కాశీబుగ్గ : సహజీవనం చేసిన ప్రియుడు పరారు కావడంతో అతడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్షకు దిగింది. అక్కడ బైఠాయించిన ఈమెపై అతడి తల్లి భానుమతి కత్తితో దాడి చేసింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. శనివారం ఈ సంఘటన పలాస మండలం బ్రాహ్మణతర్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాశీబుగ్గ పోలీసుల వివరాల మేరకు... పలాస మండలం శాశనాం గ్రామానికి చెందిన డొంకాన వనజాక్షి, బ్రాహ్మణతర్లా గ్రామం హరిజనకాలనీకి చెందిన బడియా దిలీప్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ విశాఖపట్నంలో ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం దిలీప్ తల్లి భానుమతి తన కుమారుడిని కారులో బలవంతంగా స్వగ్రామానికి తీసుకొచ్చేసింది. ఇదేక్రమంలో ప్రియురాలు బ్రాహ్మణతర్లా చేరుకుని గ్రామపెద్దలను, మహిళా సంఘాలను ఆశ్రయించింది.
దీంతో వనజకు న్యాయం చేస్తానని వీరి సమక్షంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. ఎన్నికల తర్వాత పరిష్కరించుకుంటామని ఒప్పుకున్న ప్రియుడు ఇంతలోనే పరారయ్యాడు. మరలా న్యాయం కావాలని ప్రియురాలు అతడి ఇంటి వద్దకు చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు భానుమతి, రాజు ఆమెను ఇంటి బయటే ఉంచారు. నాలుగు రోజులుగా స్థానికులు అన్నపానీయాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో దిలీప్ ఫోన్లో సూచించిన మేరకు అతడి తల్లిదండ్రులు ఆమెను శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈమె వెళ్లేందుకు ససేమిరా అనడంతో భానుమతి కత్తెతో దాడి చేసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం స్థానికుల సహకారంతో 108లో పలాస సామాజిక ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ప్రజాసంఘాలు మద్దతు
మోసపోయిన వనజాక్షికి అటు పోలీసులు, ఇటు దిలీప్ కుటుంబ సభ్యులు పట్టించుకోక ఒంటరై మిగిలిందని తక్షణమే న్యాయం చేయాలని మహిళా సంఘాలు, ఐద్వా, మహిళా కమిషన్, మానవహక్కుల కమిషన్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్, న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రియురాలిని మోసం చేసిన దిలీప్‌కు శిక్షపడాలని, దాడికి పాల్పడిన భానుమతికి 307 చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment