ఆలయ ప్రధాన ద్వారం నుంచి డబ్బు వసూలు చేస్తున్న దృశ్యం
బనగానపల్లె: పట్టణం సమీపంలోని జుర్రేరు నది ఒడ్డున ఉన్న వీరప్పయ్యస్వామి నేలమఠంలో భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఆలయంలో అనుమతి లేకున్నా ప్రవేశ రుసం వసూలు చేయడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు టెంకాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. నేలమఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రచించడం ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏపీ, తెలంగాణకు చెందిన భక్తులు నిత్యం స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. సాధారణలో రోజుల్లో రోజుకు 150–200 మంది, మహాశివరాత్రి, కార్తీక మహోత్సవాలు, ఆరాధన మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు.
టిక్కెట్ కౌంటర్ లేకున్నా..
సాధారణంగా ఆలయంలో టికెట్ కౌంటర్ ఉంటేనే ప్రవేశ రుసం వసూలు చేస్తారు. అయితే ఇక్కడ కౌంటర్ లేకున్నా భక్తుల నుంచి డబ్బు వసూలు చేయడం గమనార్హం. ఒక్కో భక్తుడి వద్ద రూ.5 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆలయ ప్రధాన అర్చకుడు తన వ్యక్తులను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విధంగా భక్తుల నుంచి ఏడాదికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. టెంకాయల విక్రయానికి వేలం వేస్తే ఏడాదికి కనీసం రూ.2 లక్షల దాకా ఆదాయం వస్తుందని భక్తులు చెబుతున్నారు. అయితే వేలం లేకపోవడంతో ఆలయ అర్చకుడే టెంకాయలు విక్రయిస్తున్నాడని పేర్కొంటున్నారు. మార్కెట్లో రూ.15 పలికే టెంకాయను రూ.25 నుంచి రూ.30 దాకా విక్రయిస్తున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకుంటే ఒట్టు..
నేలమఠంలో జరిగే వ్యవహారాలన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. అయితే ఆలయ అర్చకుడు, సంబంధిత అధికారి మధ్య అవగాహన ఉండడంతోనే అక్రమాలపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ కమిటీ లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో వెలిసిన గరిమిరెడ్డి అచ్చమ్మ మఠం, రవ్వలకొండపై వెలిసిన వీరప్పయ్య స్వామి నేలమఠం దేవదాయశాఖ పరిధిలో లేనప్పటికీ టిక్కెట్లను ఏర్పాటు చేసి వచ్చిన డబ్బుతో ఆలయ అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నారు. ఇక్కడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
డబ్బు వసూలు చేస్తున్నారు
ఆరాధనోత్సవాల సందర్భంగా వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరి నుంచి రూ.5 వసూలు చేస్తున్నారు. టిక్కెట్ అడిగితే ఇవ్వడం లేదు. టిక్కెట్ ఇవ్వకుండా డబ్బు వసూలు చేయడం ఎక్కడా లేదు. – కె శ్రీహరి, మడనూరు(ఒంగోలు జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment