village god
-
AP: నలభై ఏళ్ల తర్వాత.. ఆ ఊరిలో జాతర
ఎన్టీఆర్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 సంవత్సరాల తరువాత జరగనుంది కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామదేవత వనువులమ్మ తల్లి మహోత్సవం. 1977వ సంవత్సరంలో చివరిసారిగా గ్రామంలో జాతర నిర్వహించినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన చిన్నపాటి విభేదాల కారణంగా 46 ఏళ్లపాటు అమ్మవారి జాతర నిలిచిపోయింది. నాలుగు దశాబ్దాల పైబడి జాతర జరగకపోవడంతో నేటి తరం వారికి అసలు జాతర విశేషాలే తెలియకుండా పోయాయి. దీంతో గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు వచ్చి భావి తరాలకు గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలని జాతర మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. గ్రామదేవత జాతరంటేనే తెలియని చిన్నారులు, యువత, తెలిసీతెలియని వయస్సులో జరిగిన జాతరను తిలకించిన నడివయస్కులు ఇప్పుడు జరగనున్న జాతర ఉత్సవాన్ని కనులారా తిలకించి తరించాలని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి జాతర ప్రారంభం ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యుడు అర్జంపూడి ఏసుబాబు తెలిపారు. 27న అమ్మవారిని గంగా స్నానం చేయించడంతో జాతరకు శ్రీకారం చుడతారు. 28, 29 తేదీలలో గ్రామంలో శ్రీ వనువులమ్మ తల్లికి విశేషమైన పాన్పులు వేస్తారు. 30వ తేదీ ఉదయం చలి నైవేద్యాలు, సాయంత్రం పూలకప్పిరి జరుగుతాయి. 1వ తేదీ ఆదివారం మొక్కుబడులు, నైవేద్యాలతో జాతర ముగుస్తుంది. 2వ తేదీన గ్రామంలో భారీ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ వనువులమ్మతో పాటు గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ, పోతురాజులను సైతం కొలవనున్నారు. తోట వంశస్తులు పుట్టింటివారిగా, పోకలవారు అత్తింటి వారిగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. చాలా మంచి నిర్ణయం నాకు ఆరేళ్ల వయస్సులో జాతర జరిగింది. ఇప్పుడు జరగబోయే జాతర కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఇటువంటి పండుగలు, జాతరలను క్రమం తప్పకుండా చేయడం వల్ల గ్రామంలో ఐక్యత పెరగడంతో పాటు, బంధుత్వాలు బలపడతాయి. – తోట లవ కిషోర్, సీతనపల్లి మన సంస్కృతి తెలపాలి మా పిల్లలు చిన్నతనంలో జాతర చూశారు. మళ్లీ ఇన్నాళ్లకు జాతర చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వనువులమ్మతో పాటు మిగిలిన దేవతలకు జాతర చేస్తారు. రేపటి తరాలకు నాటి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడం పెద్దవాళ్లగా మా బాధ్యత. – అర్జంపూడి సావిత్రమ్మ, సీతనపల్లి -
తిరుపతి గంగమ్మ జాతర మొదలైందహో..
తిరుపతి కల్చరల్: ‘‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. తిరుపతి గంగజాతర చాటింపుతో నేటి నుంచి ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. కనుక నగరవాసులెవరూ ఊరు వదలి వెళ్లరాదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభమైనందున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలహో.’’ అంటూ సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర మంగళవారం అర్ధరాత్రి తర్వాత చాటింపు వేశారు. భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించిన అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్‌పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్ ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ (తిరుపతి గ్రామదేవత) జాతర అత్యంత వేడుకగా ఆరంభమైంది. భక్తకోటి కోర్కెలు తీర్చే కల్పవల్లి, తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనుంది. కొడిస్తంభానికి అభిషేకం, ఒడిబాలు సమర్పణ జాతర ప్రారంభ సన్నాహకాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు ఆలయ ఆవరణలోనున్న అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు అభిషేకం చేసిన అనంతరం కొడిస్తంభానికి ఒడిబాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయరెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ఒడిబాలును నెత్తినపెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణతో కొడిస్తంభం వద్దకు చేరుకొని పూజలు చేసి ఆ ఒడిబాలు సమర్పిం చారు. ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి పొంగళ్లు నైవేద్యాన్ని సమర్పిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కట్టా గోపియాదవ్, ఈవో ఎం.మునిక్రిష్ణయ్య, పాలక మండలి సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాలకగిరి ప్రతాప్‌రెడ్డి, ఆలయ అర్చకుడు రామకృష్ణ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బైరాగి వేషం గంగజాతర ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బుధవారం బైరాగి వేషంతో జాతర ఆరంభమవుతుంది. బైరాగి వేషాలు వేసిన వారు గుంపులు గుంపులుగా బయలుదేరి మొదట వేషాలమ్మను, తర్వాత శ్రీతాళ్లపాక పెద్దగంగమ్మను దర్శించుకొని తర్వాత శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు. కేరింతలు కొడుతూ ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల వద్ద ప్రణమిల్లి మొక్కులు తీర్చుకుంటారు. శ్రీవారి ఆవిర్భావంతోనే గంగావతరణ: గణపతి సచ్చిదానందస్వామి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఏడుకొండలపై శ్రీవేంకటేశ్వరునిగా ఆవిర్భవించడంతోనే తిరుపతిలో గంగమ్మ వెలసిందని గురుదత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి తెలిపారు. మంగళవారం ఆయన శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగమ్మ ఆలయానికి చరిత్రతో పనిలేదని, అమ్మవారి మహిమలే చరిత్రకు ఆధారమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా యావత్ భక్తకోటికి కల్పవల్లిగా విరాజిల్లుతోన్న మహిమాన్విత శక్తి స్వరూపిణి అని తెలిపారు. అమ్మవారి ఆలయం అద్భుత రాతి శిల్పాలతో నేడు నూతన ఆలయంగా పునఃప్రారంభించడం ఆ శ్రీవారు, అమ్మవారి కృపాకటాక్షాలేనన్నారు. ఈ అమ్మవారి విశిష్టత గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో తాము సైతం భాగస్వాములమవుతామన్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ విశిష్టత, వైభవాన్ని దశదిశలా చాటేందుకు వారం రోజుల పాటు ఈ గంగమ్మ ఆలయంలో ప్రవచనం అందిస్తానని తెలిపారు. -
గాంధీ.. ఆ ఊరోళ్లకు గాంధమ్మ
మహాత్మా గాంధీ.. ఆ ఊరి వాళ్లకు ఓ శక్తి స్వరూపిణి. అందుకే ఏటా శ్రావణ మాసంలో మొదటి ఆదివారం గాంధీజీని గ్రామ దేవత రూపంలో గాంధమ్మగా కొలుస్తారు. పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న ఆచారం ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఏటా కేదారిపురంలో రైతులు పొలాల్లో నాట్లు వేయడానికి ముందు గాంధమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. గాంధీజీ తమ గ్రామంలో శక్తి అవతారం గాంధమ్మగా వెలిశారని.. ఆ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల విశ్వాసం. అందుకే.. తొలకరి వర్షాలు కురిసిన తరువాత దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ప్రతి ఇంటినుంచీ వడపప్పు, పానకాలు, పసుపు నీటితో భారీ ఊరేగింపు నిర్వహించి గ్రామ నడిమధ్యన గాంధీజీ చిత్రపటాన్ని ఉంచి ముర్రాటలు సమర్పిస్తారు. ఆదివారం నాడు గ్రామంలోని మహిళలంతా ఊరేగింపు నిర్వహించి పూజలు నిర్వహించారు. గాంధమ్మకు నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పంచి పెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ ఊరి వారంతా గాంధేయ వాదులుగా ఉంటూ ఆయనపై అపరిమిత ప్రేమ చూపించేవారు. అవే ఇప్పుడు ఇలా గాంధమ్మ పూజలుగా మారాయి. – కాశీబుగ్గ -
సమ్మక్క– సారలమ్మలను తూలనాడలేదు
తాడేపల్లిరూరల్: ‘‘సమ్మక్క–సారలమ్మ గ్రామ దేవతలేనని అన్నాం. వారిని చిన్నచూపు చూసినట్టు, తూలనాడినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది పొరపాటు. నేను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించిన సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లం. వారిని చిన్నచూపు చూసే ఆలోచన చేయబోం. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాలతో నా వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదు..’’అని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో ఉన్నవారు వివాదాలకు తావు ఇవ్వరని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారి జ్ఞానానికే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో ఉన్న సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ మధ్య నాపై కొన్ని వివాదాలు వచ్చాయి. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా విన్నప్పుడు ఆ మాటల పూర్వాపరాలు చూడాలి. చిన్న వీడియో చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీ జనాలను ఏదో అన్నట్టుగా, కామెంట్ చేస్తున్నట్టుగా వినపడుతుంది. మేం అటువంటి కామెంట్ చేయం. సమాజ హితంపై కాంక్ష ఉన్నవారైతే.. వచ్చి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలి, సరైన పద్ధతిలో స్పందించాలి. 20 ఏళ్లకు ముందు మాట్లాడిన వీడియో నుంచి దానిని తీశారు. ఆ రోజున మాట్లాడినప్పుడు సమ్మక్క–సారలమ్మ స్వర్గం నుంచి దిగివచ్చిన వారు కాదు, గ్రామ దేవతలేనని అన్నాం. వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కొని భక్తులచేత పూజలందుకుంటున్నారని చెప్పాం. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా వివాదం ఇప్పుడే తగ్గుతోంది. దీంతో ప్రచారం కోసం దీన్ని చర్చకు తీసుకువస్తున్నట్లు కనపడుతోంది. మాకు ఆస్తులేమీ ఉండవు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాకు వ్యక్తిగతఆస్తులేమీ ఉండవు. సేవా కార్యక్రమాలు చేసేప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మాంసం తినవద్దని చెప్పిన మాట వాస్తవమే. కొందరు దానిని వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. సమాజానికి మంచి చేసేవారితో కలిసేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగిణి సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం.. మా జీయర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలు మంత్రోచ్ఛారణ చేయకూడదని చాలామంది అభిప్రాయం. కానీ మేం మహిళలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం. జీయర్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించి.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాం. ఇందులో అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలు ఉన్నారు. మేం మెడికల్ క్యాంప్ పెట్టినపుడు సేవ చేయడానికి వచ్చే వైద్యులు కూడా అనేక వర్గాలకు చెందినవారు ఉంటారు. ఆదివాసులను విమర్శించాల్సిన అవసరం మాకు లేదు’’అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల స్వామి, మాజీ ఎంపీ, జీయర్ ట్రస్ట్ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మా దగ్గర అందరూ సమానమే.. మేం రాజకీయాలకు దూరం. మా దగ్గర అందరూ సమానమే. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక మాకు ఉండదు. ఎవరితోనూ గ్యాప్ అనేది ఉండదు. వివాదాలు ఉండవు. మేమెప్పుడూ దక్షతతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎవరినీ మోసం చేయకుండా ఉంటాం. రాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. వారికి వీరికి దడుస్తూ ఏదో మూలన నక్కి మాట్లాడటం మా చర్రితలో ఎప్పుడూ లేదు. మేం సన్యాసులం.. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మేం ఎవరికీ భయపడబోం.. అలాగే ఎవరి వెంటా పడబోం. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో అహోబిలస్వామి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు -
చెడుచూపు పడనీకు తల్లీ
భారతీయ పురాణాల్లోని ప్రతి దుష్టసంహారం స్త్రీ దేవతల చేతుల మీదుగా జరిగిందే. వారం రోజులుగాతిరుపతిలో జరుగుతున్న గంగమ్మ జాతర కూడా.. మోహోన్మత్తుడైన ఓ పాలెగాడిని గంగమ్మ హతమార్చిన ఇతిహాసమే. తప్పు చేసి, లోపల దాక్కున్న వాడిని బయటికి రప్పించి అతడి తలను తెగనరికిన గంగమ్మ అంశ.. ‘మీటూ’ ముల్లుగర్రతో ‘మర్యాదస్తుల’ ముసుగులను తొలగిస్తున్న నేటి మహిళలోనూ ఉంది. చూడవలసిన జాతర ఇది. చెడు చూపునకు పాతర ఇది. తిరుపతిలో గంగ జాతర జరిగినంత గొప్పగా రాయలసీమలో మరే జాతరా జరగదు. ఈ జాతర తిరుపతి గ్రామ దేవతలైన పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మల పేరున జరుగుతుంది. సాధారణంగా ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న గ్రామ దేవతలకు జాతరలు జరిపిస్తుంటారు. ఆ గ్రామ దేవతలందరూ స్త్రీలే. స్త్రీలే గ్రామ దేవతలుగా ఉండటానికి కారణం లేకపోలేదు. ప్రాచీన మానవుల్లో పురుషుడు వేటకు, యుద్ధాలకు కేటాయింపబడ్డాడు. స్త్రీలకు వ్యవసాయం వదిలి వేయబడింది. అందుకే వ్యవసాయ సంబంధమైన దైవాలు స్త్రీ దేవతలు. వ్యవసాయం ప్రాధాన్యం పెరిగాక ఈ స్త్రీ దేవతలే గ్రామ దేవతలయ్యారు. గ్రామ దేవతలు తమ గ్రామాల్లో సంభవించే కలరా, అమ్మవారు, పశువ్యాధులు వ్యాపించకుండా అరికడతారని, సకాలంలో వర్షాలు పడేటట్టు చేస్తారని ప్రజల విశ్వాసం. అందుకే ఊరి పొలిమేరల్లోనే ఈ గ్రామ దేవతల్ని ప్రతిష్ఠిస్తారు. మానవుల చేత మొట్టమొదట పూజలందుకున్న దేవతలు గ్రామ దేవతలే. ప్రాచీన కాలం నుంచీ నేటి వరకు గ్రామ దేవతలే గ్రామాల్లో ఆధిక్యతను కలిగి ఉన్నారు. గ్రామ దేవత విగ్రహ రూపంలో ఉండాలనే నియమం ఏదీ లేదు. ఆమె ఓ చిన్నరాయి రూపంలో కూడా ఉండొచ్చు. ఆ రాతికి పసువు కుంకుమ బొట్లు పెడతారు. కానీ తిరుపతిలో ఉండే గ్రామ దేవతలందరికీ విగ్రహాలున్నాయి. ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో ఒక్కో చరిత్ర కలిగి ఉంటారు ఈ గ్రామ దేవతలు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు తిరుపతిలోని గంగమ్మకు ఓ ఐతిహ్యం ఉంది. తిరుపతి పొలిమేరల్లో ఏడుగురు గ్రామ దేవతలు ఉన్నారు. ఈ ఏడు మందీ అక్కాచెల్లెళ్లు. వీరు.. పెద్ద గంగమ్మ, అంకాళమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, నేరేళమ్మ, చిన్న గంగమ్మ. అందరిలోకీ చిన్నదైన చిన్న గంగమ్మనే గంగమ్మ అంటారు. వీరందరికీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సోదరుడు. అందుకేనేమో తిరుమల ఆలయం నుంచి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు, చీరలు, గంప, చేటలు గంగమ్మకు పంపిస్తుంటారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలను తాళ్లపాక గంగమ్మ అని, తాతయ్యగుంట గంగమ్మ అని పిలుస్తుంటారు. ఇద్దరిలో చిన్న గంగమ్మే ప్రసిద్ధి. పెద్ద, చిన్న గంగమ్మలకు చెరో చోట ఆలయాలున్నాయి. చిన్న గంగమ్మ పెళ్లి కాని కన్నెపిల్ల. తరుపతిని ఏలే పాలెగాడు ఆమెను మోహించాడు. ఆమె పొందు కోసం పరితపించి ఒకనాడు బలాత్కరించబోయాడు. మహిమోన్నతురాలైన ఆమె, ఆ పాలెగాడిని వారం లోపల హతమారుస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమె మహిమలను తెలుసుకుని పాలెగాడు ప్రాణభీతితో ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు. ఆమె పాలెగాడి కోసం వేట ప్రారంభిస్తుంది. వేషంలో తిరిగితే తనను గుర్తు పట్టలేడని, ఎదురు పడ్డప్పుడు చంపొచ్చని భావిస్తుంది. మొదటి రోజైన బుధవారం నాడు ఉదయం బైరాగి వేషం, సాయంత్రం పాములోళ్ల వేషం వేస్తుంది. గురువారం ఉదయం గొల్లవాని వేషం, సాయంత్రం బండ వేషం వేస్తుంది. అయినా వాడు కనిపించడు. శుక్రవారం ఉదయం కోమటి వేషం, సాయంత్రం తోటి వేషం వేసుకుని ఆ పాలెగాడి కోసం వెదుకుతూ, బండ బూతులు తిడుతూ తిరుగుతుంది. పాలెగాడు బయటికి రాడు. ఇక లాభం లేదనుకుని శనివారం ఉదయం దొర వేషం వేసుకుని వస్తుంది. దొరకు పాలెగాడు సామంతుడవటం వల్ల తన ప్రభువొచ్చాడని భ్రమించి బయటికి వస్తాడు. పాలెగాడు బయటికి రావడంతోనే గంగమ్మ వాడి తలను నరికి హతమారుస్తుంది. ఆదివారం మాతంగి వేషం వేసుకుని వచ్చి పాలెగాడి భార్యకు ఊరట కలిగించి శాంతిస్తుంది. సోమవారం ఉదయం జంగం వేషంతోను, సాయంత్రం సున్నపు కుండలతోనూ వచ్చి, మంగళవారం రాత్రి విశ్వరూపం చూపిస్తుంది. ఇదీ ప్రచారంలో ఉన్న కథ. అవిలాలలో ఆరంభం గంగమ్మ తిరుపతికి మూడు మైళ్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలో పుట్టిందట. అవిలాల గ్రామంలో గంగజాతర చేసిన తర్వాత అక్కణ్ణుంచి తిరుపతికి పసుపు కుంకుమలు తీసుకు వస్తారు. ఆ మంగళవారం రాత్రే తిరుపతిలో చాటింపు వేస్తారు. బుధవారం నుంచి జాతర ప్రారంభం అవుతుంది. ఆలయం తరఫున అధికారికంగా, వంశపారంపర్యంగా ‘కైకల’ కులస్థులు వేషాలను ధరిస్తారు. రజకులు కూడా వారికి తోడుగా వేషాలలో పాల్గొంటారు. తిరుపతి వాస్తవ్యులు, ముఖ్యంగా పిల్లలు బుధవారం తెల్లటి నామం కొమ్ములతో బైరాగి వేషం వేసి, మెడలో రాళ్ల కాయల దండలను ధరించి, దారిలో కనిపించే వారందరినీ ఒక రకపు బూతు మాటలతో తిడతారు. గురువారం ఎర్రటి కుంకుమ ఒంటినిండా పూసుకుని, బండపూలు కట్టుకుని, బండ వేషం వేసుకుని, బండ బూతులు తిడతారు. శుక్రవారం వేప మండలు ధరించి తోటి వేషంతో మరో రకమైన బూతులు తిడతారు. ఒకరోజు తిట్టిన బూతులు మరో రోజు తిట్టకపోవడం గమనించదగ్గ విషయం. గుంపులు గుంపులుగా వేషాలు వేసుకుని ఆడామగా తేడా లేకుండా చెవులు గింగురుమనేటట్లు తిడతారు. అలా తిట్టడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. వేషాలు వేసుకుని వేషాలమ్మని కూడా దర్శిస్తారు. గంగమ్మ కథలో వాస్తవమెంతుందో తెలియదు కానీ, నిజానికి పూర్వం మన నాగరికతను పరిశీలిస్తే దేవాలయాల్లో సంభోగ పూజలు జరిగేవని, అనేక చోట్ల ‘బూతు ఉత్సవాలు’ జరిపించేవారని ఆధారాలున్నాయి. అవి వాస్తవాలన్నట్లు వాటి అవశేషాలు నేటికీ మిగిలే ఉన్నాయి. సంభోగ పూజలతో పాటు తిట్లను కూడా తిడుతూ తమ భక్తిని నిరూపించుకునేవారు నాటి మానవులు. ప్రతిచోట గ్రామ దేవతల ఉత్సవాల్లో వేషాల వాళ్లు బూతులు తిడతారని, రంకులరాటం.. అదే నేటి రంగుల రాట్నం.. దగ్గర మహా ఆవేశంతో స్త్రీ, పురుషులు బూతులు తిట్టేవారని, ఇవి అనాది నుండి వచ్చే ఆచారాలని తాపీ ధర్మారావు గారు తన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ అనే గ్రంథంలో చెప్పారు. అలాగే నేడు కూడా ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రథం ఆగిపోయినప్పుడు జనం బండ బూతులు తిడతారు. తిట్టనివాడిని పాపాత్ముడిగా చూస్తారు అక్కడివారు! బూతు తిట్లు కూడా ఒక రకం పూజలుగా భావించేవారు. సమాజంలో నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ అవన్నీ మనకు అసహ్యంగానే గోచరించవచ్చు. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఆనాటి ఆచారాలు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో మనకు కన్పిస్తూనే ఉంటాయి. చివరిరోజు ప్రధానమైనది తిరుపతి గంగ జాతరలో మొదటి మూడు రోజులే తిట్లమయంగా ఉంటుంది. తర్వాత చాలా సభ్యతతో జాతర ఉత్సవాలు జరుగుతాయి. శనివారం నుంచి రకరకాలుగా జనం వేషాలు వేస్తుంటారు. మగవారు ఆడవేషంతో పాటు.. రాముడు, కృష్ణుడు వంటి అన్ని రకాల దేవుళ్ల వేషం వేస్తుంటారు. ఆదివారం రోజు మొక్కుబడి ఉన్న భక్తులు మాతంగి వేషాలు వేసుకుని వీధుల్లో చిందులు తొక్కుతారు. కైకలవారు వేసే మాతంగి వేషంలో నాలుకకు దబ్బనం గుచ్చుకుని ఊరంతా ప్రదర్శిస్తారు. అలాగే కైకలవారు ‘సున్నపు కుండలు’ వేషం వేసుకుని ఊరు మొత్తం చుడతారు. మంగళవారం ఉదయం భక్తులు తడి బట్టలతో ‘అడుగడుగుకు దండాలు’ పెడుతూ అంగ ప్రదక్షిణ చేస్తారు. ఈ గంగ జాతరలో చివరి రోజైన మంగళవారం చాలా ప్రధానమైనది. ముఖ్యమైనది. ఆ రోజు భక్తుల చప్పరాలు నెత్తిన పెట్టుకుని నాట్యం చేస్తారు. మంగళవారం రోజు పట్టణంలోని ప్రజలు పొట్టేళ్లను, కోళ్లను గంగమ్మకు బలి ఇస్తారు. గుడి ముందరే పొంగళ్లు పెట్టుకుని వస్తారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని స్త్రీలు చక్కగా అలంకరించుకుని ‘వెయ్యికండ్ల దుత్త’ (చిన్న కుండకు సన్న సన్న రంధ్రాలు పెట్టబడ్డ దుత్త) తీసుకుని, అందులోన ‘సలిబిండి ఉండ’ను పెట్టి, మధ్యలో నెయ్యి పోసి, దీపం వెలిగించుకుని, దుత్తను అరిచేతిలో పెట్టుకుని గుడికి వెళ్తారు. మంగళవారం రాత్రి ఓ స్తంభానికి గంగమ్మను బంకమట్టితో పెద్ద బొమ్మగా తయారు చేస్తారు. అర్ధరాత్రి అయ్యాక గంగమ్మ బొమ్మ చెంపను నరికి, ఆ మట్టిని ప్రజల పైకి విసురుతారు. దానిని జనం తొక్కిసలాడి తీసుకుంటారు. ఆ మట్టి వల్ల శుభం కలుగుతుందని ప్రతీతి. చివరికి పేరంటాళ్ల వేషంతో గంగమ్మ జాతర ముగుస్తుంది. ఇదే విధంగా పెద్ద గంగమ్మకు కూడా జరుగుతుంది. కాకపోతే చిన్న గంగమ్మకు ఉన్నంత ప్రాముఖ్యం ఉండదు. జనం ఉండరు. జాతర మొత్తం తాతయ్య గుంట గంగమ్మ అనబడే చిన్న గంగమ్మకే జరుగుతుంది. తిరుపతి గంగ జాతరకు వంద మైళ్ల పరిధి నుంచి జనం తండోపతండాలుగా లక్షమందికి పైగా వస్తారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. ఆధునిక నాకరికత ప్రభావం వల్ల జాతర సందడి కాస్త తగ్గింది. నిజం చెప్పాలంటే భారతదేశంలో వారం రోజుల పాటు ఇంత వైవిధ్యభరితంగా జరిగే జాతర మరెక్కడా లేదు. ఎన్నో వేషాలు, కళారూపాలున్న ఈ జాతరను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీదా ఉంది. – ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు స్టడీస్శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ -
కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి శ్రీమావుళ్లమ్మ తల్లి
అమ్మలగన్న అమ్మగా, కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భీమవరం గ్రామ దేవత శ్రీమావుళ్లమ్మ తల్లి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారి దైవంగా ప్రసిద్ధి. అమ్మ సన్నిధికి వచ్చి తమ బాధలను చెప్పుకుని ఆర్తితో వేడుకుంటే చాలు... చిటికెలో సమస్యలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి వరకు నిత్యం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అంతటి మహిమ గల మూర్తి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉంది. వ్యాపారం ప్రారంభించినా, వివాహాదివేడుకలు చేస్తున్నా, నూతన వాహనాలు కొన్నా, అంతా శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దయ అని చెప్పుకుంటారు స్థానికులు. ఘనంగా ఆరంభమైన వార్షికోత్సవాలుఅమ్మవారి 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమైనాయి. జనవరి 13న మొదలైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి తెలంగాణ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి రోజు పలు సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయగా భక్తులు భారీగా తరలి వచ్చి తిలకిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి, కూరగాయలు, పండ్లు వర్తకం సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ వారు రోజుకు సుమారు 800 మంది భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేస్తున్నారు. వచ్చే నెల 7 తేదీ శ్రీఆదిలక్ష్మీ అమ్మవారి అలంకరణ నుంచి 15 తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారి అలంకరణ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతో అకట్టుకుంటున్నాయి. – బొక్కా రామాంజనేయులు (నాని) ఉత్సవాలు... విశేషాలు ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు విగ్రహం ఎనిమిది అడుగుల మించిన ఎత్తుతో ఉండడం విశేషం. ►అమ్మవారి స్వర్ణ కిరీటం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి కిరీటం కంటే పెద్ద కిరీటమని ప్రతీతి. ►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు. ►భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరుచుటకు నిర్మించిన పూరి గుడి ఉన్న ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట శ్రీమావుళ్లమ్మ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. ►మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభపద్రమైన మామిడి పేరుమీదగా మామిళ్ళ అమ్మగా... అనంతరం మావుళ్లమ్మగా నామాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. ►చిన్న చిన్న ఊళ్ళ వారంతా కలిసి అమ్మవారిని గ్రామ దేవతగా కొలవడం వల్లే మావుళ్ల అమ్మ మావుళ్లమ్మగా నామాంతరం చెందారని మరి కొందరు అభిప్రాయం. ►ఫిబ్రవరి 15న అమ్మవారి ఆలయం వద్ద సుమారు 60 వేలమందికి అఖండ అన్నసమారాధన జరుగుతుంది. -
బోన భాగ్యాలు
ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యాధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు్ట, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమైసమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. ఈ పండుగకే బోనాలపండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి. తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే! మొదట వేడుకలు గోల్కొండ∙జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు నేడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండుగకు వీడ్కోలు పలుకుతారు. పరమాత్మలో చేరే జీవాత్మ బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం. -
గ్రామదేవతా నామ విశేషాలు
♦ ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమంగా ‘తలుపులమ్మ’గా మారింది. ♦ పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే. ♦ సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. ‘మా వూళ్ళన్నింటికీ అమ్మ‘ అనే అర్థంలో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమంగా అది ‘మావుళ్ళమ్మ‘ అయింది. ♦ స్వచ్ఛమెన అమ్మ అనే అర్థంలో అచ్చ(స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. ♦ ప్రతి వ్యక్తికీ ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట(అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమంలో కట్టమైసమ్మ అయింది. ♦ అలాగే ఫుల్ల(వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ. చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. -
కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ దీక్ష
కోవూరు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నియోజకవర్గంలోని మహిళలు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. కోవూరు గ్రామదేవత నాగవరప్పమ్మ గుడి వద్ద ముందుగా ప్రసన్న పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం దీక్ష ప్రారంభిం చారు. ప్రసన్నకు సంఘీభావం తెలిపేందుకు భారీసంఖ్యలో నేతలు, ప్రజ లు తరలి వచ్చారు. సర్వేపల్లి, వెంకటగిరి, నెల్లూరుసిటీ నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పి.అనిల్‌కుమార్‌యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత, నాయకులు రాధాకృష్ణారెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వేమిరెడ్డి వినిత్కుమార్రెడ్డి, మంచి శ్రీనివాసులు, అట్లూరి సుబ్రహ్మణ్యం, రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల సంఘీభావం కోవూరు జేబీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం సాయంత్రం ర్యాలీగా వచ్చి ప్రసన్న కుమార్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. విద్యార్థులు ఒక్కసారిగా జై సమైక్యాంధ్ర నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. దీక్ష శిబిరంలో నేడు గూడూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త పాశం సునీల్‌కుమార్, కొడవలూరు మండలంలోని సర్పంచులు, పార్టీ నాయకులు మంగళవారం ఇక్కడికి వచ్చి ప్రసన్నకుమార్‌రెడ్డి దీక్షకు సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.