ఎన్టీఆర్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 46 సంవత్సరాల తరువాత జరగనుంది కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామదేవత వనువులమ్మ తల్లి మహోత్సవం. 1977వ సంవత్సరంలో చివరిసారిగా గ్రామంలో జాతర నిర్వహించినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన చిన్నపాటి విభేదాల కారణంగా 46 ఏళ్లపాటు అమ్మవారి జాతర నిలిచిపోయింది.
నాలుగు దశాబ్దాల పైబడి జాతర జరగకపోవడంతో నేటి తరం వారికి అసలు జాతర విశేషాలే తెలియకుండా పోయాయి. దీంతో గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు వచ్చి భావి తరాలకు గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయాలని జాతర మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. గ్రామదేవత జాతరంటేనే తెలియని చిన్నారులు, యువత, తెలిసీతెలియని వయస్సులో జరిగిన జాతరను తిలకించిన నడివయస్కులు ఇప్పుడు జరగనున్న జాతర ఉత్సవాన్ని కనులారా తిలకించి తరించాలని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి జాతర ప్రారంభం
ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యుడు అర్జంపూడి ఏసుబాబు తెలిపారు. 27న అమ్మవారిని గంగా స్నానం చేయించడంతో జాతరకు శ్రీకారం చుడతారు. 28, 29 తేదీలలో గ్రామంలో శ్రీ వనువులమ్మ తల్లికి విశేషమైన పాన్పులు వేస్తారు. 30వ తేదీ ఉదయం చలి నైవేద్యాలు, సాయంత్రం పూలకప్పిరి జరుగుతాయి. 1వ తేదీ ఆదివారం మొక్కుబడులు, నైవేద్యాలతో జాతర ముగుస్తుంది. 2వ తేదీన గ్రామంలో భారీ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ వనువులమ్మతో పాటు గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ, పోతురాజులను సైతం కొలవనున్నారు. తోట వంశస్తులు పుట్టింటివారిగా, పోకలవారు అత్తింటి వారిగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు.
చాలా మంచి నిర్ణయం
నాకు ఆరేళ్ల వయస్సులో జాతర జరిగింది. ఇప్పుడు జరగబోయే జాతర కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఇటువంటి పండుగలు, జాతరలను క్రమం తప్పకుండా చేయడం వల్ల గ్రామంలో ఐక్యత పెరగడంతో పాటు, బంధుత్వాలు బలపడతాయి.
– తోట లవ కిషోర్, సీతనపల్లి
మన సంస్కృతి తెలపాలి
మా పిల్లలు చిన్నతనంలో జాతర చూశారు. మళ్లీ ఇన్నాళ్లకు జాతర చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వనువులమ్మతో పాటు మిగిలిన దేవతలకు జాతర చేస్తారు. రేపటి తరాలకు నాటి సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడం పెద్దవాళ్లగా మా బాధ్యత.
– అర్జంపూడి సావిత్రమ్మ, సీతనపల్లి
Comments
Please login to add a commentAdd a comment