సాక్షి, సిటీబ్యూరో: కారు డ్రైవింగ్ వృత్తిగా ఉన్న ఓ వ్యక్తి పేకాట శిబిరాన్ని నిర్వహించడం ప్రవృత్తిగా చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాలు సాగించే వారు సాధారణంగా ఒక్కో ఆట నుంచి కొంత మొత్తం కమీషన్ తీసుకుంటారు. ఇతగాడు మాత్రం తన డెన్‌లోకి రావాలంటే రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్దేశించి వసూలు చేస్తున్నాడు. బొల్లారం, కలాసీగూడలోని ఈ శిబిరంపై దాడి చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మంది పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. వీరి నుంచి రూ.1.87 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలాసీగూడకు చెందిన ధర్మేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఇతడికి పేకాట ఆడే అలవాటు ఉంది.
కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడికి కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. తానే ఓ నిర్వాహకుడిగా మారి పేకాట శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటినే డెన్‌గా మార్చేసిన ధర్మేష్ పరిచయస్తులు, స్నేహితుల్లో పేకాట ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాడు. శిబిరంలోకి రావడానికి ఒక్కొక్కరి నుంచి రూ.500 ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నాడు. వారితో మూడు ముక్కలాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో దాడి చేశారు. ధర్మేష్‌తో పాటుపేకాట ఆడటానికి వచ్చిన 11 మందినిపట్టుకున్నారు. వీరి నుంచి నగదు, పేకముక్కలు తదితరాలు స్వా«ధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బొల్లారం పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment