
అంత్యక్రియలు నిర్వహిస్తున్న భార్య భాగ్యవతి
కాశీబుగ్గ : భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన బుధవారం పలాస మండలం రంగోయి గ్రామంలో చోటుచేసుకుంది. రంగోయికి చెందిన గేదెల జనార్దనరావు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరగ్గా, పెద్ద కుమారుడు హేమేశ్వరరావు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీగ్రామ్‌లో కర్రల మిల్లులో పనిచేస్తున్నాడు.
చిన్నకుమారుడు జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. తండ్రి మృతి చెందాడన్న వార్త విని ఇద్దరు కుమారులు బయలుదేరినప్పటికీ స్వగ్రామం వచ్చేటప్పుడు రెండు రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో జనార్దనరావు భార్య భాగ్యవతి బుధవారం గ్రామ శ్మశానవాటికలో భర్త చితికి తలకొరివిపెట్టింది. ఇద్దరు కుమారులు ఉండికూడా తాను తలకొరివి పెట్టి అనాథగా మిగిలిపోయానంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కలచివేసింది.