kasibugga
-
శ్రీకాకుళం: అమ్మో మళ్లీ వచ్చింది.. ‘పెద్దపులి’ అలజడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ నెలలో ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి మళ్లీ ఇప్పుడు మరో సారి అలజడి సృష్టిస్తోంది. గత రెండు రోజుల నుంచి టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ యా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామం సమీపంలో పెద్దపులి అడుగుల ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.గత రెండు రోజులుగా పెద్దపులి ఈ ప్రాంతంలో గల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు తుఫాన్ ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోత లు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్దపులి సంచారంపై అధికారుల హెచ్చరికలతో రైతులు మరింత భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా ఎఫ్ఆర్ఓ జగదీశ్వరరావు, ఏసీఎఫ్ నాగేంద్ర, బీట్ అధికారులు జనప్రియ, రంజిత్, ఝాన్సీ తో పాటు సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీ ర ప్రాంతంలో గల తోటల నుంచి సంత బొమ్మాళి వైపునకు చేరుకుంది. ప్రస్తుతం కోట»ొ మ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాలు కనిపించాయి.పులి సంచారంపై అప్రమత్తం పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల జాగ్రత్తలు దండోరా ద్వారా తెలియజేస్తున్నారు.ప్రజలు వేకువజామున, చీకటి పడిన తర్వాత సాధ్యమైనంతవరకు బయట తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలిఇంటి ఆరుబయట లేదా పశువుల పాకల వద్ద నిద్రించకూడదుపులి తిరుగుతున్న ప్రాంతంలో అడవి లోపలకు వెళ్లేందుకు సాహసించకూడదువ్యవసాయ పనులు, బయటకు వెళ్లినపుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలివ్యవసాయ పనుల్లో కింద కూర్చున్నప్పుడు లేదా వంగి పని చేస్తున్నపుడు అప్రమత్తంగా ఉండాలిపంట పొలాలకు వెళ్లినపుడు బిగ్గరగా శబ్దాలు చేయాలిపులులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదుపులి తిరుగుతున్న ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా పులి సంచరించే ఆనవాలు కనిపిస్తే తక్షణమే.. 6302267557, 9440810037,9493083748 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలి. -
Seediri Appalaraju: కన్నీరు తుడిచి.. కష్టాన్ని తొలగించి
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సోమవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది. రెల్లివీధికి చెందిన పద్మ అనే ఇల్లు లేని ఓ మహిళ మంత్రి ముందు కన్నీరుమున్నీరై తన వేదన తెలుపుకున్నారు. తనకు ఇల్లు లేదని, కర్రలపై పరదాలు కప్పుకుని తల దాచుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నిసార్లు ఇంటి కోసం దర ఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతోందని చెప్పారు. దీంతో మంత్రి ఆ గుడిసెలోనే కూర్చుని ఆమెను ఓదార్చి అధికారులతో మాట్లాడారు. అన్ని పథకాలపై ఆమె ఇంటి పేరుకు బదులు లబ్ధిదారు(హోల్టర్) అని తప్పుగా ముద్రితమవ్వడంతో పథకాలు అందకుండాపోతున్నాయని గుర్తించారు. ఇలాంటి చిన్న తప్పులు కూడా కనిపెట్టలేకపోతున్నారని మంత్రి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూదికొండలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే తప్పిదాన్ని సరిచేసి ఈమెకు ఇంటిని మంజూరు చేయాలని కమిషనర్ రాజగోపాలరావును ఆదేశించారు. (క్లిక్ చేయండి: గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు) -
టీడీపీ నాయకుల బండారం బట్టబయలు.. కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని..
కాశీబుగ్గ (శ్రీకాకుళం): అధికారుల సాక్షిగా టీడీపీ నాయకుల బండారం బయటపడింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు గురువారం చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో పచ్చనేతలే ఆక్రమణదారులని తేలింది. టీడీపీ నాయకులు పెంట ఉదయ్‌శంకర్, లొడగల కామేష్ దాదాపు 8 ఎకరాలకుపైగా భూమిని ఆక్రమించినట్లు స్పష్టమైంది. పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, తహశీల్దార్ మధుసూదనరావు, సర్వేయర్లు ఇతర రెవెన్యూ సిబ్బంది గురువారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పద్మనాభపురం, పెంటిబద్ర, సూదికొండ, నెమలికొండ, ఉదయపురం ప్రాంతాల్లో పర్యటించారు. పెంటిబద్ర గిరిజన గ్రామంలో రికార్డులు, భూమిని పరిశీలించగా సర్వే నంబర్ 311/ఎ మంగబంద (చెరువు)లో 04.85 ఎకరాలు భూమి, సర్వే నంబర్ 314/08 గజాలు గుమ్మి, 00.96 ఎకరాలు భూమి, పద్మనాభపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 365/05లో 02.31 ఎకరాల కాలువ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకుంటాం.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని, త్వరలోనే భూములను స్వాధీ నం చేసుకుంటామని పలాస ఆర్డీఓ సీతారామమూర్తి స్పష్టం చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణలపై హైకోర్టులో పిల్ వేసిన సందర్భంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని తమను ఆదేశించిందన్నారు. స్థానికంగా ఎలాంటి ఆక్రమణలు జరగడానికి అవకాశం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. జగనన్న భూరక్షణ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల స్వాధీనం నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. మున్సిపాలిటీలోని 27 గ్రామాల్లో ఆక్రమణలను గుర్తించామని, వాటిని తొలగిస్తామని చెప్పారు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారు, దాని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చి ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని తెలిపారు. ఆయనతో పాటు పలాస తహసీల్దార్ లంబాల మధుసూదన్, సర్వేయర్ గిరికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, వీఆర్ఓ ఖగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న టీడీపీ మద్దతుదారులు ఉద్రిక్తత.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉదయపురం చెరువు వద్ద ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించేందుకు అధికారులు గురువారం సాయంత్రం సిద్ధమయ్యారు. అధికారుల రాకతో ఉదయపురం సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన గురిటి సూర్యనారాయణకు చెందిన కొన్ని నిర్మాణాలు చెరువులో ఉన్నాయని ఆర్డీఓ గుర్తించగా వాటిని తొలగించేందుకు జేసీబీతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే గురిటి సూర్యనారాయణ బంధువులు, మద్దతుదారులు వందల సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. తహసీల్దార్‌ను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. కాశీబుగ్గ పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. -
గాంధీ.. ఆ ఊరోళ్లకు గాంధమ్మ
మహాత్మా గాంధీ.. ఆ ఊరి వాళ్లకు ఓ శక్తి స్వరూపిణి. అందుకే ఏటా శ్రావణ మాసంలో మొదటి ఆదివారం గాంధీజీని గ్రామ దేవత రూపంలో గాంధమ్మగా కొలుస్తారు. పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న ఆచారం ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఏటా కేదారిపురంలో రైతులు పొలాల్లో నాట్లు వేయడానికి ముందు గాంధమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. గాంధీజీ తమ గ్రామంలో శక్తి అవతారం గాంధమ్మగా వెలిశారని.. ఆ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల విశ్వాసం. అందుకే.. తొలకరి వర్షాలు కురిసిన తరువాత దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ప్రతి ఇంటినుంచీ వడపప్పు, పానకాలు, పసుపు నీటితో భారీ ఊరేగింపు నిర్వహించి గ్రామ నడిమధ్యన గాంధీజీ చిత్రపటాన్ని ఉంచి ముర్రాటలు సమర్పిస్తారు. ఆదివారం నాడు గ్రామంలోని మహిళలంతా ఊరేగింపు నిర్వహించి పూజలు నిర్వహించారు. గాంధమ్మకు నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పంచి పెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ ఊరి వారంతా గాంధేయ వాదులుగా ఉంటూ ఆయనపై అపరిమిత ప్రేమ చూపించేవారు. అవే ఇప్పుడు ఇలా గాంధమ్మ పూజలుగా మారాయి. – కాశీబుగ్గ -
అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి
కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్‌కు దగ్గరలో నివాసం ఉంటున్న సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రతి సంక్రాంతికి కాశీబుగ్గలోని తన స్వగృహానికి రావడం, తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆయనకు అలవాటు. షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత అతనికి గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని, ఆ కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా, తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తా రిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: (సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్) -
ఏడాదిపాటు సహజీవనం.. పెళ్లనేసరికి పారిపోయాడు
కాశీబుగ్గ: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిపాటు సహాజీవనం చేసి ఆ తరువాత తప్పించుకు తిరుగుతున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామానికి చెందిన యువతికి నందిగాం మండలం రౌతుపురం గ్రామానికి చెందిన నొక్కు చిన్నారావుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకుంటానని యువకుడు నమ్మించడంతో నిజమని నమ్మిన ఆమె చిన్నారావుతో ఏడాదిగా పలాస మండలం కిష్టుపురం గ్రామంలో ఉంటున్నారు. అయితే ఇటీవల పెళ్లి ప్రస్తావన తేవడంతో చిన్నారావు దానికి అంగీకరించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టాలెక్కిన యువతి.. కాపాడిన కీ మెన్
సాక్షి, కాశీబుగ్గ: ప్రేమించి, సహజీవనం చేసిన వ్యక్తి మోసం చేశాడంటూ ఓ యువతి రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించగా.. కీమెన్ చూసి ఆమెను కాపాడాడు. ఈ సంఘటన పలాస-కాశీబుగ్గ జంట పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కాశీబుగ్గ ఎల్సీ గేట్‌కు కొద్ది దూరంలో యువతి కూర్మాపు ధనలక్ష్మి రైలు ట్రాక్‌పై అనుమానాస్పంగా తిరుగుతుండటాన్ని చూసిన ట్రాక్ కీమెన్ వి.దుర్గాప్రసాద్ అమెను ప్రశ్నించి అరాతీశాడు. ఒక వ్యక్తి చేతిలో మోసపోయానని.. అందుకే చనిపోవాలనుకున్నాని చెప్పడంతో ఆమెను ఓదార్చి సమీపంలోని గేట్ వద్దకు తీసుకువెళ్లాడు. పలాస జీఆర్పీ అధికారులకు సమాచారం అందించాడు. వరుసకు మేనమామైన డమరసింగ్ సింహాచలంతో సహజీవనం చేస్తున్నానని, ప్రస్తుతం ఇంటినుంచి వెళ్లిపోమని అనడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపింది. పలాస జీఆర్పీ మహిళా కానిస్టేబుల్ అనిత, హెడ్‌కానిస్టేబుల్ కర్రి కోదండరావులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. -
సీఐ సస్పెన్షన్‌పై టీడీపీ విషప్రచారం
సాక్షి, శ్రీకాకుళం: పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో మంగళవారం గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇద్దరిని మందలించి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు. వారిని మందలించే క్రమంలో సీఐ వేణుగోపాల్ అదుపుతప్పి జగన్ అనే దళితుడిని బూటుకాలితో తన్నారు. దీనిని కొందరు వ్యక్తులు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో డీజీపీ కార్యాలయానికి ఈ సమాచారం చేరడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. మంగళవాం రాత్రే సీఐని సస్పెండ్ చేయాల్సిందిగా డీఐజీకి డీజీపీ ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తామే ఏదో ఈ ఘటనను బయటకు తీసినట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వంపై విషప్రచారానికి పూనుకోవడం గమనార్హం. (సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు) ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో దళితుడిపై జరిగిన దాడి గురించి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సీఐ దాడికి దిగడం బాధాకరం. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యుడైన సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చాము. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చాం. దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని మంత్రి ధర్మాన తెలిపారు. -
సీఐ వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పలాస మండలం టెక్కలి పట్నంకు చెందిన రమేష్, జగన్ అనే యువకుల మధ్య వారి గ్రామంలో గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన జగన్ అనే దళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నారు. ఈ ఘటన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని ఏపీ డీజీపీ కార్యాలయం సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం విశాఖపట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాలన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
దర్జాగా కబ్జా
కాశీబుగ్గ: చట్టాల అతిక్రమణ, ఆస్తుల ఆక్రమణ.. సమాజంలో ఏ మాత్రం పలుకుబడి ఉన్నా, రాజకీయంగా పరిచయాలు ఉన్నా చేసే పనులివేనని మాటిమాటికీ రుజువవుతోంది. తాజాగా కాశీబుగ్గలోని దోయిసాగరం ఉదంతం బయటపడింది. రెండు ఎకరాల మేరకు ఆక్రమణలు జరగ్గా.. అధికారులు స్పందించడంతో ఆక్రమణల్లో కొంత భాగాన్ని రక్షించ గలిగారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఆక్రమణ లో ఉన్న వారంతా ‘పెద్దవారే’నని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆక్రమించిన వారిలో ఉన్నారని వారంటున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో అనేక పెద్ద సాగరాలు ఉన్నా కాశీబుగ్గకు తూర్పుభాగాన ఉన్నటువంటి దోయిసాగరం ముఖ్యమైనది. ఈ సాగరం ప్రస్తు తం 3వవార్డు పరిధి అంబుసోలి దళిత గ్రామానికి ఆనుకుని ఉంది. సర్వే నంబర్ 243/2 ప్రకారం 37 ఎకరాల సాగరమిది. దీని ఆ యకట్టు పరిధిలో తాళ్లభద్ర, అంబుసోలి, నర్సిపురం, చిన్నబడాం, పద్మనాభపురం రైతులు సుమారు 200 ఎకరాల భూములను సాగు చేస్తున్నారు. ఈ సాగరంలో సుమారు రెండెకరాల స్థలం ఆక్రమణలకు గురైంది. కాశీబుగ్గ–అక్కుపల్లి బీటీ రోడ్డుకు ఆనించి ఉన్న స్థలా న్ని కొందరు ఐదేళ్లుగా క్రమక్రమంగా ఆక్రమిస్తూ వస్తున్నారు. గడిచిన ఎన్నికల ముందు కోడ్ ఉన్నా కూడా వదలకుండా రెండెకరాలకు పైగా స్థలాన్ని అక్రమంగా కట్టడాలు కూడా కట్టేశారు. రూ.3 కోట్లు పలుకుతున్న స్థలం.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు–చెట్టు మొదలుపెట్టారు. అప్పటికే ఈ చెరువుపై కన్నేసిన స్థానిక పెద్దలు ఇక్కడ నీరు చెట్టు కార్యక్రమాలేవీ చేపట్టలేదు. ఎన్నికల సమయంలో రాత్రి వేళ అక్రమ కట్టడాలు కట్టి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ స్థలం దాదాపు రూ.3కోట్లు పలుకుతుంది. ఈ ఆక్రమణలో స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ నాయకుల పాత్ర ఉందని స్థానికులంటున్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు రిజిస్టేషన్లు జరుపుతున్న ముఠా పలాసలో వీరికి సహకరిస్తోంది. డీ–పట్టా భూములను, చెరువు గర్భాలను, గ్రామ కంఠాలను లింక్ డాక్యుమెంట్లతో మార్పులు చేర్పులు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. స్పందనలో కలెక్టర్‌కు వినతి.. దోయిసాగరంలో నీటిమట్టం స్థిరంగా ఉంటేనే తమ పంటలకు సా గునీరు అందుతుందని అంబుసోలి, ఇతర గ్రామస్తులు భావించా రు. ఆక్రమణ విషయం ఎప్పటి నుంచో తెలిసినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీక ఊరుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘స్పందన’ కార్యక్రమం ప్రారంభించడంతో నేరుగా కలెక్టర్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా రు. అంతకుముందు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌నే సంప్రదించారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జె.నివాస్ టెక్కలి ఆర్డీఓ కిశోర్‌కుమార్‌కు దీనిపై దర్యాప్తు చే యాల్సిందిగా ఆదేశించారు. ఆయన పలాస తహసీల్దార్ కార్యాల యం నుంచి రికార్డులను తెప్పించుకుని, సర్వేయర్ చంద్రశేఖర్‌తో ప రిశీలించి అక్రమ కట్టడంగా గుర్తించి తొలగించారు. ఆక్రమణదారు లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తొలగించడం సులభమైంది. పూర్తిగా ఆక్రమణలు తొలగించి లోతు చేయాలి.. ప్రస్తుతం గ్రామంలో ఉన్న దోయిసాగరం 37 ఎకరాలకు 35 ఎకరాలు మాత్రమే మిగిలింది. రూ.65లక్షలు విలువ పలికే 80 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుగల ఆక్రమిత ప్రాంతాన్ని తొలగించారు. మిగిలిన ఆక్రమణలు తొలగించడానికి వారం గడువి చ్చారు. ఇప్పటికీ పూర్తిగా తొలగింపులు జరగడం లేదు. ఆలస్యం చేయకుండా సాగరంలో ఉన్న ఆక్రమణలు తొలగించి వెంటనే చెరువును లోతు చేయించి చుట్టూ గట్టు ఏర్పాటు చేయాలి. – తెప్ప గణేష్, నీటిసంఘ అధ్యక్షులు, నర్సిపురం ఆక్రమణ తొలగిస్తాం పలాస తహసీల్దారు పరిధిలో ఉన్న దోయిసాగరం 243/2 సర్వే నంబర్లో ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే. ప్రస్తుతం వాటిని తొలగించాం. మిగిలిన డాక్యుమెంట్లు చూసి తప్పనిసరిగా ఆక్రమణలను తొలగిస్తాం. ఈ ఆక్రమణలో ఎంతటివారున్నా న్యాయపరమైన చర్యలు చేపడతాం. వారం రోజులు గడువు ఇచ్చాము. సరైన పత్రాలు తీసుకురాకుంటే ఆక్రమిత స్థలంగా భావించి వాటిని తొలగిస్తాం. – కిశోర్‌కుమార్, ఆర్డీఓ, టెక్కలి -
పెళ్లయిన రెండో రోజే..
కాశీబుగ్గ: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. పలాస మండలం గరుడఖండి గ్రామంలో పెళ్లయిన రెండో రోజునే నవవధువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సిగిలిపల్లి వరలక్ష్మి కుమార్తె దమయంతికి తురలకకోటకు చెంది న గోపీనాథ్ అలియాస్ సురేష్‌కు ఇచ్చి ఈ నెల 28వ తేదీ గురువారం రాత్రి నందిగాం మండలం సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. శనివారం ఉదయం ఐదు గంటలకు దమయంతికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే సమయంలోనే మృతి చెందింది. కాళ్ల పారాణి ఆరకుండానే దమయంతికి నూరేళ్లు నిండిపోవడంతో కన్నవారు, అత్తింటి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన ఈ పరిసర ప్రాంతాల్లో సంచలనంగా నిలిచింది. -
సైకో చేష్టలతో చనిపోతున్నా...
‘నేను చనిపోతే ఈ ఏరియాలో మాత్రమే విషయం తెలుస్తుంది.. కానీ నేను తులసీ(ప్రియుడు) అనే సైకో చేష్టల వల్ల ఇలా(సూసైడ్) చేసుకున్నానని బీహర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో కూడా తెలియాలి. ఇది నా చివరికోరిక – మీనాక్షి డైరీ సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురి చేశాడు. చివరకు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడంతో కుటుంబ సభ్యుల పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదు నెలలుగా తానూ ఏ విధంగా నరకం అనుభవించిందో తన డైరీలో రాసుకుని పెట్టుకుంది. చివరకు మంచినీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి చెందిన సొర్ర మీనాక్షి(25) మామిడిమెట్టు పంచాయతీ పరిధి రంగోయి గ్రామానికి సమీప రోడ్డు పక్కన ఉజ్జిడమ్మతల్లి గ్రామదేవత ఆలయం వద్ద బావిలో మృతదేహమై తేలింది. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు మోహనరావు, రూపావతిల ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, సునీతలకు వివాహాలయ్యాయి. చివరి కుమార్తె మీనాక్షి పలాస–కాశీబుగ్గలో ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివింది. ఈమెతో కలిసి మందస మండలం రట్టి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అందాల తులసిరావు కలిసి ఇంటర్మీడియట్ చదివాడు. బీహార్ సీఆర్పీఎఫ్ యూనిట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనతో పాత పరిచయం ఉన్నందున తన ఫోన్ నంబరు ఇచ్చింది. అప్పట్నుంచి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసి నరకం చూపించి చనిపోయే విధంగా ప్రేరేపించాడు. బావిలో మృతదేహం లభ్యం.. ప్రియుడు తులసీరావు పెట్టిన మానసిక వేధింపులు, తనకు చేసిన అన్యాయాన్ని మీనాక్షి ఈ నెల 5న తన డైరీలో రాసుకుని దాచి పెట్టుకుంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు తన మొబైల్లో భద్రపరుచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రోడ్డు పక్కన బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బహుశా శనివారం రాత్రి బావిలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కుమార్తె కనిపించకుండా పోయిందని, ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్ఐ మహమ్మద్‌ఆలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం బావిలో నుంచి తీయనున్నారు. సూసైడ్ నోట్లో.... ఒకప్పుడు తులసీ, కృష్ణ మంచి స్నేహితులు. తులసి నా విషయంలో చేసిన ప్రతీ అన్యాయం కృష్ణతో చెప్పుకునేదాన్ని. నా ఫోన్ నంబర్ తీసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పే వ్యక్తి ఇలా చేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే నా మనసు అంగీకరించట్లేదు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ విలువేంటో నాక్కూడా తెలుసు. నేను పోతే నా కుటుంబానికి తులసీ వాళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కారణం నేనే అయినప్పుడు అందరికీ దూరమవుతున్నాను. తను కూడా వాళ్ల నాన్న ప్రాణం కంటే నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. గర్వపడ్డాను.. తన మనస్సులో నాకు ఇంత మంచి స్థానం ఉందా అని? కానీ ఇప్పుడిప్పుడు అర్థమైంది. తనకు నా మీద ఉన్నది ప్రేమ కాదు. నన్ను అందరిలో పరువు తీసి నన్ను నరకం చూపించి నా లోకంలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చేంత వరకు నాకు తెలియలేదు. బతికే పది రోజులైనా ఏ టెన్షన్ లేకుండా సరదాగా బతకాలి అనుక్షణం భయంతో బతికితే ఆ బతుకే వేస్ట్ ఐ మిస్ యూ మై ఫ్యామిలీ. -
పొలాల్లో ప్రత్యక్షమైన ఏటీఎం మిషన్
సాక్షి, శ్రీకాకుళం : ఏసీ గదుల్లో, సీసీ ఫుటేజీ కనుసన్నల్లో ఉండాల్సిన ఏటీఎం మిషన్ పంట పొలాల్లో పూర్తిగా ధ్వంసమై లభించిన ఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంటపొలాల్లో ఏటిఎం మిషన్ సోమవారం దర్శనమిచ్చింది. ఉదయం పంట పొలాలకు వచ్చిన రైతులు మిషన్‌ను గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కాశీబుగ్గ సీఐ ఆర్.వేణుగోపాలరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఈ ఘటనపై ఎస్పీ అమ్మిరెడ్డికి సమాచారం అందించగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రహదారులను అలెర్ట్ చేసి తనిఖీలు చేపట్టారు. అనంతరం ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణతర్లా ఎస్బీఐ మేనేజర్, సిబ్బిందిని తీసుకోచ్చి పరిశీలించగా అది ఎస్బీఐ ఏటీఎం మిషన్‌గా గుర్తించారు. దీంతో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో ఉన్నటువంటి 19 బ్యాంకులు, 24 ఏటీఎం మిషన్లను, పరిసర ప్రాంతాలకు చెందిన ఏటీఎంలను పరిశీలించారు. పలాసకు క్లూస్ టీమ్ రాక జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో ఉన్నటువంటి ఏటీఎం విడిభాగాలను ఎవ్వరూ తాకకుండా స్థానికులు రక్షణ కల్పించడంతో శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. మిషన్‌ను వాహనంలో తీసుకొచ్చి పడివేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే శనివారం నాడు ఎచ్చెర్లలో జరిగిన ఏటీఎం చోరీలో మాయమైన క్యాష్ మిషన్ ఇదేనేమో అని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
యువతిపై ప్రియుడి తల్లి కత్తిదాడి
కాశీబుగ్గ : సహజీవనం చేసిన ప్రియుడు పరారు కావడంతో అతడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్షకు దిగింది. అక్కడ బైఠాయించిన ఈమెపై అతడి తల్లి భానుమతి కత్తితో దాడి చేసింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. శనివారం ఈ సంఘటన పలాస మండలం బ్రాహ్మణతర్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాశీబుగ్గ పోలీసుల వివరాల మేరకు... పలాస మండలం శాశనాం గ్రామానికి చెందిన డొంకాన వనజాక్షి, బ్రాహ్మణతర్లా గ్రామం హరిజనకాలనీకి చెందిన బడియా దిలీప్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ విశాఖపట్నంలో ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం దిలీప్ తల్లి భానుమతి తన కుమారుడిని కారులో బలవంతంగా స్వగ్రామానికి తీసుకొచ్చేసింది. ఇదేక్రమంలో ప్రియురాలు బ్రాహ్మణతర్లా చేరుకుని గ్రామపెద్దలను, మహిళా సంఘాలను ఆశ్రయించింది. దీంతో వనజకు న్యాయం చేస్తానని వీరి సమక్షంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. ఎన్నికల తర్వాత పరిష్కరించుకుంటామని ఒప్పుకున్న ప్రియుడు ఇంతలోనే పరారయ్యాడు. మరలా న్యాయం కావాలని ప్రియురాలు అతడి ఇంటి వద్దకు చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు భానుమతి, రాజు ఆమెను ఇంటి బయటే ఉంచారు. నాలుగు రోజులుగా స్థానికులు అన్నపానీయాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో దిలీప్ ఫోన్లో సూచించిన మేరకు అతడి తల్లిదండ్రులు ఆమెను శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈమె వెళ్లేందుకు ససేమిరా అనడంతో భానుమతి కత్తెతో దాడి చేసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానికుల సహకారంతో 108లో పలాస సామాజిక ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రజాసంఘాలు మద్దతు మోసపోయిన వనజాక్షికి అటు పోలీసులు, ఇటు దిలీప్ కుటుంబ సభ్యులు పట్టించుకోక ఒంటరై మిగిలిందని తక్షణమే న్యాయం చేయాలని మహిళా సంఘాలు, ఐద్వా, మహిళా కమిషన్, మానవహక్కుల కమిషన్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రియురాలిని మోసం చేసిన దిలీప్‌కు శిక్షపడాలని, దాడికి పాల్పడిన భానుమతికి 307 చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
టీవీఎస్ వాహనంలో ఇరుక్కున్న నాగుపాము
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భగవతి థియేటర్ దగ్గర్లో ఓ నాగుపాము కలకలం రేపింది. టీవీఎస్ వాహనంలోకి దూరి హల్చల్ చేసింది. వాహనంలోకి దూరిన తర్వాత ఇరుక్కు పోయిన పాము బయటకు వచ్చేందుకు నానా పాట్లు పడింది. స్థానికులు అక్కడికి చేరి నెమ్మదిగా పామును బయటకు పంపించి ఊపిరి పీల్చుకున్నారు. -
నా సంగతి తెలియదా.. జాగ్రత్తగా ఉండు
కాశీబుగ్గ : రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకుడు, పలాస సామాజిక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అధికార జులుం ప్రదర్శించారు. ‘మేమంటే ఎవరనుకుంటున్నావు? మా సంగతి తెలియదా? నీ సంగతేంటో చూస్తాం. జాగ్రత్తగా ఉండు’ అంటూ వీరంగం సృష్టించారు. కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం జరిగిన సంఘన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపై ఆయన విరుచుకుపడ్డ తీరు చూసి అంతా అవాక్కయ్యారు. ఎలా పనిచేస్తారో చూస్తా.. ట్రాన్స్ఫర్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని జిల్లా అధికారులకు ఇక్కడ తీరును వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పలాస నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో చోటా నాయకులు ఎమ్మెల్యే దన్ను చూసుకుని పేట్రేగిపొతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏం కష్టం వచ్చిందో..?
కాశీబుగ్గ : ఏం కష్టం వచ్చిందో తెలీదు.. కట్టుకున్న భర్తను వదిలి.. కన్నబిడ్డను కూడా వదిలి ఆ వివాహిత బలవంతంగా ఊపిరి ఆపుకుంది. రెండున్నరేళ్ల కుమారుడు అమ్మ కోసం రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. పలాస మండలం లొద్దభద్ర పంచాయతీ శాసనాంలో సోమవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుప్పిలి మోహిని(24) సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వారు తెలిపిన వివరాల మేరకు..మోహిని తన భర్త మధుసూదన రెడ్డితో కలిసి శాసనాంలోని సొంతింటిలో నివాసముంటున్నారు. భర్తతో కలిసి మేడపై నివాసముంటుండగా, మిగిలిన కుటుంబ సభ్యులు కింద ఉంటున్నారు. మధుసూదనరెడ్డి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నారు. మోహిని కూడా టైలరింగ్‌లో శిక్షణ పొంది పనిచేస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల మనోజ్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఏమైందో ఏమో గానీ సోమవారం మధ్యాహ్నం కుమారుడిని కింద ఉన్న వారికి అప్పగించి మేడపైకి వెళ్లి ఉరి పోసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి కూడా ఇటీవలే మరణించారు. చూపు లేని నానమ్మ ఘటనా స్థలానికి చేరుకుని రోదించిన తీరు అందరికీ కంటతడి పెట్టించింది. కాశీబుగ్గ ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చక్రాల కింద నలిగిన ప్రాణం
కాశీబుగ్గ : నిరుపేద కుటుంబంపై విధి పగబట్టింది. భర్త విదేశాల్లో ఉంటుండగా.. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న పిల్లల కోసం తినుబండారాలు తీసుకుని బయలుదేరిన ఆమె.. బస్సు చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ టెలీఫోన్ ఎక్సే్ఛంజీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో మత్స్యకార మహిళ మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన చింత కామమ్మ (35) కాశీబుగ్గ పట్టణంలో కూరగాయలు, ఇంటి సరుకులు కొనుగోలు చేసి కాశీబుగ్గ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ముందు ఉన్న రోడ్డుపై నడిచి వెళుతోంది. ఇంతలో పలాస కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ముందు చక్రాలకింద నలిగి పోయింది. ఆమె అక్కడక్కడే మరణించిందని పోలీసులు ధ్రువీకరించారు. కామమ్మ భర్త రాజారావు ఉపాధి నిమిత్తం విదేశాల్లో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ఆమెకు కుమార్తె స్వప్న, కుమారుడు మురళి ఉన్నారు. కామమ్మ వంట మనిషిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఇద్దరు పిల్లల కోసం తిను బండారాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సంచిలో ఉండటాన్ని చూసిన వారంతా కన్నీరు పర్యంతమ య్యారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పెంట శివకుమార్, కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తుల సమక్షంలో పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. సీఐ కె.అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస–కాశీబుగ్గలో రోడ్డు విస్తరణ జరగక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు విస్తరణపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
కాశీబుగ్గ : భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన బుధవారం పలాస మండలం రంగోయి గ్రామంలో చోటుచేసుకుంది. రంగోయికి చెందిన గేదెల జనార్దనరావు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరగ్గా, పెద్ద కుమారుడు హేమేశ్వరరావు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీగ్రామ్‌లో కర్రల మిల్లులో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. తండ్రి మృతి చెందాడన్న వార్త విని ఇద్దరు కుమారులు బయలుదేరినప్పటికీ స్వగ్రామం వచ్చేటప్పుడు రెండు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో జనార్దనరావు భార్య భాగ్యవతి బుధవారం గ్రామ శ్మశానవాటికలో భర్త చితికి తలకొరివిపెట్టింది. ఇద్దరు కుమారులు ఉండికూడా తాను తలకొరివి పెట్టి అనాథగా మిగిలిపోయానంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కలచివేసింది. -
కూలీ అనుమానాస్పద మృతి
కాశీబుగ్గ : రామకృష్ణాపురం గ్రామం సమీపంలో ఉన్న పలాస పవర్‌గ్రిడ్ సంస్థలో గత కొన్ని నెలలుగా పనిచేస్తున్న కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పవర్ గ్రిడ్ సంస్థ ప్రహరీ పక్క ఉన్న మృతదేహం చూసిన స్థానికులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం గ్రామానికి చెందిన నీలాపు కనకయ్య(46)గా గుర్తించారు. విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కనకయ్య మృతదేహాన్ని పరిశీలిస్తే ముక్కు నుంచి రక్తం వస్తుండడంతో హత్య, ఆత్మహత్య, లేక విద్యుత్ ప్రమాదమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ ఘటనపై స్థానికంగా వేరేలా ప్రచారం జరుగుతోంది. ప్రమాదకరమైన పవర్‌గ్రిడ్ సంస్థలో పనిచేస్తున్న కూలీలు మృతి చెందితే రహస్యంగా మృతదేహాలను బయటకు పారవేస్తున్నారని, అందుచేతన స్థానికులను కాకుండా దూర ప్రాంత కూలీలను పనిలో పెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన అనేక మంది కూలీలు అదృశ్యమైనట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఇంటి సందులోనే... శ్రీకాకుళం సిటీ : నగరంలోని దండివీధిలో నివాసం ఉంటున్న గొర్ల చంద్రశేఖర్(45) సోమవారం వేకువజామున అనుమానాస్పద స్థితిలో ఇంటిసందులో మృతిచెందాడు. ఇతడు స్వచ్ఛభారత్ ప్రొగ్రాంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులతో సోమవారం రాత్రి వరకు ఇంట్లో గడిపిన చంద్రశేఖర్ తెల్లవారుజామున ఇంటిసందులో మృతిచెందడంపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చంద్రశేఖర్ తన ఇంటి సందులో పడి ఉండటాన్ని మృతుడి కుటుంబసభ్యులు గమనించారు. సమాచారం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, ఒకటోపట్టణ సీఐ బి.ప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చంద్రశేఖర్ -
మరో రగడ!
ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకునే జిల్లాలో మరో రగడ ప్రారంభమైంది. వంశధార జలాశయం పనుల్లో భాగాంగా నిర్వాసిత గ్రామాలను తొలగిస్తుండడంతో.. నష్టపరిహారం అందలేదని ప్రజలు చేస్తున్న ఆందోళనలు కొలిక్కి రాకముందే పలాస మండలంలో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పరిధిలోని నిర్వాసితులు రోడ్డెక్కారు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లు, పాకలను తొలగించేందుకు సిద్ధమైన అధికారులను అడ్డుకున్నారు. తొలగింపు ప్రక్రియను విరమించుకోవాలని నినదించారు. వారితో వాగ్వాదానికి దిగారు. కాశీబుగ్గ: ఆఫ్‌షోర్ నిర్వాసితులకు నష్టపరిహారం అందజేసి సాగనంపాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పలాస మండలం రేగులుపాడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించకుండా పాకలను, ఇళ్లను తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మూడు మండలాల పరిధిలో నిర్మితమవుతున్న ఆఫ్‌షోర్ జలాశయం పూర్తయితే రేగులపాడు గ్రామస్తులు ముందుగా నష్టపోతున్నారు. నిర్వాసితులుగా మారనున్న వీరికి నయాపైసా కూడా ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. అయినా అధికారులు ఎలాంటి ఆలోచన చేయకుండా పాకలు, ఇళ్లను పొక్లయినర్లు, జేసీబీలతో తొలగించేందుకు శనివారం సిద్ధం కాడవంతో ప్రజలు ఆందోళన చెందారు. తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు, కాంట్రాక్టర్ ధనుంజయరెడ్డితో తమ సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారు వెనక్కితగ్గకుండా పదికిపైగా పశువుల శాలలను తొలగించారు. ఉన్న వాటిని కూడా తొలగించేందుకు వివిధ మార్గాల్లో పొక్లయినర్లు, జేసీబీలను రప్పించడంతో ఆగ్రహించిన ప్రజలు వాటికి ఎదురుగా వెళ్లి అడ్డుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి ప్రజలు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలను వెనక్కి పంపివేయాలని, లేకుంటే అడ్డంగా పడుకుంటామని, ప్రాణాలైనా బలియిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పోలీసులను పిలిపించి కేసులు నమోదు చేయిస్తామని అధికారులు హెచ్చరించారని పీత గంగయ్య, బొమ్మాళి సవరయ్యలు ఆవేదన చెందారు. పరిస్థితి ఇలా.. ఆఫ్‌షోర్ నిర్వాసిత గ్రామమైన రేగులపాడులో సుమారు 120 కుటుంబాలు, 430 మంది వరకూ జనాభా ఉంది. జలాశయం పనులు ప్రారంభించినప్పటికీ ఇళ్లకు, పశువుల పాకలకు, చెట్లకు ఎలాంటి నష్టపరిహారం ఇంతవరకూ చెల్లించలేదు. గత కొన్ని నెలలుగా అధికారులు, కాంట్రాక్టర్లు గ్రామానికి వచ్చి సర్వేల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్పితే నిర్వాసితుల గురించి పట్టించుకోలేదు. ఇళ్లకు పరిహారం ఇస్తామని, పశువుల శాలలకు ఎలాంటి పరిహారం ఇవ్వమని చెబుతూ అధికారులు వస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్టర్ ఆదేశాల ప్రకారం పనులు జరగాలని భావించిన కాంట్రాక్టర్ అధికారుల సమక్షంలో శనివారం ఇళ్లు, పాకల తొలగింపు పనులకు పూనుకున్నారు. బొమ్మాళి చినబాబు, దాసరి ఉమ్మయ్య, పానిల వసంత్, ఐతి ఆదినారాయణ, ఫీత భైరాగి, అంబలి నారాయణకు చెందిన పాకలను తొలగించారు. దీంతో ఒక్క సారిగా గ్రామస్తులు తిరబడ్డారు. పరిహారం చెల్లించకుండా పాకలు తొలగించడం తగదని వాపోయారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి వ్యతిరేకరంగా నినాదాలు చేయడంతో తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మూడు రోజుల్లో పరిహారం చెల్లిస్తాం నిర్వాసితులకు మూడు రోజుల్లో నష్టపరిహాం నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తాం. ప్రస్తుతం బ్యాంకు పనులు తప్పిస్తే మొత్తం పూర్తయ్యాయి. ఈలోగా పనులకు ఆటంకం లేకుండా చేయాలని తాము ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. పునరావాస కాలనీని కూడా నిర్వాసితులు కోరుకున్న చోట ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. – ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ, టెక్కలి -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాశీబుగ్గ: కాశీబుగ్గ బస్టాండ్ ఎదురుగా ఉన్న అప్సర లాడ్జిలో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మందస మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బగాది మోహన్‌రావు(42) గురువారం రాత్రి అప్సర లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే పూటుగా తాగిన మోహన్‌రావు మద్యంతోపాటు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు లాడ్జి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. కాశీబుగ్గ పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి ఎస్సై కేవీ సురేష్‌కుమార్, కానిస్టేబుల్ డి.సూరిబాబు చేరుకున్నారు. తలుపులను పగలగొట్టి విగతజీవిగా పడి ఉన్న మోహన్‌రావును బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే 108లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికి ప్రథమ చికిత్స అందించడంతో ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. మోహన్‌రావు రామకృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వాచ్‌మన్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. -
ఓ తండ్రి ఆక్రందన!
► తనను బతకనివ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యక్తి నిరాహార దీక్ష ► పోలీసులు, తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన ► కన్నకొడుకులే ఈ దుస్థితికి కారణమంటూ కన్నీటిపర్యాంతం కన్న కొడుకులు పొమ్మన్నారు.. ఇంటికి వెళ్తే తాళం వేశారు.. భార్య విడిచిపెట్టింది. అందరూ ఉండి, అనాథై రోడ్డుపాలైన ఓ వ్యక్తి జీవితమిది. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నానని, తనను బతికించండంటూ ప్రాధేయపడుతూ అందరి కంటా కన్నీళ్లు తెప్పించాడు. ఈ సంఘటన సోమవారం పలాసలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ : పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన తెప్పల ధర్మారావు డిప్లమో చదివి హిందుస్తాన్ మోటార్ కంపెనీ(కోల్కత్తా)లో ఉద్యోగం చేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరినీ బాగాచ దివించి, ప్రయోజకులను చేశాడు. కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారుల కుమార్తె, సొంత మేనమామ కూతురైన భార్య.. పిల్లలు చదువుతున్న సమయంలోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం కుమారులిద్దరూ పెళ్లిళ్లు జరిగి స్థిరపడ్డారు. వారిలో పెద్ద కుమారుడు దేవేంద్రవర్మ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పూణేలో ఉద్యోగం చేస్తూ, హైదరాబాదులో చేస్తున్నట్లు చిరునామా ఇచ్చి తప్పించుకుంటున్నాడు. ధర్మారావు పేరున ఉన్నటువంటి 30 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో రాయించుకొని తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. చిన్నకొడుకు సురేంద్రవర్మ బ్రాహ్మణతర్లా గ్రామంలో మెడికల్ ప్రాక్టిషనర్(ఆర్ఎంపీ)గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు తండ్రి వద్ద డబ్బును, భూమిని తీసుకొని రోడ్డున వదిలేశారు. ఆకలేస్తుందని ఇంటికి వెళ్లిన ప్రతిసారీ.. కోడళ్లు తలుపులకు తాళాలు వేసి బయటకు పొమ్మంటున్నారని ధర్మారావు కన్నీటిపర్యాంతమయ్యాడు. విషపదార్థాలు కలిపిన భోజనం ఇచ్చి తనను చంపాలని చూశారని ఆవేదన చెందాడు. ఏడాది నుంచి బ్రాహ్మణతర్లా బస్టాండ్‌లో పడుకుంటున్నానని, చుట్టుపక్కల వారంతా గంజి పోస్తే తాగుతున్నానని వాపోయాడు. తాను చావుకు దగ్గరగా ఉన్నానని, ఈ నిరసన ద్వారా తన బాధను వ్యక్తం చేస్తున్నానని సోమవారం పలాస తహసీల్దార్ ముందు కన్నీరుపెడుతూ అందరి హృదయాలనూ కదిలించాడు. ఫోర్జరీ సంతకాలంతో భూములను రాయించుకున్నారని కలెక్టర్ లక్ష్మీనరసింహంతోపాటు.. టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, పలాస తహసీల్దార్, కాశీబుగ్గ పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేశానని తెలిపాడు. వారెవరూ పట్టించుకోలేదని అధికారుల తీరును ఎండగట్టాడు. చివరికి తన వద్ద ఉన్న నగదును ఖర్చు పెట్టి.. ఫోర్జరీ సంతకాలు చేసిన వైనంపై పలాస తహసీల్దార్‌కు కోర్టు నోటీసును సైతం పంపించాడు. ఈ నిరసనకు స్పందించిన పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి.. ఆయనతో మాట్లాడారు. నెలరోజుల్లో న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
చైల్డ్‌లైన్‌కు పట్టుబడ్డ బాల కార్మికులు
పలాస : కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలోని సంతోషిమాత గుడి వద్ద యాచక వృత్తి చేస్తూ కనిపించిన ఐదుగురు బాల కార్మికులను చైల్డ్‌లైన్ సిబ్బంది గుర్తించి కాశీబుగ్గ పోలీసుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లా సమాలికా గ్రామానికి చెందిన ప్రియాంక(4), సోను(10), జగన్(7), రాహుల్(5), సకీనా(2) పిల్లలను చైల్డ్‌లైన్ టీము లీడర్ బమ్మిడి అరుణ పట్టుకున్నారు. చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జె.భాగ్యలక్ష్మి, ప్రతినిధి పి.కామేష్‌లు కలిసి కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు పిల్లలను తీసుకెళ్లి అక్కడ నుంచి పోలీసుల సహకారంతో శ్రీకాకుళం బాలల సంరక్షణ సంఘానికి అప్పగించడానికి వెళ్లారు. పిల్లల చేత యాచక వృత్తి చేయిస్తూ తండ్రిగా చెప్పుకుంటున్న కర్తార్‌సింగ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల చేత యాచక వృత్తి చేయడంగానీ, బాలకార్మికులుగా ఇతర పనులు చేయించినా చట్టరీత్యా నేరమని, అందుకు బాలల సంక్షేమ సంఘానికి అప్పగిస్తున్నట్టు చెప్పారు. -
చూపున్న వేళ్లు
కంటిచూపు పోతే సర్వం పోయినట్లే అనుకుంటాం. కానీ చూపే సర్వస్వం కాదని హఫీజ్‌ని చూస్తే అర్థమౌతుంది! తన స్కిల్‌ని, విల్ పవర్‌ని కలిపి... వేళ్లను ఒత్తులుగా చేసుకుని జీవితాన్ని వెలిగించుకుంటున్న ఈ మెకానిక్... ఆ వెలుగులోనే పదేళ్లుగా తన బతుకుబండిని లాక్కొస్తున్నాడు. ఒక్క మాటలో... హఫీజ్ తన వేళ్లపై తను నిలబడ్డాడు. హఫీజ్ స్వస్థలం వరంగల్ జిల్లా కాశీబుగ్గ. ఇంటికి పెద్ద కుమారుడు. ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి అఫ్జల్ వాచ్‌మన్‌గా పనిచేసేవారు. హఫీజ్ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలోనే చదువుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ పరిస్థితి అతడిని పై చదువులు చదవనివ్వలేదు. తండ్రికి ఆసరాగా ఉండవచ్చని దగ్గర్లోని ఆటోనగర్‌లో వాహనాల మెకానిక్‌గా చేరాడు. లారీ మెకానిక్‌గా మంచి పేరు సంపాదించాడు. అప్పుడే నజీమాతో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. అఫ్సానా, ముజామిల్. వచ్చిన సంపాదనతోనే భార్య బిడ్డలను, తల్లిదండ్రులను పోషించుకునేవాడు. అలా సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఒక్కసారిగా ఊహించని మలుపు! దాన్నెప్పటికీ మరిచిపోలేడు హఫీస్. ‘‘2003లో ఆటోనగర్ నుంచి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడితో అయిపోలేదు. ఆసుపత్రిలో చికిత్స వికటించి ఒక కన్ను చూపు కోల్పోయింది. అయితే, ఈ సంగతి చుట్టుపక్కల వారికే కాదు మా ఇంట్లో వారికీ తెలియనివ్వలేదు. బాధపడతారనేది ఒక కారణమైతే, ఒంటి కన్నుతో డ్రైవింగ్ ఎలా చేస్తున్నావ్ అని అడుగుతారనీ, మెకానిక్ పనులు తగ్గిపోతాయేమోననీ చెప్పలేదు. అలాగే పనులు చేసుకుంటూ వస్తుంటే.. 2005లో మళ్లీ ఓ ప్రమాదం. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో బాణాసంచా పేలుస్తున్నాం. ఆ సమయంలో టపాసులు పేలి నేరుగా కళ్లలోకి దూసుకెళ్లాయి. ఆ ప్రమాదంలో... ఉన్న రెండో కన్నూ పొగొట్టుకున్నాను’’ అని నాటి సంఘటనల విషాదాన్ని వివరించారు హఫీజ్! దిక్కుతోచలేదు ‘‘చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులే కాదు, పట్నం ఆసుపత్రుల్లోనూ చూపించారు మా వాళ్లు. మెకానిక్ పనులు చేసి కూడబెట్టిన రూపాయి రూపాయి ఆసుపత్రులకు తిరగడానికే ఖర్చయ్యిందే తప్ప ప్రయోజనం లేకపోయింది. చూపు లేకపోవడంతో ఎవరి సాయమూ లేకుండా అడుగు కూడా వేయలేకపోయేవాడిని. ఇక పనులేం చేయగలను! రోజులు నెలల్లోకి మారుతున్నాయి. ఎవరో ఒకరి ఆసరా లేనిదే అడుగు బయట పెట్టలేని స్థితి. ఫీజులు కట్టలేక పిల్లల చదువులు ఆగిపోయాయి. ఆరునెలలు దిక్కు తోచని స్థితిలోనే ఉన్నాను. పూట గడవడమే కష్టంగా మారింది. నా భార్య బీడీలు చుట్టి, కుటుంబానికి ఆసరా అయ్యింది. ఇప్పటికీ బీడీలు చుడుతూనే ఉంది. వాచ్మెన్ పనిని వదిలేసిన నా తండ్రి తిరిగి వాచ్‌మన్‌గా కొనసాగాల్సి వచ్చింది. తెలిసినవారు, దయార్ద్రహృదయులు నా పరిస్థితికి జాలి పడి సాయమందించారు’’ అంటూ చూపు కోల్పోయిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను, చేయూతనందించిన వ్యక్తులను గుర్తుచేసుకున్నారు హఫీజ్! వేరే దారీ లేదు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు కలలు లక్ష్యాలవైపుగా దూసుకెళుతుంటాయి. అవాంతరం ఎదురైనప్పుడు అవన్నీ కల్లలౌతాయి. కానీ హఫీజ్ తన కాళ్లపై తను నిలబడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.‘‘స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పు తెచ్చి, ఒక ఆటో కొన్నాను. దాన్ని అద్దెకిచ్చి, వచ్చిన డబ్బుతో గడపవచ్చని ఆశ. అలా కొన్ని నెలలు గడిపాను. ఆటో రిపేర్‌కు వచ్చినప్పుడల్లా నాకు తెలిసిన మెకానిక్ పనితోనే దానిని బాగు చేసేవాడిని. నేను చేస్తున్న పని చూసినవాళ్లు, తెలిసినవారు తమ వాహనాలను తీసుకొచ్చి బాగుచేయమనేవారు. వేళ్లతోనూ, చేతులతోనూ తడిమి, ఆ వాహనానికి ఎక్కడ సమస్య ఉందో గుర్తించేవాడిని. అలా ఎవరు వాహనం తీసుకొచ్చినా బాగుచేయడం, అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడం.. ఏదో తెలియని కొత్త శక్తి నాలో వచ్చి చేరినట్టు అనిపించింది. తెలిసిన విద్యే కదా. వేళ్లకు చూపు తెచ్చుకుంటే చాలు బతుకుబండి నడిచిపోతుంది అనిపించింది. అలా కాశీబుగ్గలో మా ఇంటి దగ్గరే మెకానిక్‌గా వాహనాలకు మరమ్మతు చేయడం మొదలుపెట్టాను. పదేళ్లుగా ఇదే పని. కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. ఇప్పుడు కొడుకు ఏడవ తరగతి, కూతురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నాలుగు ఆటోలు సమకూరితే, వాటిని అద్దెకిచ్చి, ఈ మెకానిక్ పనిచేస్తూ పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశ, కల. స్థోమత లేక నాలాగే వారి చదువులూ ఆగిపోతాయేమో అనే భయం తప్ప మరో ఆలోచన లేదు’’ అని చెప్పారు హఫీజ్. కష్టాలు వస్తే కుంగిపోయి జీవితంలో వెనకంజ వేయడం సరికాదని చెప్పే హఫీజ్... భవిష్యత్తు కోసం కలలు కనాలంటే కంటిచూపు మీదే ఆధారపడనక్కర్లేదని కూడా నిరూపిస్తున్నారు. విధి పరీక్షలో నెగ్గి చూపున్నవారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరి సాయమూ తీసుకోడు నేను ఆటో డ్రైవర్ని. ఐదేళ్లుగా హఫీజ్ నాకు తెలుసు. ఆటోలకు, ద్విచక్రవాహనాలకు ఏ సమస్య వచ్చినా మా కంటే బాగా వేళ్లతో చెక్ చేసి చెప్పేస్తాడు. వెంటనే మరమ్మతు చేస్తాడు. అందుకు ఎవరి సాయమూ తీసుకోడు. చూపు లేకపోయినా చూపున్నవారితో సమానంగా చేసే హఫీజ్ పని విధానం చూసి మేమంతా ఆశ్చర్యపోతుంటాం. - మోహన్, ఆటో డ్రైవర్ పాఠకులకు గమనిక పేరుకు ఇది ‘మిణుగురులు’ శీర్షికే అయినా, ఇందులో వచ్చే వ్యక్తుల ఆదర్శవంతమైన జీవితాలు సమాజానికి దివిటీల వంటివి. చీకటిని తిడుతూ కూర్చోక, హఫీజ్లా చిరుదివ్వెలు వెలిగించుకున్న వారెవరైనా మీకు తారసపడితే వారి వివరాలు మాకు తెలియజేయండి. అంధులలో స్ఫూర్తి నింపడానికి మీ వంతు కర్తవ్యంగా ముందుకు రండి. మా చిరునామా మిణుగురులు, ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.