తిరుపతి, ఊర్మిళ మృతదేహాలను తీసుకెళుతున్న గ్రామస్తులు
సోంపేట: ఎలుగుబంటి దాడిలో మృతిచెందిన యర్రముక్కాం గ్రామానికి చెందిన దంపతులు బైపల్లి తిరుపతి, ఊర్మిళ అంత్యక్రియలను గ్రామస్తులు సోమవారం అశ్రునయనాలతో నిర్వహించారు. పలాస సామాజిక ఆస్పత్రి నుంచి ఊర్మిళ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్త తిరుపతి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ నుంచి సోమవారం సాయంత్రం యర్రముక్కాం తీసుకొచ్చారు.
వీరికి విషణ్ణవదనాలతో గ్రామస్తులు, బంధువులు ఖననం చేశారు. దీంతో యర్రముక్కాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోవడంతో కుమారుడు శ్యామ్ ఒంటరిగా మిగిలాడు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ పొట్టి రాజేశ్వరి, జెట్పీటీసీ చంద్రమోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
వైద్యనిపుణుల పర్యవేక్షణలో దుర్యోధనరావుకు చికిత్స
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): సోంపేట మండలం ఎర్రముక్కం గ్రామంలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన దుర్యోధనరావు కేజీహెచ్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ జి.అర్జునతో పాటు వైద్య నిపుణుల బృందం సోమవారం ఆయనను పరీక్షించింది. అర్జున మాట్లాడుతూ దుర్యోధనను అత్యవసర సేవల విభాగం నుంచి ప్రత్యేక వైద్య సేవల నిమిత్తం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించామని చెప్పారు. కాగా.. మరో బాధితుడు అప్పలస్వామికి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment