పంట పొలాల్లో ఏటీఎం మిషన్
సాక్షి, శ్రీకాకుళం : ఏసీ గదుల్లో, సీసీ ఫుటేజీ కనుసన్నల్లో ఉండాల్సిన ఏటీఎం మిషన్ పంట పొలాల్లో పూర్తిగా ధ్వంసమై లభించిన ఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పంటపొలాల్లో ఏటిఎం మిషన్ సోమవారం దర్శనమిచ్చింది. ఉదయం పంట పొలాలకు వచ్చిన రైతులు మిషన్‌ను గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో కాశీబుగ్గ సీఐ ఆర్.వేణుగోపాలరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఈ ఘటనపై ఎస్పీ అమ్మిరెడ్డికి సమాచారం అందించగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రహదారులను అలెర్ట్ చేసి తనిఖీలు చేపట్టారు. అనంతరం ఘటనా స్థలానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి బ్రాహ్మణతర్లా ఎస్‌బీఐ మేనేజర్, సిబ్బిందిని తీసుకోచ్చి పరిశీలించగా అది ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌గా గుర్తించారు. దీంతో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో ఉన్నటువంటి 19 బ్యాంకులు, 24 ఏటీఎం మిషన్‌లను, పరిసర ప్రాంతాలకు చెందిన ఏటీఎంలను పరిశీలించారు.
పలాసకు క్లూస్ టీమ్ రాక
జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో ఉన్నటువంటి ఏటీఎం విడిభాగాలను ఎవ్వరూ తాకకుండా స్థానికులు రక్షణ కల్పించడంతో శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. మిషన్‌ను వాహనంలో తీసుకొచ్చి పడివేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే శనివారం నాడు ఎచ్చెర్లలో జరిగిన ఏటీఎం చోరీలో మాయమైన క్యాష్ మిషన్ ఇదేనేమో అని అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment