ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి దాడి దృశ్యం
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంతో గ్రామానికి చెందిన బైపల్లి శ్యాం జీవితం చీకట్లోకి వెళ్లిపోగా, మరో రెండు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్టణంలోని ఓ ఆస్పత్రి వద్ద, ఒక కుటుంబం శ్రీకాకుళంలో రిమ్స్ ఆస్పత్రి వద్ద కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరో ఇద్దరు తమ ఇళ్ల వద్ద కదలలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
మొత్తం ఆరు కుటుంబాలకు ఎలుగు రూపంలో తీరని కష్టం మిగిల్చింది. జీడితోటలు, సముద్ర తీరంతో ఆనందంగా గడిపే ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం నుంచి విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరి నోట విన్నా అదే కథ. నలుగురు ఒకచోటకు చేరితే ఈ విషాద ఘటనను తలచుకుని బాధ పడుతున్నారు.
గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా గ్రామ పరిధిలో ఒక ఎలుగు సంచరించడం, మనుషులు మాటలు విని వెళ్లిపోతుండంతో, సహజంగా గ్రామస్తులు ఎలుగు అంటే అంత భయపడే వారు కాదు. కాని ఆదివారం నాడు ఎలుగు సృష్టించిన విధ్వంసంతో గ్రామంలో ఎలుగు పేరు చెపితే బయపడే పరిస్థితి వచ్చింది. మందస మండల పరిధిలో రెండు ఎలుగులు సంచరిస్తున్నాయని మంగళవారం వార్త వ్యాపించడంతో ఈ గ్రామంలోని యువత గ్రామం చుట్టూ కర్రలు పట్టుకుని కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది.
శ్యాం జీవితం అంధకారం
బైపల్లి శ్యాంది ఆదివారం ఉదయం వరకు అమ్మ, నాన్నలతో కలిసి ఆనందమయం జీవితం. ఆదివారం ఉదయం ఎలుగు దాడిలో శ్యాం అమ్మ, నాన్న ఊర్మిళ, తిరుపతి మృతి చెందడంతో ఇతడి జీవితం అగమ్యగోచరానికి చేరుకుంది. శ్యాం అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్య ఇదివరలో మృతి చెందడంతో శ్యాం ఒంటరి వాడయ్యాడు.
ఇంట్లో కూర్చుని అమ్మ, నాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నాడు. ఆయన రోదనను ఆపేవారు కూడా లేని పరిస్థితి. ఆయన జీవితానికి దేవుడే దారి చూపాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇలాంటి విషాదం ఏ కుటుంబంలోను చోటు చేసుకోకూడదని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
విశాఖలో కాపలా
అలాగే బైపల్లి అప్పలస్వామి, దుర్యోధన ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలవ్వడంతో విశాఖపట్నం తరలించారు. బైపల్లి అప్పలస్వామి తలకు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధనకు కాలికి తీవ్ర గాయం కావడంతో, కాలు తీయక తప్పలేదని వైద్యాధికారులు తెలిపారు.
దుర్యోధన ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధన, అప్పలస్వామి తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతుండడంతో, వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్నంలో బాధితులు వద్ద ఉంటున్నారు. అలాగే గ్రామానికి చెందిన యువకుడు బైపల్లి రాజేష్ తీవ్రగాయాలతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
మరో ఇద్దరు రట్టి అప్పన్న, బైపల్లి పాపారావు ప్రస్తుతం గాయాలతో ఇంటి వద్ద కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వారి నిత్యవసరాలకు కూడా వేరేవారి సహాయం కోరవలసిన పరిస్థితి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులు పూర్తిగా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉద్దానాన్ని వీడని ఎలుగుల భయం, తీర ప్రాంతంలో హల్‌చల్ చేసిన రెండు ఎలుగులు
మందస: మందస, సోంపేట మండలాలకు ఎలుగుబంట్ల భయం వీడడంలేదు. మూడు రోజుల కిందట సోంపేట, మందస మండలాల్లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి హతమైనప్పటికీ పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లు ఉద్దానం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
మంగళవారం రెండు ఎలుగుబంట్లు సముద్ర తీర ప్రాంతాల్లో హల్‌చల్ చేశాయి. దీంతో తీర ప్రాంతానికి చెందిన ఉద్దానం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడ్డారు. ఉద్దానం కొండలు, జీడితోటల్లో సంచరిస్తున్న రెండు ఎలుగులు దారి తప్పి భేతాళపురం, దున్నవూరు, రట్టి, గంగువాడ తదితర గ్రామాల పరిసరాల్లో తిరిగాయి.
సముద్ర తీరం నుంచి వెళ్తూ, కనిపించిన మత్స్యకారులను భయపెట్టాయి. దీంతో వారు అమ్మో.. ఎలుగులు అంటూ పరుగులు తీశారు. కాగా, ఉద్దానంలో ఎలుగులు మనుషులు హటాత్తుగా కనిపిస్తే తప్ప కావాలని వచ్చి మీద పడి దాడి చేయవు.
అయితే ఎన్నడూలేని విధంగా మూడు రోజుల కిందట కనిపించిన మనుషులు, పశువులు, పెంపుడు జంతువులపై దాడి చేసి మరీ చంపేయ్యడంతో స్థానికులు హతాశులవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్దానంలో జీవించడం కూడా కష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రముక్కాం, పాతపితాళి, దున్నవూరు సంఘటన మరువక ముందే మరో రెంటు ఎలుగుబంట్లు కలకలం సృష్టించడంతో తీరప్రాంతవాసులు, ఉద్దానం ప్రజలకు కంటిమీద కునుకు కరవవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment