లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాశీబుగ్గ: కాశీబుగ్గ బస్టాండ్ ఎదురుగా ఉన్న అప్సర లాడ్జిలో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మందస మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బగాది మోహన్‌రావు(42) గురువారం రాత్రి అప్సర లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే పూటుగా తాగిన మోహన్‌రావు మద్యంతోపాటు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు లాడ్జి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. కాశీబుగ్గ పోలీసులకు తెలియజేశారు.
ఘటన స్థలానికి ఎస్సై కేవీ సురేష్‌కుమార్, కానిస్టేబుల్ డి.సూరిబాబు చేరుకున్నారు. తలుపులను పగలగొట్టి విగతజీవిగా పడి ఉన్న మోహన్‌రావును బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే 108లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికి ప్రథమ చికిత్స అందించడంతో ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. మోహన్‌రావు రామకృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వాచ్‌మన్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది.