![Mahatma Gandhiji as form of village deity Kasibugga - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/13/gandhi.jpg.webp?itok=qSgz8oub)
మహాత్మా గాంధీ.. ఆ ఊరి వాళ్లకు ఓ శక్తి స్వరూపిణి. అందుకే ఏటా శ్రావణ మాసంలో మొదటి ఆదివారం గాంధీజీని గ్రామ దేవత రూపంలో గాంధమ్మగా కొలుస్తారు. పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న ఆచారం ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఏటా కేదారిపురంలో రైతులు పొలాల్లో నాట్లు వేయడానికి ముందు గాంధమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు.
గాంధీజీ తమ గ్రామంలో శక్తి అవతారం గాంధమ్మగా వెలిశారని.. ఆ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల విశ్వాసం. అందుకే.. తొలకరి వర్షాలు కురిసిన తరువాత దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ప్రతి ఇంటినుంచీ వడపప్పు, పానకాలు, పసుపు నీటితో భారీ ఊరేగింపు నిర్వహించి గ్రామ నడిమధ్యన గాంధీజీ చిత్రపటాన్ని ఉంచి ముర్రాటలు సమర్పిస్తారు.
ఆదివారం నాడు గ్రామంలోని మహిళలంతా ఊరేగింపు నిర్వహించి పూజలు నిర్వహించారు. గాంధమ్మకు నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పంచి పెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ ఊరి వారంతా గాంధేయ వాదులుగా ఉంటూ ఆయనపై అపరిమిత ప్రేమ చూపించేవారు. అవే ఇప్పుడు ఇలా గాంధమ్మ పూజలుగా మారాయి.
– కాశీబుగ్గ
Comments
Please login to add a commentAdd a comment