బస్సు కింద విగతజీవిగా పడి ఉన్న కామమ్మ
కాశీబుగ్గ : నిరుపేద కుటుంబంపై విధి పగబట్టింది. భర్త విదేశాల్లో ఉంటుండగా.. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న పిల్లల కోసం తినుబండారాలు తీసుకుని బయలుదేరిన ఆమె.. బస్సు చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ టెలీఫోన్ ఎక్సే్ఛంజీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో మత్స్యకార మహిళ మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన చింత కామమ్మ (35) కాశీబుగ్గ పట్టణంలో కూరగాయలు, ఇంటి సరుకులు కొనుగోలు చేసి కాశీబుగ్గ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ముందు ఉన్న రోడ్డుపై నడిచి వెళుతోంది.
ఇంతలో పలాస కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ముందు చక్రాలకింద నలిగి పోయింది. ఆమె అక్కడక్కడే మరణించిందని పోలీసులు ధ్రువీకరించారు. కామమ్మ భర్త రాజారావు ఉపాధి నిమిత్తం విదేశాల్లో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ఆమెకు కుమార్తె స్వప్న, కుమారుడు మురళి ఉన్నారు. కామమ్మ వంట మనిషిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఇద్దరు పిల్లల కోసం తిను బండారాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సంచిలో ఉండటాన్ని చూసిన వారంతా కన్నీరు పర్యంతమ య్యారు.
ఆర్టీసీ డిపో మేనేజర్ పెంట శివకుమార్, కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తుల సమక్షంలో పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. సీఐ కె.అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస–కాశీబుగ్గలో రోడ్డు విస్తరణ జరగక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు విస్తరణపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment