సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతుండగానే చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. చైనాతోపాటు, వియత్నాంలో అనేకమందికి సోకిన 'క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) భారత్‌లోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైందనీ, భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన)
ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం, ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్లలో ఒకటి (ఆర్బోవైరస్), సీక్యూవీ మానవులలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లలో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు. ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా ఆయా వ్యక్తుల్లో సక్యూవి యాంటీ బాడీస్ ఉన్నాయి కానీ వైరస్ లక్షణాలు లేనట్లు నిర్ధారించారు. అయితే కొంతమందికి వ్యాధికి గురయ్యే ఉంటారని అభిప్రాయపడ్డారు. దీంతో మరి కొంతమంది శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 2014, 2017లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ వ్యాధికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన సమయంలో, మానవులు లేదా జంతువుల నమూనాలలో వైరస్ ను గుర్తించలేదు.
Comments
Please login to add a commentAdd a comment