bear attacked
-
‘వెలుగు’బంటి..!
వేటగాళ్ల ఉచ్చులో ప్రమాదవశాత్తూ చిక్కుకున్న ఎలుగుబంటిని కాపాడి దాని జీవితంలో వెలుగులునింపారు. బద్వేలు రేంజ్‌పరిధిలోని బోయినపల్లె బీటు(బ్రాహ్మణపల్లె సెక్షన్) సమీపంలోని గానుగపెంట రిజర్వ్‌ఫారెస్ట్ లో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటిని స్థానిక అటవీ సిబ్బంది, సిద్దవటం రెస్కూటీం, తిరుపతి జూపార్కు సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించిరక్షించారు. అనంతరం చికిత్ప చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఎస్వీ జూపార్కుకు తరలించారు. కాగా అటవీప్రాంతంలోఉచ్చు వేసిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేయాలని డీఎఫ్ఓ గురుప్రభాకర్ ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : గానుగపెంట రిజర్వుఫారెస్టు సమీపంలో ఎలుగుబంటి ఉచ్చులో చిక్కుకుందని బుధవారం రాత్రి సమాచారం అందుకున్న స్థానిక అటవీ సిబ్బంది ఎలుగుబంటిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిమ్మచీకటి కావడంతో చేసేది లేక విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు కొంత మంది సిబ్బందిని అక్కడే విధుల్లో ఉండాలని ఆదేశించి సిద్దవటం రెస్కూటీంను, తిరుపతి జూపార్కు సిబ్బందిని రంగంలోకి దింపారు. గురువారం ఉదయం 7 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని కాపాడేందుకు ఉపక్రమించారు. అయితే ఎలుగుబంటి కాలికి ఉచ్చు బలంగా బిగించుకుపోవడంతో సాధ్యపడలేదు. దీంతో జూపార్కు వైద్యులు డాక్టర్ ఆరుణ్‌కుమార్ ఎలుగుబంటికి గన్‌తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన ఎలుగుబంటిని అతి కష్టం మీద ఉచ్చు నుంచి తప్పించి ప్రత్యేక వాహనంలోకి తెచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఫారెస్టుబంగ్లాకు తరలించారు. మత్తు నుంచి తేరుకున్న ఎలుగుబంటి కాలికి బలమైన గాయం కావడంతో పాటు, విరేచనాలు అవుతుండటంతో నడవలేని స్థితిలో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఎలుగుబంటిని అటవీప్రాంతం నుంచి తరలించారని సమాచారం తెలుసుకున్న సమీప గ్రామప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వేటగాళ్లపై కేసు నమోదుకు ఆదేశం వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుందన్న విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు డీఎఫ్ఓ గురుప్రభాకర్ గురువారం ఉదయం బద్వేలు ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంతలో ఎలుగుబంటిని ఫారెస్టుబంగ్లాకు తీసుకురావడంతో దానిని పరిశీలించి వైద్యుడితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వణ్యప్రాణులను వేటాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, ఇది దురదృష్టకరమన్నారు.అలాగే గానుగపెంట రిజర్వ్‌ఫారెస్టులో వణ్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమీప అటవీప్రాంత ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. ఎలుగుబంటికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు అందించి తిరిగి లంకమల అభయారణ్యంలో వదిలేలా చర్యలు తీసుకోవాలని జూపార్క్ సిబ్బందిని కోరారు. -
మూడుకు చేరిన ఎలుగుదాడి మృతుల సంఖ్య
సోంపేట : మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో జూన్ 10న ఎలుగుబంటి దాడిలో గాయపడిన బైపల్లి దుర్యోధన (49) ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందాడు. దీంతో ఎలుగు బీభత్సంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఎర్రముక్కాం, సిరిమామిడి గ్రామాల్లో ఎలుగు దాడి చేసిన ఘటనలో బైపల్లి ఊర్మిళ, తిరుపతి దంపతులు అదే రోజు మృతి చెందగా, తీవ్రంగా గాయపడి కాలును కోల్పోయిన దుర్యోధన 15 రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈయనకు భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దుర్యోదన బిలాయిలో డ్రైవర్‌గా పనిచేస్తూ వేసవి కావడంతో గ్రామానికి వచ్చాడు. ఇంతలో ఎలుగుబంటి రూపంలో విషాదం ఎదురైంది. సోమవారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, గ్రామ సర్పంచ్ పి.రాజేశ్వరి, జెడ్పీటీసీ ఎస్.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. \ గ్రామంలో విషాదఛాయలు.. ఎలుగు బీభత్సం సృష్టించి 15 రోజులు గడుస్తున్నా గ్రామంలో ఇంకా విషాద ఛాయలే దర్శనమిస్తున్నాయి.రైతు బైపల్లి హేమరాజుకు చెందిన 50 వేల విలువైన ఎడ్లు మృతి చెందాయి. అదే రోజు ఊర్మిళ, తిరుపతి దందపతులు మృతి చెందారు. బైపల్లి అప్పలస్వామి సెవెన్ హిల్స్‌లో వైద్యం చేయించుకుని, ప్రస్తుతం తమ కుమార్తె నివసిస్తున్న రాయిపూర్లో వైద్యం చేయుంచుకుంటున్నారు. దుర్యోదన ఆదివారం మృతి చెందాడు. రట్టి అప్పన్న, బైపల్లి పాపారావులు ప్రస్తుతం ఇంటి వద్ద గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. రూ.25 లక్షల పరిహారం అందజేయాలి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందజేయాలని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం దుర్యోదన కుటుంభ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు అందజేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం సోంపేట, మందస మండలాల్లో సంచరిస్తున్న ఎలుగులను అటవీ శాఖాధికారులు పట్టుకుని అడవిలో విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మసకబారిన బతుకులు
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంతో గ్రామానికి చెందిన బైపల్లి శ్యాం జీవితం చీకట్లోకి వెళ్లిపోగా, మరో రెండు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్టణంలోని ఓ ఆస్పత్రి వద్ద, ఒక కుటుంబం శ్రీకాకుళంలో రిమ్స్ ఆస్పత్రి వద్ద కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరో ఇద్దరు తమ ఇళ్ల వద్ద కదలలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం ఆరు కుటుంబాలకు ఎలుగు రూపంలో తీరని కష్టం మిగిల్చింది. జీడితోటలు, సముద్ర తీరంతో ఆనందంగా గడిపే ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం నుంచి విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరి నోట విన్నా అదే కథ. నలుగురు ఒకచోటకు చేరితే ఈ విషాద ఘటనను తలచుకుని బాధ పడుతున్నారు. గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా గ్రామ పరిధిలో ఒక ఎలుగు సంచరించడం, మనుషులు మాటలు విని వెళ్లిపోతుండంతో, సహజంగా గ్రామస్తులు ఎలుగు అంటే అంత భయపడే వారు కాదు. కాని ఆదివారం నాడు ఎలుగు సృష్టించిన విధ్వంసంతో గ్రామంలో ఎలుగు పేరు చెపితే బయపడే పరిస్థితి వచ్చింది. మందస మండల పరిధిలో రెండు ఎలుగులు సంచరిస్తున్నాయని మంగళవారం వార్త వ్యాపించడంతో ఈ గ్రామంలోని యువత గ్రామం చుట్టూ కర్రలు పట్టుకుని కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్యాం జీవితం అంధకారం బైపల్లి శ్యాంది ఆదివారం ఉదయం వరకు అమ్మ, నాన్నలతో కలిసి ఆనందమయం జీవితం. ఆదివారం ఉదయం ఎలుగు దాడిలో శ్యాం అమ్మ, నాన్న ఊర్మిళ, తిరుపతి మృతి చెందడంతో ఇతడి జీవితం అగమ్యగోచరానికి చేరుకుంది. శ్యాం అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్య ఇదివరలో మృతి చెందడంతో శ్యాం ఒంటరి వాడయ్యాడు. ఇంట్లో కూర్చుని అమ్మ, నాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నాడు. ఆయన రోదనను ఆపేవారు కూడా లేని పరిస్థితి. ఆయన జీవితానికి దేవుడే దారి చూపాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇలాంటి విషాదం ఏ కుటుంబంలోను చోటు చేసుకోకూడదని గ్రామస్తులు కోరుకుంటున్నారు. విశాఖలో కాపలా అలాగే బైపల్లి అప్పలస్వామి, దుర్యోధన ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలవ్వడంతో విశాఖపట్నం తరలించారు. బైపల్లి అప్పలస్వామి తలకు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధనకు కాలికి తీవ్ర గాయం కావడంతో, కాలు తీయక తప్పలేదని వైద్యాధికారులు తెలిపారు. దుర్యోధన ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధన, అప్పలస్వామి తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతుండడంతో, వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్నంలో బాధితులు వద్ద ఉంటున్నారు. అలాగే గ్రామానికి చెందిన యువకుడు బైపల్లి రాజేష్ తీవ్రగాయాలతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు రట్టి అప్పన్న, బైపల్లి పాపారావు ప్రస్తుతం గాయాలతో ఇంటి వద్ద కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వారి నిత్యవసరాలకు కూడా వేరేవారి సహాయం కోరవలసిన పరిస్థితి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులు పూర్తిగా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉద్దానాన్ని వీడని ఎలుగుల భయం, తీర ప్రాంతంలో హల్చల్ చేసిన రెండు ఎలుగులు మందస: మందస, సోంపేట మండలాలకు ఎలుగుబంట్ల భయం వీడడంలేదు. మూడు రోజుల కిందట సోంపేట, మందస మండలాల్లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి హతమైనప్పటికీ పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లు ఉద్దానం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మంగళవారం రెండు ఎలుగుబంట్లు సముద్ర తీర ప్రాంతాల్లో హల్చల్ చేశాయి. దీంతో తీర ప్రాంతానికి చెందిన ఉద్దానం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడ్డారు. ఉద్దానం కొండలు, జీడితోటల్లో సంచరిస్తున్న రెండు ఎలుగులు దారి తప్పి భేతాళపురం, దున్నవూరు, రట్టి, గంగువాడ తదితర గ్రామాల పరిసరాల్లో తిరిగాయి. సముద్ర తీరం నుంచి వెళ్తూ, కనిపించిన మత్స్యకారులను భయపెట్టాయి. దీంతో వారు అమ్మో.. ఎలుగులు అంటూ పరుగులు తీశారు. కాగా, ఉద్దానంలో ఎలుగులు మనుషులు హటాత్తుగా కనిపిస్తే తప్ప కావాలని వచ్చి మీద పడి దాడి చేయవు. అయితే ఎన్నడూలేని విధంగా మూడు రోజుల కిందట కనిపించిన మనుషులు, పశువులు, పెంపుడు జంతువులపై దాడి చేసి మరీ చంపేయ్యడంతో స్థానికులు హతాశులవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్దానంలో జీవించడం కూడా కష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రముక్కాం, పాతపితాళి, దున్నవూరు సంఘటన మరువక ముందే మరో రెంటు ఎలుగుబంట్లు కలకలం సృష్టించడంతో తీరప్రాంతవాసులు, ఉద్దానం ప్రజలకు కంటిమీద కునుకు కరవవుతుందన్నారు. -
ఎలుగు బంటి దాడి మృతుల అంత్యక్రియలు పూర్తి
సోంపేట: ఎలుగుబంటి దాడిలో మృతిచెందిన యర్రముక్కాం గ్రామానికి చెందిన దంపతులు బైపల్లి తిరుపతి, ఊర్మిళ అంత్యక్రియలను గ్రామస్తులు సోమవారం అశ్రునయనాలతో నిర్వహించారు. పలాస సామాజిక ఆస్పత్రి నుంచి ఊర్మిళ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్త తిరుపతి మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ నుంచి సోమవారం సాయంత్రం యర్రముక్కాం తీసుకొచ్చారు. వీరికి విషణ్ణవదనాలతో గ్రామస్తులు, బంధువులు ఖననం చేశారు. దీంతో యర్రముక్కాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోవడంతో కుమారుడు శ్యామ్ ఒంటరిగా మిగిలాడు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ పొట్టి రాజేశ్వరి, జెట్పీటీసీ చంద్రమోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. వైద్యనిపుణుల పర్యవేక్షణలో దుర్యోధనరావుకు చికిత్స పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): సోంపేట మండలం ఎర్రముక్కం గ్రామంలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన దుర్యోధనరావు కేజీహెచ్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ జి.అర్జునతో పాటు వైద్య నిపుణుల బృందం సోమవారం ఆయనను పరీక్షించింది. అర్జున మాట్లాడుతూ దుర్యోధనను అత్యవసర సేవల విభాగం నుంచి ప్రత్యేక వైద్య సేవల నిమిత్తం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించామని చెప్పారు. కాగా.. మరో బాధితుడు అప్పలస్వామికి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
వృద్ధురాలిపై ఎలుగుబంటి దాడి
డిచ్పల్లి, నిజామాబాద్ : గ్రామంలో వచ్చిన ఎలుగుబంటి ఓ వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు కర్రలతో వెంటబడడంతో అడవిలోకి పరుగు తీసింది. ఈ ఘటన మండలంలోని ధర్మారం(బి)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు కాసం లక్ష్మి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి బయట గేటును తెరుస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆమె భయంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి కర్రలతో ఎలుగుబంటిని తరిమేశారు. మదన్‌పల్లి వైపు ఎలుగుబంటి పారిపోయిందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు కొద్దిగా ఆలస్యంగా వచ్చి ఉంటే లక్ష్మితో పాటు అక్కడే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి ఉండేదని సర్పంచ్ ఈదర కస్తూరి, ఉప సర్పంచ్ ఎడవెల్లి సోమనాథ్ లు తెలిపారు. యపడిన బాధితురాలిని 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కిమ్స్‌లో చేర్పించారు. అటవీ ప్రాంతంలో తాగునీరు లేకపోవడంతో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎలుగుబంటి దాడితో ధర్మారం(బి), మదన్‌పల్లి, కేశాపూర్ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. -
ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
అర్ధవీడు (ప్రకాశం జిల్లా): కుంటలో నీరు తాగేందుకు వెళ్లిన రైతుపై ఎలుగుబండి దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోమిలింగం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు(30) పొలంలో అరక దున్నేందుకు వెళ్లాడు. కాగా, సాయంత్రం దప్పిక కావడంతో పక్కనే ఉన్న కుంటలో నీరు తాగేందుకు వెళ్లాడు. అయితే, అక్కడే ఉన్న ఎలుగుబంటి రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఎలుగుబంటి దాడి..వ్యక్తికి తీవ్రగాయాలు
కడప (పోరుమామిళ్ల): కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల్ల గ్రామంలో ఓ వ్యక్తిపై గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇండ్లరామయ్య(48) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కి.మీల దూరంలో ఉన్న తన మామిడితోటకి రామయ్య కాపలాగా వెళ్లినప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎలుగుబంటి మీదపడి దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డ రామయ్యను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.