
స్కూల్ పై నుంచి పడి చిన్నారి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో విషాదం అలుముకుంది. కాశీబుగ్గలోని బాలజ్యోతి హైస్కూల్ రెండో తరగతి విద్యార్థిని మౌనిశ్రీ ప్రమాదవశాత్తు మూడో అంతస్థు నుంచి కిందపడి చనిపోయింది. విద్యార్థిని ఇంటర్ వెల్ సమయంలో తరగతి గదిలోకి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంతో విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలపై దాడికి పాల్పడ్డారు. స్కూలు యాజమాన్య బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందంటూ ఆందోళన చేపట్టారు.
స్కూలు అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా స్కూలు పై అంతస్థులో ప్రహరీ గోడ లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా చిన్నారి మృతి అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ధనార్జన కోసమే స్కూల్ యాజమాన్యాలు పనిచేస్తున్నాయన్నారు. ప్రహరీ గోడ లేని స్కూల్ బిల్డింగ్కు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. ఇందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.