చికిత్స కోసం ఎలుగుబంటిని తరలిస్తున్న దృశ్యం
వేటగాళ్ల ఉచ్చులో ప్రమాదవశాత్తూ చిక్కుకున్న ఎలుగుబంటిని కాపాడి దాని జీవితంలో వెలుగులునింపారు. బద్వేలు రేంజ్‌పరిధిలోని బోయినపల్లె బీటు(బ్రాహ్మణపల్లె సెక్షన్) సమీపంలోని గానుగపెంట రిజర్వ్‌ఫారెస్ట్ లో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటిని స్థానిక అటవీ సిబ్బంది, సిద్దవటం రెస్కూటీం, తిరుపతి జూపార్కు సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించిరక్షించారు. అనంతరం చికిత్ప చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఎస్వీ జూపార్కుకు తరలించారు. కాగా అటవీప్రాంతంలోఉచ్చు వేసిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేయాలని డీఎఫ్‌ఓ గురుప్రభాకర్ ఆదేశించారు.
వైఎస్‌ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : గానుగపెంట రిజర్వుఫారెస్టు సమీపంలో ఎలుగుబంటి ఉచ్చులో చిక్కుకుందని బుధవారం రాత్రి సమాచారం అందుకున్న స్థానిక అటవీ సిబ్బంది ఎలుగుబంటిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిమ్మచీకటి కావడంతో చేసేది లేక విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు కొంత మంది సిబ్బందిని అక్కడే విధుల్లో ఉండాలని ఆదేశించి సిద్దవటం రెస్కూటీంను, తిరుపతి జూపార్కు సిబ్బందిని రంగంలోకి దింపారు. గురువారం ఉదయం 7 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని కాపాడేందుకు ఉపక్రమించారు. అయితే ఎలుగుబంటి కాలికి ఉచ్చు బలంగా బిగించుకుపోవడంతో సాధ్యపడలేదు. దీంతో జూపార్కు వైద్యులు డాక్టర్ ఆరుణ్‌కుమార్ ఎలుగుబంటికి గన్‌తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన ఎలుగుబంటిని అతి కష్టం మీద ఉచ్చు నుంచి తప్పించి ప్రత్యేక వాహనంలోకి తెచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఫారెస్టుబంగ్లాకు తరలించారు.
మత్తు నుంచి తేరుకున్న ఎలుగుబంటి కాలికి బలమైన గాయం కావడంతో పాటు, విరేచనాలు అవుతుండటంతో నడవలేని స్థితిలో ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఎలుగుబంటిని అటవీప్రాంతం నుంచి తరలించారని సమాచారం తెలుసుకున్న సమీప గ్రామప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వేటగాళ్లపై కేసు నమోదుకు ఆదేశం
వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుందన్న విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ గురుప్రభాకర్ గురువారం ఉదయం బద్వేలు ఎఫ్‌ఆర్‌ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంతలో ఎలుగుబంటిని ఫారెస్టుబంగ్లాకు తీసుకురావడంతో దానిని పరిశీలించి వైద్యుడితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వణ్యప్రాణులను వేటాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, ఇది దురదృష్టకరమన్నారు.అలాగే గానుగపెంట రిజర్వ్‌ఫారెస్టులో వణ్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమీప అటవీప్రాంత ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. ఎలుగుబంటికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు అందించి తిరిగి లంకమల అభయారణ్యంలో వదిలేలా చర్యలు తీసుకోవాలని జూపార్క్ సిబ్బందిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment