కాసేపట్లో పెళ్లి... ప్రియుడు పరార్
Published Mon, Aug 26 2013 5:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
పలాస,న్యూస్‌లైన్: ప్రేమించాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..వాయిదాలు వేస్తూ వచ్చాడు..విషయం పెద్దల పంచాయితీకి వెళ్లింది.. దీంతో పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆదివారమే పెళ్లికి ముహూర్తం.. కాసేపట్లోనే పరిణయం.. గ్రామ పెద్దల సమక్షంలో ప్రియుడు, ప్రియురాలు కలిసి వివాహం చేసుకోవడానికి గుడికి బయలుదేరారు. మధ్యలో ప్రియుడి మిత్రుడు బైక్‌పై రుయ్యిన దూసుకొచ్చాడు. అంతే వేగంతో దానిపై ప్రియుడు ఎక్కి పరారయ్యాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన పలాసలోని మొగిలిపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు ఈమెకు అండగా నిలిచారు. ప్రియుడి తల్లిదండ్రులు ఇంటికి తాళాలు వేసుకొని బయటకు వెళ్లిపోయారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...బతుకుతెరువుకోసం మొగిలిపాడు గ్రామానికి జలంద్రపాత్రో తల్లిదండ్రులతో పదేళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. డిగ్రీ చదివిన అనంతరం నాలుగేళ్ల కిందట అదే గ్రామంలో సాయి సరస్వతి స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరాడు. అప్పటికే గ్రామానికి చెందిన బర్ల పద్మ కూడా ఆ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఒకేచోట పనిచేస్తున్న వీరిద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి అన్నవరం, కైలాసగిరి తదితర తీర్థయాత్రలకు కూడా వెళ్లారు. వీరి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన పాత్రో గడువులు పెడుతూ వస్తున్నాడు. దీంతో గత ఏప్రిల్ 21న గ్రామపెద్దల సమక్షంలో వీరి పెళ్లి విషయంలో చర్చలు జరిగాయి.
ఆగస్టులో పెళ్లి చేసుకోవడానికి పాత్రో పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు. పెళ్లి సందర్భంగా ఇతనికి పసుపు, కుంకుమల నిమిత్తం రూ.లక్ష నగదు, హోండా షైన్ బైక్, ఒక తులం బంగారం ఇవ్వడానికి కూడా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఆదివారం మొగిలిపాడులోని వినాయక గుడిలో ఉదయం 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. పద్మ, జలంద్రపాత్రోలు గ్రామపెద్దలతో కలిసి వినాయక గుడికి వెళుతుండగా ఆ సమయంలో తన స్నేహితుడు బైక్‌పై వచ్చి పాత్రోను తీసుకొని పరారయ్యాడు. పాత్రో సెల్‌కు గ్రామపెద్దలు, పద్మ ఫోన్ చేసినప్పటికీ తగిన సమాధానం రాలేదు. దీంతో పద్మ అతడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. ఈ సందర్భంగా ఈమె విలేకరులతో మాట్లాడుతూ..
తనను చాలా కాలం నుంచి పాత్రో నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది. చాలా సార్లు పెళ్లిచేసుకుంటానని చెప్పి ఈ విధంగానే తప్పించుకున్నాడని, అతడి తల్లిదండ్రులు కూడా తనను నీచంగా తిడుతున్నారని కన్నీరుపెట్టింది. గ్రామానికి చెందిన కాళీమాతా మహిళా సంఘం అధ్యక్షురాలు బుడత లక్ష్మి, పెళ్లి ఒప్పందం పత్రంలో సంతకాలు పెట్టిన గ్రామ పెద్దలు బి.డిల్లీరావు, బి.కృష్ణారావు, డి.సత్యం, ఎన్.లోకేశ్వరరావు, కె.ప్రకాశ్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ... మా అందరి ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పి, దేవాలయం వరకు వచ్చి ఈ విధంగా తప్పించుకుపోవడం చాలా దారుణమన్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ సీఐ హెచ్.మల్లేశ్వరరావు బర్ల పద్మ మౌన దీక్ష వద్దకు వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే జలంద్రపాత్రోపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామపెద్దలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Advertisement