దుర్యోధన (ఫైల్‌ఫొటో)
సోంపేట : మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో జూన్ 10న ఎలుగుబంటి దాడిలో గాయపడిన బైపల్లి దుర్యోధన (49) ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందాడు. దీంతో ఎలుగు బీభత్సంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఎర్రముక్కాం, సిరిమామిడి గ్రామాల్లో ఎలుగు దాడి చేసిన ఘటనలో బైపల్లి ఊర్మిళ, తిరుపతి దంపతులు అదే రోజు మృతి చెందగా, తీవ్రంగా గాయపడి కాలును కోల్పోయిన దుర్యోధన 15 రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.
పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈయనకు భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దుర్యోదన బిలాయిలో డ్రైవర్‌గా పనిచేస్తూ వేసవి కావడంతో గ్రామానికి వచ్చాడు. ఇంతలో ఎలుగుబంటి రూపంలో విషాదం ఎదురైంది. సోమవారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, గ్రామ సర్పంచ్ పి.రాజేశ్వరి, జెడ్పీటీసీ ఎస్.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. \
గ్రామంలో విషాదఛాయలు..
ఎలుగు బీభత్సం సృష్టించి 15 రోజులు గడుస్తున్నా గ్రామంలో ఇంకా విషాద ఛాయలే దర్శనమిస్తున్నాయి.రైతు బైపల్లి హేమరాజుకు చెందిన 50 వేల విలువైన ఎడ్లు మృతి చెందాయి. అదే రోజు ఊర్మిళ, తిరుపతి దందపతులు మృతి చెందారు.
బైపల్లి అప్పలస్వామి సెవెన్ హిల్స్‌లో వైద్యం చేయించుకుని, ప్రస్తుతం తమ కుమార్తె నివసిస్తున్న రాయిపూర్‌లో వైద్యం చేయుంచుకుంటున్నారు. దుర్యోదన ఆదివారం మృతి చెందాడు. రట్టి అప్పన్న, బైపల్లి పాపారావులు ప్రస్తుతం ఇంటి వద్ద గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు.
రూ.25 లక్షల పరిహారం అందజేయాలి
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందజేయాలని వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం దుర్యోదన కుటుంభ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి 5 లక్షలు అందజేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం సోంపేట, మందస మండలాల్లో సంచరిస్తున్న ఎలుగులను అటవీ శాఖాధికారులు పట్టుకుని అడవిలో విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment