సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ నెలలో ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి మళ్లీ ఇప్పుడు మరో సారి అలజడి సృష్టిస్తోంది. గత రెండు రోజుల నుంచి టెక్కలి, కాశీబుగ్గ డివిజన్‌ల పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ యా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామం సమీపంలో పెద్దపులి అడుగుల ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.
గత రెండు రోజులుగా పెద్దపులి ఈ ప్రాంతంలో గల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు తుఫాన్ ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోత లు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్దపులి సంచారంపై అధికారుల హెచ్చరికలతో రైతులు మరింత భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా ఎఫ్‌ఆర్‌ఓ జగదీశ్వరరావు, ఏసీఎఫ్ నాగేంద్ర, బీట్ అధికారులు జనప్రియ, రంజిత్, ఝాన్సీ తో పాటు సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.
ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీ ర ప్రాంతంలో గల తోటల నుంచి సంత బొమ్మాళి వైపునకు చేరుకుంది. ప్రస్తుతం కోట»ొ మ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాలు కనిపించాయి.
పులి సంచారంపై అప్రమత్తం
పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల జాగ్రత్తలు దండోరా ద్వారా తెలియజేస్తున్నారు.
ప్రజలు వేకువజామున, చీకటి పడిన తర్వాత సాధ్యమైనంతవరకు బయట తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలి
ఇంటి ఆరుబయట లేదా పశువుల పాకల వద్ద నిద్రించకూడదు
పులి తిరుగుతున్న ప్రాంతంలో అడవి లోపలకు వెళ్లేందుకు సాహసించకూడదు
వ్యవసాయ పనులు, బయటకు వెళ్లినపుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలి
వ్యవసాయ పనుల్లో కింద కూర్చున్నప్పుడు లేదా వంగి పని చేస్తున్నపుడు అప్రమత్తంగా ఉండాలి
పంట పొలాలకు వెళ్లినపుడు బిగ్గరగా శబ్దాలు చేయాలి
పులులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు
పులి తిరుగుతున్న ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా పులి సంచరించే ఆనవాలు కనిపిస్తే తక్షణమే.. 6302267557, 9440810037,9493083748 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment