యాచకవృత్తి చేస్తున్న పిల్లలను పట్టుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది
పలాస : కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలోని సంతోషిమాత గుడి వద్ద యాచక వృత్తి చేస్తూ కనిపించిన ఐదుగురు బాల కార్మికులను చైల్డ్‌లైన్ సిబ్బంది గుర్తించి కాశీబుగ్గ పోలీసుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లా సమాలికా గ్రామానికి చెందిన ప్రియాంక(4), సోను(10), జగన్(7), రాహుల్(5), సకీనా(2) పిల్లలను చైల్డ్‌లైన్ టీము లీడర్ బమ్మిడి అరుణ పట్టుకున్నారు.
చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జె.భాగ్యలక్ష్మి, ప్రతినిధి పి.కామేష్‌లు కలిసి కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు పిల్లలను తీసుకెళ్లి అక్కడ నుంచి పోలీసుల సహకారంతో శ్రీకాకుళం బాలల సంరక్షణ సంఘానికి అప్పగించడానికి వెళ్లారు. పిల్లల చేత యాచక వృత్తి చేయిస్తూ తండ్రిగా చెప్పుకుంటున్న కర్తార్‌సింగ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల చేత యాచక వృత్తి చేయడంగానీ, బాలకార్మికులుగా ఇతర పనులు చేయించినా చట్టరీత్యా నేరమని, అందుకు బాలల సంక్షేమ సంఘానికి అప్పగిస్తున్నట్టు చెప్పారు.