సూర్య గ్రహణం వీడేటప్పుడు తెల్లటి రింగ్ లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తుంది. వీడుతున్న కొద్దీ సూర్యుడి వెలుగు కొన్నిచోట్ల బయటకు వస్తుంటుంది. సూక్ష్మదర్శిని కింద నుంచి కరోనా విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌ల నిర్మాణం కూడా అచ్చు ఇలాగే ఉంటుంది. అందుకే కోవిడ్‌కు ఆ పేరు వచ్చింది. 2003 నాటి సీరియస్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), 2012 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) వ్యాధులకూ ఈ కరోనా విరిడే కుటుంబంలోని వైరస్‌లే కారణం. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కూడా ఈ కుటుంబానికి చెందిందే. సార్స్, మెర్స్ వైరస్‌ల కంటే భిన్నమైన జన్యుపదార్థం కలిగి ఉంటుంది. కాకపోతే సార్స్ వైరస్‌తో కొంత సారూప్యత ఉన్న కారణంగా తాజా వైరస్‌ను ‘సార్స్–సీవోవీ (కరోనా వైరస్) 2’ అని పిలుస్తారు.
విజృంభణకు కారణాలేంటి?
కరోనా విరిడే కుటుంబంలో మొత్తం 39 వైరస్‌లు ఉంటే ఇప్పటివరకు ఏడింటి గురించి మాత్రమే మనిషికి తెలుసు. నాలుగు కోవిడ్‌లు జలుబు లాంటి లక్షణాలు చూపిస్తాయి. మిగిలిన మూడింటితోనే చిక్కంతా. ఈ మూడింటిలో ఒకటి సార్స్, రెండోది మెర్స్. మూడోది సార్స్–సీవోవీ–2. దీనికి 2003 నాటి సార్స్ వైరస్ జన్యు పదార్థంతో 79 శాతం సారూప్యత ఉంటుంది. అయినా ఈ రెండూ ఒకటి కాదు. వచ్చే వ్యాధి లక్షణాలూ భిన్నం. సార్స్‌ను చైనాలో 2003 ఫిబ్రవరి ఆఖరులో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 8,098 మందికి సోకింది. వీరిలో 774 మంది మరణించారు. మెర్స్ విషయానికొస్తే దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 2,494 మంది కనిపిస్తే మరణాలు 858. ఇంకోలా చెప్పాలంటే మెర్స్ సోకిన ప్రతి వంద మందిలో 37 మంది మరణించారు. సార్స్–సీవోవీ–2 విషయంలో మరణాల రేటును గుర్తించేందుకు కొంత సమయం పట్టొచ్చు గానీ.. ఇప్పటికే ఈ వైరస్ తగ్గుముఖం పట్టిన చైనాలో ఈ సంఖ్య 2 శాతానికి మించలేదు. దీన్ని బట్టి సార్స్–సీవోవీ–2తో మరణాల రేటు తక్కువగా ఉన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతోంది.
జంతువుల నుంచి మనుషుల్లోకి ఎలా?
సార్స్ సీవోవీ–2తో పాటు ఇటీవలి కాలంలో మనిషిని ఇబ్బందిపెడుతున్న అనేక వ్యాధులు జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయి. క్షీరదాల్లో మరీ ముఖ్యంగా గబ్బిలాల్లో బోలెడన్ని వైరస్‌లు ఉండటం ఇందుకు కారణం. ఆ జంతువుల్లో ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపక పోవచ్చుగానీ.. వీటి వ్యర్థాల (మూత్రం, లాలాజలం, వ్యర్థం)ను తాకడం వల్ల వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. అడవుల్లోని జంతువులను మాంసం కోసం, పెంచుకు నేందుకు.. లేదంటే వైద్య అవసరాల కోసం మనుషులకు, ఇతర జంతువులకు దగ్గరగా బంధించి ఉంచడం వల్ల సమస్య జటిలమవుతుంది. సార్స్, మెర్స్ వైరస్‌లు మానవాళిపై ఈ కారణాలతోనే దండెత్తాయి. 2003లో సార్స్ కారక వైరస్ గబ్బిలాల నుంచి పునుగు పిల్లులకు సోకి ఆ తర్వాత మనుషుల్లోకి ప్రవేశించింది. మెర్స్ విషయంలో గబ్బిలాల నుంచి ఒంటెలకు.. అక్కడి నుంచి మనుషులకు సోకింది. సార్స్ సీవోవీ–2 వైరస్ గబ్బిలాల నుంచి పొలుసులతో కూడిన ముంగీస లాంటి జంతువు పాంగోలిన్లకు అక్కడి నుంచి మనకూ అంటుకుందని అంచనా. కోవిడ్ కారణంగా అటవీ జంతువుల మార్కెట్‌పై చైనా శాశ్వత నిషేధం విధించింది.
గబ్బిలాలకు వైరస్‌లతో హాని జరగదా?
క్షీరదాల్లో ఎగరగలిగే జంతువు గబ్బిలం మాత్రమే. సాధారణంగా ఒక వైరస్ జంతువును ఇబ్బంది పెట్టడమన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వైరస్ శక్తిసామర్థ్యాలు. ఆ వైరస్‌కు ఆవాసమయ్యే జంతువు రోగ నిరోధక వ్యవస్థ. వైరస్ సోకిన తొలినాళ్లలో ఆ జంతువుకు కొంత సమస్య ఏర్పడుతుంది. అయితే ఆ జంతువును వేగంగా చంపేయడం వల్ల వైరస్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదు. అందువల్లే కొంత సమయం గడచిన తర్వాత దీని ప్రభావం తగ్గిపోతుంది. మరోవైపు రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఆ జంతువులో వైరస్ విజృంభిస్తుంది.
వైరస్‌ల దాడి వేటిపై?
వైరస్‌లు వేటాడే జంతువుల్లాంటివి. వేటిని గుర్తించగలవో వాటిపైనే దాడి చేస్తాయి. మన కణాలను గుర్తించలేని వైరస్‌లతో మనకు చిక్కు ఉండదు. కొన్ని రకాల వైరస్‌లు మనకు తగులుకున్నా ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. హెర్పిస్ కారక వైరస్‌లు శరీరంలో కొన్నేళ్లపాటు నిద్రాణంగా ఉంటూ అకస్మాత్తుగా ప్రభావం చూపుతాయి. జంతువులు, మొక్కల్లోనూ వాటికే సంబంధించిన వైరస్‌లూ ఉన్నాయి. ఉదాహరణకు హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ తరహాలో పిల్లులకు ఫెలీన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్ (ఎఫ్‌ఐవీ) ఉంటుంది. గబ్బిలాల్లో కరోనా విరిడే కుటుంబానికి చెందిన చాలా రకాల వైరస్‌లు ఉంటాయి. బ్యాక్టీరియాల్లోనూ బ్యాక్టీరియా ఫాగస్ పేరుతో కొన్ని వైరస్‌లు ఉంటాయి. బ్యాక్టీరియాలను ఎదుర్కొనేందుకు వీటిని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు.
వైరస్‌లకు జీవం ఉంటుందా?
నిజానికి వైరస్‌లు సొంతంగా బతకలేవు.. పునరుత్పత్తి చేయలేవు. ఈ రకమైన వాటిని జీవంగా పరిగణించరు. అయితే ఇతర జంతువుల కణాల్లోకి చేరినప్పుడు పునరుత్పత్తి చేయగలవు కాబట్టి వైరస్ లను జీవించి ఉండనివిగా పరిగణిస్తారు. కణం బయట ఉన్నప్పుడు డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏలతో తయారైన జన్యుపదార్థం కొన్ని ప్రొటీన్లతో ఉండ చుట్టుకుపోయి ఉంటే దాన్ని విరియన్ అని పిలుస్తారు. ఈ విరియన్లు కొంత కాలం పాటు కణం లేకుండా మనగలవు. ఏదైనా జంతువు లేదా మనిషి కణంలోకి చేరినప్పుడు విరియన్ కాస్తా వైరస్ అవుతుంది. కణం లోపలి జన్యుపదార్థాన్ని హైజాక్ చేసి బోలెడన్ని విరియన్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ విరియన్లు కణం నుంచి బయటకొచ్చి ఇతర కణాల్లోకి చేరి వైరస్‌ల సంఖ్యను పెంచుతాయి.
Comments
Please login to add a commentAdd a comment