పశ్చిమగోదావరి జిల్లా పేకాటక్లబ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. రిక్రియేషన్ ముసుగులో జూదక్రీడయథేచ్ఛగా జరిగిపోతోంది. ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధులఅండతో ఈ జూదం సాగుతోంది.దీనికి పోలీసుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలూ రావడం లేదు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉంగుటూరు నియోజకవర్గంలో∙భీమడోలు, నారాయణపురంలో రెండు క్లబ్‌లు నడుస్తున్నాయి. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో ఒక పేకాట క్లబ్ నడుస్తోంది. ప్రతినెలా క్లబ్ లాభాల్లో 30 శాతం వాటా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ముట్టచెబుతుండగా, పెద్దమొత్తంలో పోలీసులకు కమీషన్లు వెళ్తుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే!
ప్రజాప్రతినిధులు అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లాలో పేకాటను ప్రజాప్రతినిధులే తమ అనుచరులతో నిర్వహింపజేస్తున్నారు. గతంలో కైకలూరులో తన కార్యాలయంలోనే పేకాట క్లబ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి బాబు నిర్వహించిన సంగతి తెలిసిందే. గోపాలపురం నియోజకవర్గంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన ఒక పోలీసు అధికారిని వీఆర్‌లో పెట్టడం, తర్వాత వేరే కారణాలు చూపించి సస్పెండ్ చేయడం జరిగి పోయింది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో సాగుతున్న పేకాటవైపు పోలీసులు తొంగిచూడటం లేదు. చిన్నచిన్న పేకాట స్థావరాలపై దాడులకు పరిమితమవుతున్నారు. తాజాగా ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో పేకాట క్లబ్‌లలో కోతముక్క ఆట యథేచ్ఛగా జరిగిపోతోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలు, నారాయణపురంలో పేకాట సాగుతోంది. గతంలో నారాయణపురంలోని పేకాట క్లబ్‌ను సాక్షిలో వచ్చిన కథనాల వల్ల కొంతకాలం నిలిపివేశారు. ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధి భరోసా ఇవ్వడంతో మళ్లీ మొదలుపెట్టారు.
అర్ధరాత్రి వరకూ..!
భీమడోలు టౌన్‌హాలులో ప్రతి రోజూ ఉదయం నుంచి అర్ధరాతి వరకూ పేకాట సాగుతోంది. పేకాట రాయుళ్ల నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.200 వసూలు చేస్తున్నారు. వీరికి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో 12 బోర్డులలో ఆటజరుగుతోంది. ఇక్కడ పెద్ద మొత్తంలో ఆడేవారికే అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఆటలోనూ తీత పేరుతో కమీషన్ తీసుకుంటారు. ఈ విధంగా వచ్చే కమీషనే ఒక్కో క్లబ్‌లో రోజుకు మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. వచ్చిన డబ్బుల్లో ఖర్చులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారు. దీనిలో స్థానిక ప్రజాప్రతినిధికి 50 శాతం వరకూ చెల్లిస్తున్నారని సమాచారం. 20 శాతం మిగిలిన మొత్తాన్ని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కోశాధికారి తీసుకుంటుండగా, మిగిలిన మొత్తాన్ని పోలీసులకు వాటా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఒక అధికారికి మూడు నెలలకు రూ.పది లక్షలు ఇస్తుండగా స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి 25 వేల రూపాయల వరకూ కిందిస్థాయి వరకూ వాటాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాము మామూళ్లు ఇస్తున్నందున తమపై దాడులు జరగవని నిర్భయంగా పేకాట అడుకోవచ్చంటూ నిర్వాహకులు పేకాట రాయుళ్లకు అభయం ఇస్తున్నారు. దీంతో ప్రతిరోజూ 150 మంది నుంచి రెండు వందల మంది వరకూ విజయవాడ, ఖమ్మం, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు తరలి వస్తున్నారు. దీంతో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కార్లు అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇటీవల పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న టౌన్‌హాళ్లు, క్లబ్‌లపై దాడులు జరిపిన సమయంలో కూడా వీటిపై దాడులు చేయకపోవడం, వీటివైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment