చెరువులో ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం
కాశీబుగ్గ: చట్టాల అతిక్రమణ, ఆస్తుల ఆక్రమణ.. సమాజంలో ఏ మాత్రం పలుకుబడి ఉన్నా, రాజకీయంగా పరిచయాలు ఉన్నా చేసే పనులివేనని మాటిమాటికీ రుజువవుతోంది. తాజాగా కాశీబుగ్గలోని దోయిసాగరం ఉదంతం బయటపడింది. రెండు ఎకరాల మేరకు ఆక్రమణలు జరగ్గా.. అధికారులు స్పందించడంతో ఆక్రమణల్లో కొంత భాగాన్ని రక్షించ గలిగారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఆక్రమణ లో ఉన్న వారంతా ‘పెద్దవారే’నని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆక్రమించిన వారిలో ఉన్నారని వారంటున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో అనేక పెద్ద సాగరాలు ఉన్నా కాశీబుగ్గకు తూర్పుభాగాన ఉన్నటువంటి దోయిసాగరం ముఖ్యమైనది.
ఈ సాగరం ప్రస్తు తం 3వవార్డు పరిధి అంబుసోలి దళిత గ్రామానికి ఆనుకుని ఉంది. సర్వే నంబర్ 243/2 ప్రకారం 37 ఎకరాల సాగరమిది. దీని ఆ యకట్టు పరిధిలో తాళ్లభద్ర, అంబుసోలి, నర్సిపురం, చిన్నబడాం, పద్మనాభపురం రైతులు సుమారు 200 ఎకరాల భూములను సాగు చేస్తున్నారు. ఈ సాగరంలో సుమారు రెండెకరాల స్థలం ఆక్రమణలకు గురైంది. కాశీబుగ్గ–అక్కుపల్లి బీటీ రోడ్డుకు ఆనించి ఉన్న స్థలా న్ని కొందరు ఐదేళ్లుగా క్రమక్రమంగా ఆక్రమిస్తూ వస్తున్నారు. గడిచిన ఎన్నికల ముందు కోడ్ ఉన్నా కూడా వదలకుండా రెండెకరాలకు పైగా స్థలాన్ని అక్రమంగా కట్టడాలు కూడా కట్టేశారు.
రూ.3 కోట్లు పలుకుతున్న స్థలం..
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు–చెట్టు మొదలుపెట్టారు. అప్పటికే ఈ చెరువుపై కన్నేసిన స్థానిక పెద్దలు ఇక్కడ నీరు చెట్టు కార్యక్రమాలేవీ చేపట్టలేదు. ఎన్నికల సమయంలో రాత్రి వేళ అక్రమ కట్టడాలు కట్టి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ స్థలం దాదాపు రూ.3కోట్లు పలుకుతుంది. ఈ ఆక్రమణలో స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ నాయకుల పాత్ర ఉందని స్థానికులంటున్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు రిజిస్టేషన్లు జరుపుతున్న ముఠా పలాసలో వీరికి సహకరిస్తోంది. డీ–పట్టా భూములను, చెరువు గర్భాలను, గ్రామ కంఠాలను లింక్ డాక్యుమెంట్‌లతో మార్పులు చేర్పులు చేసి అమ్మకాలు జరుపుతున్నారు.
స్పందనలో కలెక్టర్‌కు వినతి..
దోయిసాగరంలో నీటిమట్టం స్థిరంగా ఉంటేనే తమ పంటలకు సా గునీరు అందుతుందని అంబుసోలి, ఇతర గ్రామస్తులు భావించా రు. ఆక్రమణ విషయం ఎప్పటి నుంచో తెలిసినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీక ఊరుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘స్పందన’ కార్యక్రమం ప్రారంభించడంతో నేరుగా కలెక్టర్‌కు వెళ్లి ఫిర్యాదు చేశా రు. అంతకుముందు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌నే సంప్రదించారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జె.నివాస్ టెక్కలి ఆర్డీఓ కిశోర్‌కుమార్‌కు దీనిపై దర్యాప్తు చే యాల్సిందిగా ఆదేశించారు. ఆయన పలాస తహసీల్దార్ కార్యాల యం నుంచి రికార్డులను తెప్పించుకుని, సర్వేయర్ చంద్రశేఖర్‌తో ప రిశీలించి అక్రమ కట్టడంగా గుర్తించి తొలగించారు. ఆక్రమణదారు లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తొలగించడం సులభమైంది.
పూర్తిగా ఆక్రమణలు తొలగించి లోతు చేయాలి..
ప్రస్తుతం గ్రామంలో ఉన్న దోయిసాగరం 37 ఎకరాలకు 35 ఎకరాలు మాత్రమే మిగిలింది. రూ.65లక్షలు విలువ పలికే 80 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుగల ఆక్రమిత ప్రాంతాన్ని తొలగించారు. మిగిలిన ఆక్రమణలు తొలగించడానికి వారం గడువి చ్చారు. ఇప్పటికీ పూర్తిగా తొలగింపులు జరగడం లేదు. ఆలస్యం చేయకుండా సాగరంలో ఉన్న ఆక్రమణలు తొలగించి వెంటనే చెరువును లోతు చేయించి చుట్టూ గట్టు ఏర్పాటు చేయాలి.
– తెప్ప గణేష్, నీటిసంఘ అధ్యక్షులు, నర్సిపురం
ఆక్రమణ తొలగిస్తాం
పలాస తహసీల్దారు పరిధిలో ఉన్న దోయిసాగరం 243/2 సర్వే నంబర్‌లో ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే. ప్రస్తుతం వాటిని తొలగించాం. మిగిలిన డాక్యుమెంట్లు చూసి తప్పనిసరిగా ఆక్రమణలను తొలగిస్తాం. ఈ ఆక్రమణలో ఎంతటివారున్నా న్యాయపరమైన చర్యలు చేపడతాం. వారం రోజులు గడువు ఇచ్చాము. సరైన పత్రాలు తీసుకురాకుంటే ఆక్రమిత స్థలంగా భావించి వాటిని తొలగిస్తాం.
– కిశోర్‌కుమార్, ఆర్డీఓ, టెక్కలి
Comments
Please login to add a commentAdd a comment