entry fees
-
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
ఎంట్రీ ఫీజ్... రూ.500!
సాక్షి, సిటీబ్యూరో: కారు డ్రైవింగ్ వృత్తిగా ఉన్న ఓ వ్యక్తి పేకాట శిబిరాన్ని నిర్వహించడం ప్రవృత్తిగా చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాలు సాగించే వారు సాధారణంగా ఒక్కో ఆట నుంచి కొంత మొత్తం కమీషన్ తీసుకుంటారు. ఇతగాడు మాత్రం తన డెన్లోకి రావాలంటే రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్దేశించి వసూలు చేస్తున్నాడు. బొల్లారం, కలాసీగూడలోని ఈ శిబిరంపై దాడి చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మంది పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. వీరి నుంచి రూ.1.87 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలాసీగూడకు చెందిన ధర్మేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా ఇతడికి పేకాట ఆడే అలవాటు ఉంది. కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడికి కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషించాడు. తానే ఓ నిర్వాహకుడిగా మారి పేకాట శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటినే డెన్‌గా మార్చేసిన ధర్మేష్ పరిచయస్తులు, స్నేహితుల్లో పేకాట ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాడు. శిబిరంలోకి రావడానికి ఒక్కొక్కరి నుంచి రూ.500 ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నాడు. వారితో మూడు ముక్కలాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో దాడి చేశారు. ధర్మేష్‌తో పాటుపేకాట ఆడటానికి వచ్చిన 11 మందినిపట్టుకున్నారు. వీరి నుంచి నగదు, పేకముక్కలు తదితరాలు స్వా«ధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బొల్లారం పోలీసులకు అప్పగించారు. -
టెండర్ కథ అడ్డం తిరిగింది !
చిత్తూరు ,బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ అటవీ శాఖ ప్రాంగణంలోకి వచ్చే సందర్శకుల నుంచి వసూలుచేసే ఎంట్రీ ఫీజు వసూలుకు నిర్వహించిన టెండర్ కథ అడ్డం తిరిగింది. ఊహించని విధంగా టెండర్ దాఖలై అటవీ శాఖకు ఆదాయం వచ్చిందని ఉన్నతాధికారులు ఆనందపడినా... అది మూన్నాళ్ల ముచ్చటయ్యింది. హార్సిలీకొండపై అటవీ సముదాయంలో మినీ జూ, ప్రకృతి అధ్యయన కేంద్రం, పిల్లల పార్కు ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి సందర్శకులు రావాలంటే రూ.10 ఎంట్రీ ఫీజు చెల్లించాలి. దీనికోసం గతేడాది టెండర్లు నిర్వహించగా, అత్యధిక టెండర్ రూ.6,07,500 దక్కించుకుంది. ప్రస్తుతం ఏడాది లీజు కోసం గత నెలలో నిర్వహించిన టెండర్లలో ఊహించని విధంగా కొండకు చెందిన సుభహాన్ రూ.11,26,786కు టెండర్‌వేసి దక్కించుకున్నారు. గత నెల 29వ తేదీ ఈ టెండర్‌ను డీఎఫ్ఓ కమిటీ ఖరారు చేసింది. టెండర్‌దారుడు నిబంధనల మేరకు టెండర్ సొమ్ములో 50 శాతం చెల్లించి ఎంట్రీ ఫీజు వసూలు చేపట్టాలి. అయితే టెండర్ ఖరారుచేసి రెండు వారాలైనా ఇప్పటివరకు టెండర్‌దారుడు సుభహాన్ సొమ్ము చెల్లించలేదు. ఈ రోజు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో టెండర్‌దారుడు ముందుకొచ్చే పరిస్థితి లేదని అధికారులకు స్పష్టమైంది. దీంతో అధికారులు ఇప్పుడు రెండో అత్యధిక టెండర్‌దారునికి ఈ టెండర్ ఖరారు చేయాలి. అయితే ఇక్కడో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఓ అటవీ ఉద్యోగి ఈ టెండర్ దక్కించుకోవడం కోసం తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం కొండపై జోరుగా సాగుతోంది. ఈ కారణంగానే మొదటి టెండర్‌దారుడు తప్పుకుంటున్నాడని భోగట్టా. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే మొదటి టెండర్‌దారుడు ముందుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత టెండర్లోనూ ఓ అటవీ ఉద్యోగి కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. ఈ నేఫథ్యంలో టెండర్ వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చినట్టుంది. దాఖలైన టెండర్లను వరుసగా పరిశీలిస్తే..సుభహాన్ (హార్సిలీహిల్స్)–రూ.11,26,786, రవి (పీ.కొత్తకోట)–రూ.9.11 లక్షలు, మురళీకృష్ణ (మదనపల్లె)–8.50 లక్షలు, సుధాకర్ (మదనపల్లె)–రూ.8 లక్షలు, కే.కృష్ణ (చిత్తూరు)–రూ.6,91,990, శరవణ నఘ (చిత్తూరు)–రూ.7,51,777 ఉన్నాయి. ఒక్కొక్కరు రూ.50 వేలు డిపాజిట్టు చెల్లించి టెండర్ వేయగా, అత్యధిక టెండర్‌దారుని డిపాజిట్టు మినహా మిగిలినవారి డిపాజిట్లను తిరిగి చెల్లించారు. ’ఏం చేయబోతారో మొదటి టెండర్‌దారుడు సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో రెండో అత్యధిక టెండర్‌దారునికి కట్టబెడతారా ? లేదా కొత్తగా మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా ? అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహరంలో ఏదో జరుగుతోందన్న అనుమానం ఉన్నతాధికారుల్లోనూ ఉంది. ఈ పరిస్థితుల్లో డిపాజిట్టు విలువను తగ్గించి అత్యధిక సంఖ్యలో టెండర్లు దాఖలయ్యేలా చర్యలు తీసుకుంటే అనుమానాలు తీరుతాయి. లేదంటే జరుగుతున్న ప్రచారం నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. డిపాజిట్ ఇవ్వబోం అత్యధిక టెండర్‌దారు సుభహాన్ టెండర్ సొమ్ము చెల్లించడం లేదు. దీంతో అతడు చెల్లించిన రూ.50 వేలు డిపాజిట్ తిరిగి ఇవ్వబోం. అటవీశాఖ ఖాతాలో జమచేస్తాం. టెండర్ ఎవరికి ఖరారు చేయాలన్నది ఇంకా నిర్ణయం జరగలేదు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకొవాల్సి ఉంది.–ఈశ్వరయ్య, రేంజర్,టెండర్ కమిటీ సభ్యుడు -
పార్కుల్లో ప్రవేశం మరింత భారం
సాక్షి, హైదరాబాద్: కుటుంబంతో సరదాగా గడిపేందుకు.. బంధుమిత్రులతో ఆనందంగా ఉండేందుకు పార్కులకు వచ్చే సందర్శకులకు ప్రవేశ రుసుం ఇక మరింత భారం కానుంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) ఆధ్వర్యంలో నడుస్తున్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కులలో ప్రవేశ రుసుం పెంచాలని అధికారులు నిర్ణయించారు. పిల్లల ప్రవేశ రుసుంను రూ.10 నుంచి రూ.15కు, పెద్దల ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.25కు పెంచారు. పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు అడ్డా.. ఎన్టీఆర్ గార్డెన్తో పాటు లుంబినీ పార్కులు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు అడ్డాగా మారాయి. శని, ఆదివారాల్లో కుటుంబసభ్యులు పిల్లలతో కలిసి ఈ పార్కులకు క్యూ కడుతుంటారు. ఇప్పటికే ఈ మూడు పార్కుల నుంచి నెలసరి ఆదాయం సీజన్లో రూ.1.20 కోట్ల వరకు వస్తుండగా, అన్‌సీజన్‌లో రూ.75 లక్షలు వస్తోంది. తాజాగా ప్రవేశ రుసుం పెంపుతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బీపీపీ అధికారులు భావిస్తున్నారు. వాకర్లకు తప్పని పెంపు.. సంజీవయ్య పార్కులో ప్రతిరోజూ ఉదయం వేళలో దాదాపు 500 మందికిపైగా వాకర్లు వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నడవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే వీరికి నెలసరి పాస్ కింద రూ.75 వసూలు చేస్తున్నారు. తాజాగా ప్రవేశ రుసుం పెంపు నిర్ణయంతో వాకర్లకు కూడా నెలకు వసూలు చేస్తున్న రూ.75ను రూ.100కు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
నేలమఠంలో భక్తుల నిలువుదోపిడీ
బనగానపల్లె: పట్టణం సమీపంలోని జుర్రేరు నది ఒడ్డున ఉన్న వీరప్పయ్యస్వామి నేలమఠంలో భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఆలయంలో అనుమతి లేకున్నా ప్రవేశ రుసం వసూలు చేయడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు టెంకాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. నేలమఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రచించడం ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏపీ, తెలంగాణకు చెందిన భక్తులు నిత్యం స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. సాధారణలో రోజుల్లో రోజుకు 150–200 మంది, మహాశివరాత్రి, కార్తీక మహోత్సవాలు, ఆరాధన మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. టిక్కెట్ కౌంటర్ లేకున్నా.. సాధారణంగా ఆలయంలో టికెట్ కౌంటర్ ఉంటేనే ప్రవేశ రుసం వసూలు చేస్తారు. అయితే ఇక్కడ కౌంటర్ లేకున్నా భక్తుల నుంచి డబ్బు వసూలు చేయడం గమనార్హం. ఒక్కో భక్తుడి వద్ద రూ.5 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆలయ ప్రధాన అర్చకుడు తన వ్యక్తులను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విధంగా భక్తుల నుంచి ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. టెంకాయల విక్రయానికి వేలం వేస్తే ఏడాదికి కనీసం రూ.2 లక్షల దాకా ఆదాయం వస్తుందని భక్తులు చెబుతున్నారు. అయితే వేలం లేకపోవడంతో ఆలయ అర్చకుడే టెంకాయలు విక్రయిస్తున్నాడని పేర్కొంటున్నారు. మార్కెట్లో రూ.15 పలికే టెంకాయను రూ.25 నుంచి రూ.30 దాకా విక్రయిస్తున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకుంటే ఒట్టు.. నేలమఠంలో జరిగే వ్యవహారాలన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. అయితే ఆలయ అర్చకుడు, సంబంధిత అధికారి మధ్య అవగాహన ఉండడంతోనే అక్రమాలపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ కమిటీ లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో వెలిసిన గరిమిరెడ్డి అచ్చమ్మ మఠం, రవ్వలకొండపై వెలిసిన వీరప్పయ్య స్వామి నేలమఠం దేవదాయశాఖ పరిధిలో లేనప్పటికీ టిక్కెట్లను ఏర్పాటు చేసి వచ్చిన డబ్బుతో ఆలయ అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారు. ఇక్కడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. డబ్బు వసూలు చేస్తున్నారు ఆరాధనోత్సవాల సందర్భంగా వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరి నుంచి రూ.5 వసూలు చేస్తున్నారు. టిక్కెట్ అడిగితే ఇవ్వడం లేదు. టిక్కెట్ ఇవ్వకుండా డబ్బు వసూలు చేయడం ఎక్కడా లేదు. – కె శ్రీహరి, మడనూరు(ఒంగోలు జిల్లా) -
టాలెంట్...మోసం
నెల్లూరు(విద్య) : రంగురంగుల బ్రోచర్లు... బంపర్ ఆఫర్లు... కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, ఉచిత విద్యాబోధన, ఇలా రకరకాల ఆకర్షణలతో తమ టాలెంట్‌నంతా ఉపయోగించి టెస్ట్ పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేయడం రోజురోజుకీ పెరిగిపోతుంది. కొందరైతే ప్రతి స్కూల్‌కు తిరిగి విద్యార్థుల వద్ద నుంచి ఎంట్రీ ఫీజులను వసూలుచేసి మరీ పరీక్షలు నిర్వహించకుండానే చేతులెత్తేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించే నెపంతో నిర్వహించే పలు టాలెంట్టెస్ట్లు మోసాలపుట్టగా మారుతున్నాయి. విద్యార్థుల ప్రతిభ కంటే చదువు పేరుతో మోసం చేసే టాలెంట్‌తో చాలామంది బతికేస్తున్నారు. ఈ వాస్తవం తెలియక తల్లిదండ్రులు ప్రతి టాలెంట్టెస్ట్కు తమ పిల్లలను పంపుతున్నారు. తమ పిల్లల్లో ప్రతిభకు కొలమానంగా ఈ పరీక్షలను వారు భావిస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం డబ్బుకు కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి కొంతమంది ప్రతిభ ఉన్న విద్యార్థుల గుర్తించి వారిని వేరే పాఠశాలకు తరలించేందుకు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సొసైటీలుగా ఏర్పడి టాలెంట్ టెస్ట్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి భారీ మొత్తాల్లో వసూలు చేస్తున్నారు. ఆ సంస్థలకు కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడం గమనార్హం. విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ఎటువంటి టాలెంట్ టెస్ట్‌లను నిర్వహించకూడదు. ఇందుకు విరుద్ధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, ఈసెట్, ఐసెట్, ఎంసెట్లతోపాటు ఉపాధ్యాయ వృత్తి కోసం నిర్వహించే టెట్, డీఎస్సీలకు సైతం మోడల్, టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పలు సంస్థలు మోసం చేస్తున్నాయి. కొద్ది సంస్థలు మాత్రమే కట్టించుకున్న రుసుంకి తగినట్టుగా, సక్రమంగా మంచి ఉద్దేశంతో పరీక్షలను నిర్వహిస్తున్నాయి. జిల్లాస్థాయిలో ఉండే ఈ మోసపు టాలెంట్ ప్రస్తుతం మండల స్థాయికి పాకింది. తాజాగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట లక్ష్మీపురానికి చెందిన సి.బాపూజీ హిందీ వికాస కేంద్రం నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్ వివాదానికి తెరతీసింది. విద్యార్థుల నుంచి రూ.100లు వసూలు చేసి, హాల్ టికెట్ ఇచ్చి 397 మందికి పరీక్షలు నిర్వహించకుండానే ఆ సంస్థ ప్రతినిధి ఎస్కే అలీఅహ్మద్ చేతులెత్తేశాడు. పైగా ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తామని ప్రజలను మోసం చేశాడు. ఉన్నత విద్యను అభ్యసించిన వారే ఇలాంటి టాలెంటెడ్ మోసాలను చేయడాన్ని సాధారణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.