చనిపోతానేమోనని భయం వేస్తోంది!
మూడేళ్ల కిందట వింబుల్డన్ రాణిగా నిలిచిన ఫ్రాన్స్ ప్లేయర్ మరియన్ బర్తోలీ ప్రస్తుతం తీవ్ర ఆనారోగ్యంతో ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆమెకు వైరస్ సోకిందని, అయితే దాని వల్ల ఆమెకు మెరుగైన వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేయడంతో ఈ మాజీ ఛాంపియన్ పరిస్థితి గందరగోళంగా తయారయింది. ఓసారి ఈ ఫొటోలు చూడండి. 2013లో వింబుల్డన్ గెలిచిన బర్తోలీ అప్పుడు 60 కిలోలు ఉండేది.. కానీ వైరస్ బారినపడ్డాక కేవలం మూడు నెలల వ్యవధిలోనే 25 కిలో కిలోలు తగ్గిపోయింది.
ఇక అన్నీ చీకటి రోజులే
బరువు తగ్గడంపై ఎన్నో విమర్శలొస్తున్నాయి. ఘన పదార్థాలకు తీసుకోకపోవడంతో ఆమె ఇలా అయ్యింనది, ఆమెకు ఆహార సమస్యలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారని చెప్పింది. అయితే భయంకరమైన వైరస్ తనను ఇలా చేసిందని అందరికీ ఎలా చెప్పగలనంటూ ప్రశ్నించింది. కొందరి వ్యాఖ్యలు వింటే నిజంగానే చచ్చిపోతానేమోనని భయం కూడా వేసిందని, తనకు ఇంకా బతకాలని ఉందని తన పరిస్థితిని చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఇక అన్నీ చీకటి రోజులేనంటూ ఏడ్చేసింది. నిజానికి వింబుల్డన్ సన్నాహక మ్యాచ్ లలో పాల్గొంటానని చెప్పిన బర్తోలీ తీవ్ర అస్వస్థత కారణంగానే ఈవెంట్లో పాల్గొనలేదని వివరించింది.
అసలు ఏం జరిగింది!
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెంచ్ ఒపెన్ కోసం కొన్ని రోజుల ముందు సన్నాహక మ్యాచ్లలో పాల్గొని జూనియర్ ప్లేయర్లకు కొన్ని కిటుకులు నేర్పించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కాగానే విమానంలో సిడ్నీకి తిరుగు ప్రయాణమైంది. కామెంటేటర్ గా పని చేసింది. న్యూయార్క్ లో ఏదో పని నిమిత్తం మళ్లీ విమానమెక్కింది. కొన్ని రోజుల నుంచి ఓపిక తగ్గినట్లుగా ఉన్న బర్తోలీ క్రమక్రమంగా బరువు తగ్గిపోయింది. ఏం చేయాలో అర్ధంకాక డాక్టర్లను సంప్రదిస్తే టెస్టులు చేశారు కానీ వారి మెడిసిన్ ఆమెను రికవరీ చేయవని నమ్మకం లేదని చెప్పారని బర్తోలీ కన్నీటి పర్యంతమైంది. భారత్ లోనే ఏదో వైరస్ తనకు సోకి ఉంటుందని అభిప్రాయపడింది. 'అన్ని అవసరాలకు కేవలం మినరల్ వాటర్ మాత్రమే వాడుతున్నాను. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు దూరంగా ఉంటున్నాను. చర్మ వ్యాధులు వస్తాయేమోనన్న దిగులుతో నగలు, ఆభరణాలు లాంటివి ధరించడం లేదు' అని మాజీ ఛాంపియన్ చెప్పుకొచ్చింది.
వింబుల్డన్ ఛాంపియన్గా బర్తోలీ
ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నమెంట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల(2013లో) ఈ క్రీడాకారిణి వింబుల్డన్ టోర్నమెంట్‌లో విజేతగా అవతరించింది. సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బర్తోలీ 81 నిమిషాల్లో 6-1, 6-4తో 23వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ)పై విజయం సాధించింది. కెరీర్‌లో 47వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన బర్తోలీకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2007లో వింబుల్డన్ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన బర్తోలీ టైటిల్ పోరులో వీనస్ విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
ఆ తర్వాత కొన్ని రోజులకే సన్సినాటి టోర్నమెంట్లో ఓటమితో ఏకంగా టెన్నిస్ కు గుడ్ బై చెప్పి క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. టైటిల్ గెలిచే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్‌లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది.