నెల్లూరు(విద్య) : రంగురంగుల బ్రోచర్లు... బంపర్ ఆఫర్లు... కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, ఉచిత విద్యాబోధన, ఇలా రకరకాల ఆకర్షణలతో తమ టాలెంట్‌నంతా ఉపయోగించి టెస్ట్ పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేయడం రోజురోజుకీ పెరిగిపోతుంది. కొందరైతే ప్రతి స్కూల్‌కు తిరిగి విద్యార్థుల వద్ద నుంచి ఎంట్రీ ఫీజులను వసూలుచేసి మరీ పరీక్షలు నిర్వహించకుండానే చేతులెత్తేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించే నెపంతో నిర్వహించే పలు టాలెంట్‌టెస్ట్‌లు మోసాలపుట్టగా మారుతున్నాయి. విద్యార్థుల ప్రతిభ కంటే చదువు పేరుతో మోసం చేసే టాలెంట్‌తో చాలామంది బతికేస్తున్నారు. ఈ వాస్తవం తెలియక తల్లిదండ్రులు ప్రతి టాలెంట్‌టెస్ట్‌కు తమ పిల్లలను పంపుతున్నారు. తమ పిల్లల్లో ప్రతిభకు కొలమానంగా ఈ పరీక్షలను వారు భావిస్తున్నారు.
అయితే నిర్వాహకులు మాత్రం డబ్బుకు కక్కుర్తిపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి కొంతమంది ప్రతిభ ఉన్న విద్యార్థుల గుర్తించి వారిని వేరే పాఠశాలకు తరలించేందుకు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సొసైటీలుగా ఏర్పడి టాలెంట్ టెస్ట్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి భారీ మొత్తాల్లో వసూలు చేస్తున్నారు. ఆ సంస్థలకు కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడం గమనార్హం.
విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ఎటువంటి టాలెంట్ టెస్ట్‌లను నిర్వహించకూడదు. ఇందుకు విరుద్ధంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, ఈసెట్, ఐసెట్, ఎంసెట్‌లతోపాటు ఉపాధ్యాయ వృత్తి కోసం నిర్వహించే టెట్, డీఎస్సీలకు సైతం మోడల్, టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పలు సంస్థలు మోసం చేస్తున్నాయి. కొద్ది సంస్థలు మాత్రమే కట్టించుకున్న రుసుంకి తగినట్టుగా, సక్రమంగా మంచి ఉద్దేశంతో పరీక్షలను నిర్వహిస్తున్నాయి. జిల్లాస్థాయిలో ఉండే ఈ మోసపు టాలెంట్ ప్రస్తుతం మండల స్థాయికి పాకింది.
తాజాగా నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట లక్ష్మీపురానికి చెందిన సి.బాపూజీ హిందీ వికాస కేంద్రం నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్ వివాదానికి తెరతీసింది. విద్యార్థుల నుంచి రూ.100లు వసూలు చేసి, హాల్ టికెట్ ఇచ్చి 397 మందికి పరీక్షలు నిర్వహించకుండానే ఆ సంస్థ ప్రతినిధి ఎస్‌కే అలీఅహ్మద్ చేతులెత్తేశాడు. పైగా ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తామని ప్రజలను మోసం చేశాడు. ఉన్నత విద్యను అభ్యసించిన వారే ఇలాంటి టాలెంటెడ్ మోసాలను చేయడాన్ని సాధారణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
టాలెంట్...మోసం
Published Tue, Feb 24 2015 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement