చెడుచూపు పడనీకు తల్లీ | Ganga Jatara Festival in Tirupati | Sakshi
Sakshi News home page

చెడుచూపు పడనీకు తల్లీ

Published Mon, May 13 2019 1:09 AM | Last Updated on Mon, May 13 2019 1:09 AM

Ganga Jatara Festival in Tirupati  - Sakshi

భారతీయ పురాణాల్లోని ప్రతి దుష్టసంహారం స్త్రీ దేవతల చేతుల మీదుగా జరిగిందే. వారం రోజులుగాతిరుపతిలో జరుగుతున్న గంగమ్మ జాతర కూడా.. మోహోన్మత్తుడైన ఓ పాలెగాడిని గంగమ్మ హతమార్చిన ఇతిహాసమే. తప్పు చేసి, లోపల దాక్కున్న వాడిని బయటికి రప్పించి అతడి తలను తెగనరికిన గంగమ్మ అంశ.. ‘మీటూ’ ముల్లుగర్రతో ‘మర్యాదస్తుల’ ముసుగులను తొలగిస్తున్న నేటి మహిళలోనూ ఉంది. చూడవలసిన జాతర ఇది. చెడు చూపునకు పాతర ఇది. 

తిరుపతిలో గంగ జాతర జరిగినంత గొప్పగా రాయలసీమలో మరే జాతరా జరగదు. ఈ జాతర తిరుపతి గ్రామ దేవతలైన పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మల పేరున జరుగుతుంది. సాధారణంగా ప్రజలు తమ గ్రామంలో నెలకొన్న గ్రామ దేవతలకు జాతరలు జరిపిస్తుంటారు. ఆ గ్రామ దేవతలందరూ స్త్రీలే. స్త్రీలే గ్రామ దేవతలుగా ఉండటానికి కారణం లేకపోలేదు. ప్రాచీన మానవుల్లో పురుషుడు వేటకు, యుద్ధాలకు కేటాయింపబడ్డాడు. స్త్రీలకు వ్యవసాయం వదిలి వేయబడింది. అందుకే వ్యవసాయ సంబంధమైన దైవాలు స్త్రీ దేవతలు. వ్యవసాయం ప్రాధాన్యం పెరిగాక ఈ స్త్రీ దేవతలే గ్రామ దేవతలయ్యారు.

గ్రామ దేవతలు తమ గ్రామాల్లో సంభవించే కలరా, అమ్మవారు, పశువ్యాధులు వ్యాపించకుండా అరికడతారని, సకాలంలో వర్షాలు పడేటట్టు చేస్తారని ప్రజల విశ్వాసం. అందుకే ఊరి పొలిమేరల్లోనే ఈ గ్రామ దేవతల్ని ప్రతిష్ఠిస్తారు. మానవుల చేత మొట్టమొదట పూజలందుకున్న దేవతలు గ్రామ దేవతలే. ప్రాచీన కాలం నుంచీ నేటి వరకు గ్రామ దేవతలే గ్రామాల్లో ఆధిక్యతను కలిగి ఉన్నారు. గ్రామ దేవత విగ్రహ రూపంలో ఉండాలనే నియమం ఏదీ లేదు. ఆమె ఓ చిన్నరాయి రూపంలో కూడా ఉండొచ్చు. ఆ రాతికి పసువు కుంకుమ బొట్లు పెడతారు. కానీ తిరుపతిలో ఉండే గ్రామ దేవతలందరికీ విగ్రహాలున్నాయి. ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో ఒక్కో చరిత్ర కలిగి ఉంటారు ఈ గ్రామ దేవతలు. 

ఏడుగురు అక్కాచెల్లెళ్లు
తిరుపతిలోని గంగమ్మకు ఓ ఐతిహ్యం ఉంది. తిరుపతి పొలిమేరల్లో ఏడుగురు గ్రామ దేవతలు ఉన్నారు. ఈ ఏడు మందీ అక్కాచెల్లెళ్లు. వీరు.. పెద్ద గంగమ్మ, అంకాళమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, నేరేళమ్మ, చిన్న గంగమ్మ. అందరిలోకీ చిన్నదైన చిన్న గంగమ్మనే గంగమ్మ అంటారు. వీరందరికీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సోదరుడు. అందుకేనేమో తిరుమల ఆలయం నుంచి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు, చీరలు, గంప, చేటలు గంగమ్మకు పంపిస్తుంటారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలను తాళ్లపాక గంగమ్మ అని, తాతయ్యగుంట గంగమ్మ అని పిలుస్తుంటారు. ఇద్దరిలో చిన్న గంగమ్మే ప్రసిద్ధి. పెద్ద, చిన్న గంగమ్మలకు చెరో చోట ఆలయాలున్నాయి. చిన్న గంగమ్మ పెళ్లి కాని కన్నెపిల్ల. తరుపతిని ఏలే పాలెగాడు ఆమెను మోహించాడు.

ఆమె పొందు కోసం పరితపించి ఒకనాడు బలాత్కరించబోయాడు. మహిమోన్నతురాలైన ఆమె, ఆ పాలెగాడిని వారం లోపల హతమారుస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆమె మహిమలను తెలుసుకుని పాలెగాడు ప్రాణభీతితో ఆమెకు కనిపించకుండా దాక్కుంటాడు. ఆమె పాలెగాడి కోసం వేట ప్రారంభిస్తుంది. వేషంలో తిరిగితే తనను గుర్తు పట్టలేడని, ఎదురు పడ్డప్పుడు చంపొచ్చని భావిస్తుంది. మొదటి రోజైన బుధవారం నాడు ఉదయం బైరాగి వేషం, సాయంత్రం పాములోళ్ల వేషం వేస్తుంది. గురువారం ఉదయం గొల్లవాని వేషం, సాయంత్రం బండ వేషం వేస్తుంది. అయినా వాడు కనిపించడు. శుక్రవారం ఉదయం కోమటి వేషం, సాయంత్రం తోటి వేషం వేసుకుని ఆ పాలెగాడి కోసం వెదుకుతూ, బండ బూతులు తిడుతూ తిరుగుతుంది.

పాలెగాడు బయటికి రాడు. ఇక లాభం లేదనుకుని శనివారం ఉదయం దొర వేషం వేసుకుని వస్తుంది. దొరకు పాలెగాడు సామంతుడవటం వల్ల తన ప్రభువొచ్చాడని భ్రమించి బయటికి వస్తాడు. పాలెగాడు బయటికి రావడంతోనే గంగమ్మ వాడి తలను నరికి హతమారుస్తుంది. ఆదివారం మాతంగి వేషం వేసుకుని వచ్చి పాలెగాడి భార్యకు ఊరట కలిగించి శాంతిస్తుంది. సోమవారం ఉదయం జంగం వేషంతోను, సాయంత్రం సున్నపు కుండలతోనూ వచ్చి, మంగళవారం రాత్రి విశ్వరూపం చూపిస్తుంది. ఇదీ ప్రచారంలో ఉన్న కథ. 

అవిలాలలో ఆరంభం
గంగమ్మ తిరుపతికి మూడు మైళ్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలో పుట్టిందట. అవిలాల గ్రామంలో గంగజాతర చేసిన తర్వాత అక్కణ్ణుంచి తిరుపతికి పసుపు కుంకుమలు తీసుకు వస్తారు. ఆ మంగళవారం రాత్రే తిరుపతిలో చాటింపు వేస్తారు. బుధవారం నుంచి జాతర ప్రారంభం అవుతుంది. ఆలయం తరఫున అధికారికంగా, వంశపారంపర్యంగా ‘కైకల’ కులస్థులు వేషాలను ధరిస్తారు. రజకులు కూడా వారికి తోడుగా వేషాలలో పాల్గొంటారు. తిరుపతి వాస్తవ్యులు, ముఖ్యంగా పిల్లలు బుధవారం తెల్లటి నామం కొమ్ములతో బైరాగి వేషం వేసి, మెడలో రాళ్ల కాయల దండలను ధరించి, దారిలో కనిపించే వారందరినీ ఒక రకపు బూతు మాటలతో తిడతారు.

గురువారం ఎర్రటి కుంకుమ ఒంటినిండా పూసుకుని, బండపూలు కట్టుకుని, బండ వేషం వేసుకుని, బండ బూతులు తిడతారు. శుక్రవారం వేప మండలు ధరించి తోటి వేషంతో మరో రకమైన బూతులు తిడతారు. ఒకరోజు తిట్టిన బూతులు మరో రోజు తిట్టకపోవడం గమనించదగ్గ విషయం. గుంపులు గుంపులుగా వేషాలు వేసుకుని ఆడామగా తేడా లేకుండా చెవులు గింగురుమనేటట్లు తిడతారు. అలా తిట్టడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. వేషాలు వేసుకుని వేషాలమ్మని కూడా దర్శిస్తారు. గంగమ్మ కథలో వాస్తవమెంతుందో తెలియదు కానీ, నిజానికి పూర్వం మన నాగరికతను పరిశీలిస్తే దేవాలయాల్లో సంభోగ పూజలు జరిగేవని, అనేక చోట్ల ‘బూతు ఉత్సవాలు’ జరిపించేవారని ఆధారాలున్నాయి. అవి వాస్తవాలన్నట్లు వాటి అవశేషాలు నేటికీ మిగిలే ఉన్నాయి. సంభోగ పూజలతో పాటు తిట్లను కూడా తిడుతూ తమ భక్తిని నిరూపించుకునేవారు నాటి మానవులు.

ప్రతిచోట గ్రామ దేవతల ఉత్సవాల్లో వేషాల వాళ్లు బూతులు తిడతారని, రంకులరాటం.. అదే నేటి రంగుల రాట్నం.. దగ్గర మహా ఆవేశంతో స్త్రీ, పురుషులు బూతులు తిట్టేవారని, ఇవి అనాది నుండి వచ్చే ఆచారాలని తాపీ ధర్మారావు గారు తన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?’ అనే గ్రంథంలో చెప్పారు. అలాగే నేడు కూడా ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రథం ఆగిపోయినప్పుడు జనం బండ బూతులు తిడతారు. తిట్టనివాడిని పాపాత్ముడిగా చూస్తారు అక్కడివారు! బూతు తిట్లు కూడా ఒక రకం పూజలుగా భావించేవారు. సమాజంలో నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ అవన్నీ మనకు అసహ్యంగానే గోచరించవచ్చు. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఆనాటి ఆచారాలు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో మనకు కన్పిస్తూనే ఉంటాయి. 

చివరిరోజు ప్రధానమైనది
తిరుపతి గంగ జాతరలో మొదటి మూడు రోజులే తిట్లమయంగా ఉంటుంది. తర్వాత చాలా సభ్యతతో జాతర ఉత్సవాలు జరుగుతాయి. శనివారం నుంచి రకరకాలుగా జనం వేషాలు వేస్తుంటారు. మగవారు ఆడవేషంతో పాటు.. రాముడు, కృష్ణుడు వంటి అన్ని రకాల దేవుళ్ల వేషం వేస్తుంటారు. ఆదివారం రోజు మొక్కుబడి ఉన్న భక్తులు మాతంగి వేషాలు వేసుకుని వీధుల్లో చిందులు తొక్కుతారు. కైకలవారు వేసే మాతంగి వేషంలో నాలుకకు దబ్బనం గుచ్చుకుని ఊరంతా ప్రదర్శిస్తారు. అలాగే కైకలవారు ‘సున్నపు కుండలు’ వేషం వేసుకుని ఊరు మొత్తం చుడతారు. మంగళవారం ఉదయం భక్తులు తడి బట్టలతో ‘అడుగడుగుకు దండాలు’ పెడుతూ అంగ ప్రదక్షిణ చేస్తారు. ఈ గంగ జాతరలో చివరి రోజైన మంగళవారం చాలా ప్రధానమైనది. ముఖ్యమైనది. ఆ రోజు భక్తుల చప్పరాలు నెత్తిన పెట్టుకుని నాట్యం చేస్తారు.

మంగళవారం రోజు పట్టణంలోని ప్రజలు పొట్టేళ్లను, కోళ్లను గంగమ్మకు బలి ఇస్తారు. గుడి ముందరే పొంగళ్లు పెట్టుకుని వస్తారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని స్త్రీలు చక్కగా అలంకరించుకుని ‘వెయ్యికండ్ల దుత్త’ (చిన్న కుండకు సన్న సన్న రంధ్రాలు పెట్టబడ్డ దుత్త) తీసుకుని, అందులోన ‘సలిబిండి ఉండ’ను పెట్టి, మధ్యలో నెయ్యి పోసి, దీపం వెలిగించుకుని, దుత్తను అరిచేతిలో పెట్టుకుని గుడికి వెళ్తారు. మంగళవారం రాత్రి ఓ స్తంభానికి గంగమ్మను బంకమట్టితో పెద్ద బొమ్మగా తయారు చేస్తారు. అర్ధరాత్రి అయ్యాక గంగమ్మ బొమ్మ చెంపను నరికి, ఆ మట్టిని ప్రజల పైకి విసురుతారు. దానిని జనం తొక్కిసలాడి తీసుకుంటారు. ఆ మట్టి వల్ల శుభం కలుగుతుందని ప్రతీతి. చివరికి పేరంటాళ్ల వేషంతో గంగమ్మ జాతర ముగుస్తుంది.

ఇదే విధంగా పెద్ద గంగమ్మకు కూడా జరుగుతుంది. కాకపోతే చిన్న గంగమ్మకు ఉన్నంత ప్రాముఖ్యం ఉండదు. జనం ఉండరు. జాతర మొత్తం తాతయ్య గుంట గంగమ్మ అనబడే చిన్న గంగమ్మకే జరుగుతుంది. తిరుపతి గంగ జాతరకు వంద మైళ్ల పరిధి నుంచి జనం తండోపతండాలుగా లక్షమందికి పైగా వస్తారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. ఆధునిక నాకరికత ప్రభావం వల్ల జాతర సందడి కాస్త తగ్గింది. నిజం చెప్పాలంటే భారతదేశంలో వారం రోజుల పాటు ఇంత వైవిధ్యభరితంగా జరిగే జాతర మరెక్కడా లేదు. ఎన్నో వేషాలు, కళారూపాలున్న ఈ జాతరను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీదా ఉంది. 

– ప్రొఫెసర్‌ పేట శ్రీనివాసులు రెడ్డి 
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు స్టడీస్‌శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement