోలిన్లకు అక్కడి నుంచి మనకూ అంటుకుందని అంచనా. కోవిడ్ కారణంగా అటవీ జంతువుల మార్కెట్‌పై చైనా శాశ్వత నిషేధం విధించింది. గబ్బిలాలకు వైరస్‌లతో హాని జరగదా? క్షీరదాల్లో ఎగరగలిగే జంతువు గబ్బిలం మాత్రమే. సాధారణంగా ఒక వైరస్ జంతువును ఇబ్బంది పెట్టడమన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వైరస్ శక్తిసామర్థ్యాలు. ఆ వైరస్‌కు ఆవాసమయ్యే జంతువు రోగ నిరోధక వ్యవస్థ. వైరస్ సోకిన తొలినాళ్లలో ఆ జంతువుకు కొంత సమస్య ఏర్పడుతుంది. అయితే ఆ జంతువును వేగంగా చంపేయడం వల్ల వైరస్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదు. అందువల్లే కొంత సమయం గడచిన తర్వాత దీని ప్రభావం తగ్గిపోతుంది. మరోవైపు రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఆ జంతువులో వైరస్ విజృంభిస్తుంది. వైరస్ల దాడి వేటిపై? వైరస్లు వేటాడే జంతువుల్లాంటివి. వేటిని గుర్తించగలవో వాటిపైనే దాడి చేస్తాయి. మన కణాలను గుర్తించలేని వైరస్‌లతో మనకు చిక్కు ఉండదు. కొన్ని రకాల వైరస్లు మనకు తగులుకున్నా ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. హెర్పిస్ కారక వైరస్లు శరీరంలో కొన్నేళ్లపాటు నిద్రాణంగా ఉంటూ అకస్మాత్తుగా ప్రభావం చూపుతాయి. జంతువులు, మొక్కల్లోనూ వాటికే సంబంధించిన వైరస్‌లూ ఉన్నాయి. ఉదాహరణకు హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ తరహాలో పిల్లులకు ఫెలీన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్ (ఎఫ్ఐవీ) ఉంటుంది. గబ్బిలాల్లో కరోనా విరిడే కుటుంబానికి చెందిన చాలా రకాల వైరస్లు ఉంటాయి. బ్యాక్టీరియాల్లోనూ బ్యాక్టీరియా ఫాగస్ పేరుతో కొన్ని వైరస్లు ఉంటాయి. బ్యాక్టీరియాలను ఎదుర్కొనేందుకు వీటిని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు. వైరస్‌లకు జీవం ఉంటుందా? నిజానికి వైరస్లు సొంతంగా బతకలేవు.. పునరుత్పత్తి చేయలేవు. ఈ రకమైన వాటిని జీవంగా పరిగణించరు. అయితే ఇతర జంతువుల కణాల్లోకి చేరినప్పుడు పునరుత్పత్తి చేయగలవు కాబట్టి వైరస్ లను జీవించి ఉండనివిగా పరిగణిస్తారు. కణం బయట ఉన్నప్పుడు డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏలతో తయారైన జన్యుపదార్థం కొన్ని ప్రొటీన్లతో ఉండ చుట్టుకుపోయి ఉంటే దాన్ని విరియన్ అని పిలుస్తారు. ఈ విరియన్లు కొంత కాలం పాటు కణం లేకుండా మనగలవు. ఏదైనా జంతువు లేదా మనిషి కణంలోకి చేరినప్పుడు విరియన్ కాస్తా వైరస్ అవుతుంది. కణం లోపలి జన్యుపదార్థాన్ని హైజాక్ చేసి బోలెడన్ని విరియన్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ విరియన్లు కణం నుంచి బయటకొచ్చి ఇతర కణాల్లోకి చేరి వైరస్ల సంఖ్యను పెంచుతాయి. -
వామ్మో సెప్సిస్..!
వాషింగ్టన్: సెప్సిస్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? రక్తానికి ఇన్ఫెక్షన్ సోకడం. శరీరంలో ప్రవహించే రక్తం అంతా కలుషితమైపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో మనిషి కుంగి కృశించిపోవడం. ఇప్పుడు ఈ జబ్బు ప్రాణాంతకంగా మారింది. ఇది సోకిందంటే శరీరం అంతా కుళ్లిపోయి మనిషి ప్రాణాలను తోడేస్తుంది. గతంలో కంటే సెప్సిస్ సోకిన మృతులు రెట్టింపు అయ్యాయని లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. సెప్సిస్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారని పిట్స్బర్గ్ వర్సిటీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా సెప్సిస్ ఇన్ఫెక్షన్ కారణంగా 1.1 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్టు లాన్సెట్ జర్నల్ నివేదికలో వెల్లడించింది. సెప్సిస్ సోకిన వారిలో ప్రాణాలతో బతికి బయటపడ్డా, జీవితాంతం మంచానికి అతుక్కుపోయే పరిస్థితి కూడా వస్తుందని అధ్యయనకారులు వెల్లడించారు. సెప్సిస్ పురుషుల్లో కంటే మహిళలకే అధికంగా సోకుతుంది. 2017 సంవత్సరంలో అత్యధికంగా నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సెప్సిస్ కేసులు 85 శాతం వరకు నమోదుకాగా, ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనివే ఎక్కువ. 40 శాతం కంటే ఎక్కువ కేసులు అయిదేళ్లలోపు పిల్లల్లో కనిపిస్తున్నాయని వాషింగ్టన్ స్కూలు ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ మోహెసన్ నఘావి అన్నారు. -
పాప ఒంటి మీద పులిపిర్లు
మా అమ్మాయికి పదకొండేళ్లు. ఆమెకు ముఖం మీద, దేహం మీద అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి వస్తున్నాయి అవి రోజురోజుకూ పెరుగుతుండటంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. మా పాపకు ఇవి ఎందుకొస్తున్నాయి? పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ఇది ముఖ్యంగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మానికి చర్మం రాసుకోవడంతో పాటు... అప్పటికీ ఈ వ్యాధి కలిగి ఉన్నవారి తువ్వాళ్లను మరొకరు ఉపయోగించడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల దేహం నుంచి మళ్లీ వాళ్ల చర్మం మీద మరోచోటికి వ్యాపించడం కూడా చాలా సాధారణం. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడు పు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్.... అంటే ఉదాహరణకు ఇ మిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాం తంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చా లా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ కలిపి ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉం టుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, చికిత్సను కొనసాగించండి. బాబుకు మాటిమాటికీ జలుబు మా బాబుకు పన్నెండేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వద్దన్నా మానడు. పైగా ఇప్పుడు చలి బాగా పెరగడంతో... తనకు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని తరచూ కంప్లైంట్ చేస్తున్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు రాసి ఇచ్చారుగానీ ప్రయోజనం కనిపించడం లేదు. బాబుకు ఇలా తరచూ జలుబు రావడం తగ్గడానికి మార్గం చెప్పండి. మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్ రైనైటిస్ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్ అలర్జిక్ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్ అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం. దీనికి నిర్దిష్టమైన కా రణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారపర్య ం గా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావర ణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూలమొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్ వంటివి శరీరానికి సరిపడకపోవడంతో వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
బుజ్జి కుక్కకు బోలెడు కష్టం
రాష్ట్ర రాజధానిలో పెంపుడు శునకాలకు ప్రత్యేకించి పప్పీలకు ఆపదొచ్చింది. ఇంటిల్లిపాదీ అల్లారుముద్దుగా పెంచుకునే శునకాలపై మాయదారి కెనైన్ డిస్టెంపర్ వైరస్ పంజా విసురుతోంది. దీని బారినపడి పక్షం రోజులుగా హైదరాబాద్‌లో 30కిపైగా పెంపుడు కుక్కలు మరణించాయి. ఈ పరిణామం శునకాల యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ వేగంగా ఇతర పెంపుడు జంతువులకు వ్యాపిస్తుండటంతో వెటర్నరీ వైద్యులు హైఅలర్ట్ ప్రకటించారు. – హైదరాబాద్ ఎలా వ్యాపిస్తుంది? ఈ వైరస్ లాలాజలం, రక్తం లేదా మూత్రం ద్వారా ఒక శునకం నుంచి మరో శునకానికి వ్యాపిస్తుంది. అలాగే దగ్గు, జలుబుతోపాటు ఆహారం, మంచినీరును ఒకే గిన్నెలో పంచుకోవడం ద్వారా వైరస్ ఇతర శునకాలకు విస్తరిస్తుంది. లక్షణాలు ఏమిటి? పెంపుడు శునకాల శ్వాశకోస, జీర్ణకోశ, కేంద్ర నాడీ వ్యవస్థలను కెనైన్ డిస్టెంపర్ వైరస్ దెబ్బతీస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, ఆకలి మందగించడం, దగ్గు, తుమ్ములతోపాటు కళ్లు పుసులు కట్టడం, ముక్కు నుంచి పసుపుపచ్చ ద్రవం కారడం ఈ వ్యాధి లక్షణాలు. రోగ నిరోధక శక్తి లేకే... రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పెంపుడు కుక్కల్లో కెనైన్ డిస్టెంపర్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. శునకాలకు టీకాలను సకాలంలో వేయని కారణంగా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉందని, పెంపుడు కుక్కలకు వైరస్ రాకుండా ఉండాలంటే టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. వైరస్‌ను గుర్తించాలిలా ఈ వైరస్‌కు గురైన శునకాలను గుర్తించేందుకు యజమానులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని శునకాలకు పొట్టపై పొక్కుల వంటివి వస్తే వాటికి తప్పకుండా ‘కెనైన్ డిస్టెంపర్’ వైరస్ వచ్చినట్లేనని చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే శునకాలు బతకడం కష్టం అంటున్నారు. ఇలాంటి శునకాలకు దవడలు, కాళ్లు పదేపదే కొట్టుకోవడం, తలపై ఫ్లూయిడ్ బంప్స్ అవ్వడం, వైబ్రేషన్‌కు గురవుతాయంటున్నారు. వైరస్ గుర్తింపునకు ప్రత్యేక కిట్.. పెంపుడు శునకాలు కెనైన్ డిస్టెంపర్ వైరస్ బారిన పడ్డాయా లేదా అని నిర్ధారించేందుకు వైద్యులు ‘డయాగ్నోస్టిక్ కిట్’తో చెకప్ చేస్తారు. ఈ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ను అదే రోజు నుంచి ప్రారంభిస్తారు. మొదటి వ్యాక్సినేషన్ ఆరు వారాల వయసు నుంచి పెంపుడు కుక్కకు ఇప్పించాలి. ఆరు వారాల అనంతరం ప్రతి నెల రెండు పర్యాయాలు, ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సినేషన్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్‌ను ‘సెవెన్ ఇన్ వన్ లేదా నైన్ ఇన్ వన్’ అని పిలుస్తారు. ఒకటి నుంచి 20కి పెరిగిన కేసులు.. రాంనగర్‌కు చెందిన ఓ శునకం ఈ వైరస్‌బారిన పడటంతో యజమాని దాన్ని నారాయణగూడ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పెట్ని పరీక్షించిన డాక్టర్ స్వాతిరెడ్డి ఈ పెట్ కెనైన్ డిస్టెంపర్ వైరస్‌కు గురైనట్లు ధ్రువీకరించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పెట్ నుంచి మరో 19 పెట్స్‌కు వైరస్సోకింది. ఇలా ఒక్క రాంనగర్ నుంచే ఈ వైరస్‌కు గురైన పెట్స్ కేసులు 20 నమోదయ్యాయి. ఒక్క నారాయణగూడ హాస్పిటల్లోనే ఫలక్‌నుమా నుంచి 6, రామాంతపూర్ నుంచి 2 కేసుల చొప్పున మూడు నెలల వ్యవధిలో నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా నెలకు 20–30 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని రోజులకే చచ్చిపోయింది... మా ‘గోల్డెన్ రిట్రీవర్’ శునకం 4 నెలల వయసులో అనారోగ్యానికి గురవడంతో నారాయణగూడ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. పరీక్షించిన వైద్యులు కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకినట్లు చెప్పారు. కేవలం 20 రోజుల్లోనే మా పప్పీ చచ్చిపోయింది. –విక్కీ, రాంనగర్ ఇప్పటివరకు 30 కేసులను గుర్తించా... పలు సమస్యలతో బాధపడుతున్న పెట్స్‌ని హాస్పిటల్‌కు తీసుకురాగా చెక్ చేశాను. అవి కెనైన్ డిస్టెంపర్ వైరస్‌కు గురైనట్లు నిర్ధారించా. వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ను అందించాల్సిన అవసరం ఉంది. వైరస్ వచ్చిన పెట్ని వేరే పెట్స్ మధ్యలో పెట్టడం కారణంగా మరో 19 పెట్స్‌కి కూడా ఈ వైరస్ సోకింది. వ్యాక్సినేషన్ సక్రమంగా ఇవ్వగలిగితే కొద్దిరోజులైనా పెట్ బతికే అవకాశం ఉంటుంది. – డాక్టర్ స్వాతిరెడ్డి, సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్, నారాయణగూడ అవగాహన అవసరం కెనైన్ డిస్టెంపర్ వైరస్ గురించి పెట్స్ యజమానుల్లో సరైన అవగాహన లేదు. కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థలు మందుకొచ్చి కొన్ని నిధులు సమకూరిస్తే అవగాహన కల్పించే పెట్స్ వైరస్‌కు గురి కాకుండా ఉండేందుకు సహకరించవొచ్చు. – డాక్టర్ ఎ. పరమేశ్వర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ హస్బెండరీ ఆఫీసర్ -
నిపా వైరస్‌పై అప్రమత్తం
సాక్షి, నెల్లూరు సిటీ : తిరుపతిలో నిపా వైరస్ కలకలం రేగడంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. పందుల కారణంగా నిపా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాటిని పట్టివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పందుల యజమానులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గురువారం నుంచి కార్పొరేషన్ పరిధి లోని పందులను ఇతర ప్రాంతాలకు తరలిం చడం, కాల్చివేయడం చేయనున్నారు. నగరంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పందుల యజమానులను అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. కార్పొరేషన్ అధికారులు అప్పుడప్పుడు తూతూమంత్రంగా పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో పందుల పెంపకందారులు సుమారు 200మందికి పైగా ఉన్నారు. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, బీవీనగర్, కొండాయపాళెంగేటు, కుక్కలగుంట, తదితర ప్రాంతాల్లో పందుల పెంపకం చేపడుతున్నారు. నగరంలో దాదాపు 5వేలకు పైగా పందులు సంచరిస్తున్నాయి. పందుల యజమానులకు నోటీసులు పందుల పెంపకందారులకు కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గతంలో పందులను తరలించే క్రమంలో పెద్ద ఎత్తున పందుల యజమానులు అడ్డుకోవడం, నాయకుల ఒత్తిళ్లతో అధికారులు వెనక్కుతగ్గడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం నిపా వైరస్ కలకలంతో అధికారులు చెన్నైకు చెందిన ప్రత్యేక బృందాలతో పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టనున్నారు. పందుల యజమానులు అడ్డుకోకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పందుల యజమానులు పందుల పట్టివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచిచూడాల్సిందే. -
చనిపోతానేమోనని భయం వేస్తోంది!
మూడేళ్ల కిందట వింబుల్డన్ రాణిగా నిలిచిన ఫ్రాన్స్ ప్లేయర్ మరియన్ బర్తోలీ ప్రస్తుతం తీవ్ర ఆనారోగ్యంతో ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆమెకు వైరస్ సోకిందని, అయితే దాని వల్ల ఆమెకు మెరుగైన వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేయడంతో ఈ మాజీ ఛాంపియన్ పరిస్థితి గందరగోళంగా తయారయింది. ఓసారి ఈ ఫొటోలు చూడండి. 2013లో వింబుల్డన్ గెలిచిన బర్తోలీ అప్పుడు 60 కిలోలు ఉండేది.. కానీ వైరస్ బారినపడ్డాక కేవలం మూడు నెలల వ్యవధిలోనే 25 కిలో కిలోలు తగ్గిపోయింది. ఇక అన్నీ చీకటి రోజులే బరువు తగ్గడంపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. ఘన పదార్థాలకు తీసుకోకపోవడంతో ఆమె ఇలా అయ్యింనది, ఆమెకు ఆహార సమస్యలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారని చెప్పింది. అయితే భయంకరమైన వైరస్ తనను ఇలా చేసిందని అందరికీ ఎలా చెప్పగలనంటూ ప్రశ్నించింది. కొందరి వ్యాఖ్యలు వింటే నిజంగానే చచ్చిపోతానేమోనని భయం కూడా వేసిందని, తనకు ఇంకా బతకాలని ఉందని తన పరిస్థితిని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఇక అన్నీ చీకటి రోజులేనంటూ ఏడ్చేసింది. నిజానికి వింబుల్డన్ సన్నాహక మ్యాచ్ లలో పాల్గొంటానని చెప్పిన బర్తోలీ తీవ్ర అస్వస్థత కారణంగానే ఈవెంట్లో పాల్గొనలేదని వివరించింది. అసలు ఏం జరిగింది! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెంచ్ ఒపెన్ కోసం కొన్ని రోజుల ముందు సన్నాహక మ్యాచ్‌లలో పాల్గొని జూనియర్ ప్లేయర్లకు కొన్ని కిటుకులు నేర్పించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కాగానే విమానంలో సిడ్నీకి తిరుగు ప్రయాణమైంది. కామెంటేటర్ గా పని చేసింది. న్యూయార్క్ లో ఏదో పని నిమిత్తం మళ్లీ విమానమెక్కింది. కొన్ని రోజుల నుంచి ఓపిక తగ్గినట్లుగా ఉన్న బర్తోలీ క్రమక్రమంగా బరువు తగ్గిపోయింది. ఏం చేయాలో అర్ధంకాక డాక్టర్లను సంప్రదిస్తే టెస్టులు చేశారు కానీ వారి మెడిసిన్ ఆమెను రికవరీ చేయవని నమ్మకం లేదని చెప్పారని బర్తోలీ కన్నీటి పర్యంతమైంది. భారత్ లోనే ఏదో వైరస్ తనకు సోకి ఉంటుందని అభిప్రాయపడింది. 'అన్ని అవసరాలకు కేవలం మినరల్ వాటర్ మాత్రమే వాడుతున్నాను. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు దూరంగా ఉంటున్నాను. చర్మ వ్యాధులు వస్తాయేమోనన్న దిగులుతో నగలు, ఆభరణాలు లాంటివి ధరించడం లేదు' అని మాజీ ఛాంపియన్ చెప్పుకొచ్చింది. వింబుల్డన్ ఛాంపియన్‌గా బర్తోలీ ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నమెంట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల(2013లో) ఈ క్రీడాకారిణి వింబుల్డన్ టోర్నమెంట్లో విజేతగా అవతరించింది. సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బర్తోలీ 81 నిమిషాల్లో 6-1, 6-4తో 23వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ)పై విజయం సాధించింది. కెరీర్లో 47వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన బర్తోలీకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2007లో వింబుల్డన్ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్‌కు చేరిన బర్తోలీ టైటిల్ పోరులో వీనస్ విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని రోజులకే సన్సినాటి టోర్నమెంట్లో ఓటమితో ఏకంగా టెన్నిస్ కు గుడ్ బై చెప్పి క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. టైటిల్ గెలిచే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది.