నగరంలో రుద్రంపేటలో లోటస్‌గ్రాండ్ లాడ్జిలో ఈ నెల 17న పేకాట ఆడుతున్న 16 మందిని నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.78,300 స్వాధీనం చేసుకున్నారు. గతంలో నగరంలో త్రీస్టార్ హోటల్ మాసినేని గ్రాండ్ హోటల్‌లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు చేసి దాదాపు 20 మందిని అరెస్ట్ చేసి, రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే దారిలో పలు లాడ్జీలు ఎప్పటినుంచే వ్యభిచారానికి అడ్డాగా మారాయి. ఆ దారి వెంబడి కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్లాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. కొంతమంది మహిళలు రోడ్లపై నిల్చుని యువకులను కవ్విస్తూ కనిపిస్తుంటారు. అర్ధరాత్రి అయితే మరీ ఎక్కువ. వీరంతా లాడ్జీలనే కేరాఫ్‌గా మార్చుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అనంతపురం సెంట్రల్: అనంతపురంలో పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్న కొంతమంది లాడ్జి యజమానులు శాంతిభద్రతలతో పనిలేకుండా సంఘ విద్రోహకశక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీంతో లాడ్జీలు పేకాట, మట్కా, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నగరంలో ఒకప్పుడు 50లోపు లాడ్జీలు ఉండగా.. ప్రస్తుతం 70కు పైగా పెరిగాయి. ఎక్కువ శాతం లాడ్జీల యజమానులు నిబంధనలను పాటించడం లేదు. లాడ్జీలకు ఎవరు వచ్చి వెళుతున్నారనే విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నగరంలో అద్దెకు ఇళ్లు దొరకాలంటే గగనం. సవాలక్ష వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే ప్రజలు ఇళ్లు అద్దెకు ఇస్తున్నారు. కానీ లాడ్జీల్లో ఇవేమీ అక్కర్లేదు. వారు అడిగినంత డబ్బులిస్తే ఏం చేసుకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అటకెక్కిన లాడ్జి మానిటరింగ్ సిస్టం యాప్
లాడ్జీల్లో వరుస నేరాలు జరగుతుండడంతో టెక్నాలజీ సహకారంతో పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ‘లాడ్జి మానిటరింగ్ సిస్టం’ యాప్ రూపొందించారు. లాడ్జిలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారనే విషయాలు ఆధార్‌కార్డు ఆధారంగా తప్పనిసరిగా ఈ యాప్‌లో నమోదు చేయాలి. దీని వలన నేరస్తులు స్థావరంగా మార్చుకుని ఉంటే సులభంగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వేళ నేరం జరిగిపోయిన తర్వాత కూడా దర్యాప్తు చేయడానికి వీలుంటుంది. అయితే దీని వలన ఆదాయం కోల్పోతామనే దురుద్దేశంతో లాడ్జి యజమానులు యాప్‌ను అటకెక్కించారు.
నామమాత్రంగా వివరాల నమోదు
లాడ్జీల్లో నామమాత్రంగా మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఒక్కోలాడ్జిలో 20 నుంచి 30 మంది ఒక రూం అద్దెకు తీసుకుంటూ పేకాట ఆడుతున్నా పట్టించుకోకపోవడం. కొన్ని లాడ్జీలో ఆటకు ఇంత ఇవ్వాలనే బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు కొన్ని లాడ్జీల్లో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందుతున్నా వారి వివరాలు తేలడం లేదు. గత నెలలో శ్రీకంఠం సర్కిల్‌లోని ఓ లాడ్జిలో వ్యక్తి మృతి చెందితే ఇప్పటికీ సదరు వ్యక్తి ఎవరన్నది దర్యాప్తులో తేలలేదు. లాడ్జి మానిటరింగ్ యాప్ పక్కాగా అమలైతే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిఘా మరింత కట్టుదిట్టం
లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం. ఇటీవల లాడ్జీల యజమానులతో సమావేశం నిర్వహించి గట్టిగా ఆదేశాలు జారీ చేశాం. లాడ్జి మానిటరింగ్ యాప్‌ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నాం. నేరాలను ప్రోత్సహిస్తే లాడ్జి యజమానులపై కేసులు నమోదు చేస్తాం. – వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment