సాక్షి, గురజాల: ఒడిశాకు చెందిన మహిళపై లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దుర్ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. సేకరించిన సమాచారం మేరకు ఒడిశాకు చెందిన మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి మాచర్ల ప్యాసింజర్ రైలు నుంచి గురజాల రైల్వే గేట్ హాల్ట్ వద్ద దిగింది. పొట్టకూటి కోసం వచ్చిన ఆమె టికెట్ కౌంటర్ వద్దే రాత్రి నిద్రించింది. ఆ సమయంలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఆమె పడి ఉంది.
శనివారం ఉదయం ఆమె పక్కనే మూడేళ్ల బాలుడు బిక్కచూపులు చూస్తూ కూర్చుండడాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి బాధితురాలిని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. వైద్యురాలు లక్ష్మి యువతికి ప్రాథమిక చికిత్స చేశారు. పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితురాలు మాట్లాడే భాష అర్థం కాకపోవడంతో కొందరు స్థానికులను పిలిపించి విచారణ సాగిస్తున్నారు. మహిళ ఇంకా దిగ్భ్రాంతిలో ఉండడంతో సరైన వివరాలు చెప్పలేకపోతున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. గురజాల డీఎస్పీ బెజవాడ మోహర జయరాం ప్రసాద్, సీఐ రాయన ధర్మేంద్రబాబు, జీఆర్పీ సీఐ టి శ్రీనివాసరావు, ఆర్పీఫ్ సీఐ నాగార్జునరావు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరిసరాల్లో ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment